logo

బడిబాటకు సై!

ప్రభుత్వ పాఠశాలలు కొత్తగా చేరే విద్యార్థులతో కళకళలాడుతున్నాయి. పాఠశాలల పునఃప్రారంభం నేపథ్యంలో పాఠశాలల్లో చేరేందుకు సిద్ధమయ్యారు.

Published : 20 Jun 2024 04:22 IST

నేను బడికి పోతానంటున్న విద్యార్థులు

ఏఆర్‌కేఆర్‌ పురపాలకోన్నత పాఠశాలలో కొత్తగా చేరుతున్న విద్యార్థుల
వివరాలు నమోదు చేసుకుంటున్న ఉపాధ్యాయుడు

భీమవరం పట్టణం, న్యూస్‌టుడే:  ప్రభుత్వ పాఠశాలలు కొత్తగా చేరే విద్యార్థులతో కళకళలాడుతున్నాయి. పాఠశాలల పునఃప్రారంభం నేపథ్యంలో పాఠశాలల్లో చేరేందుకు సిద్ధమయ్యారు. విద్యార్థులు ఎక్కడ, ఏ పాఠశాలలో చేరతారన్నది ఇప్పటికే ఉపాధ్యాయులు సేకరించారు. విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి అంగీకార పత్రాలు తీసుకున్నారు. బడి బయట పిల్లలను గుర్తించి వాళ్లను కూడా ప్రభుత్వ పాఠశాలల్లో చేర్చేందుకు నేను బడికిపోతా కార్యక్రమాన్ని చేపట్టారు.

ఇంటింటికీ వెళ్లి.. అవగాహన కల్పిస్తున్నారు

పాఠశాలలు పునః ప్రారంభం రోజుల్లో బడికి దూరంగా ఉంటున్న పిల్లలను గుర్తించం ఏటా జరుగుతుంది. బడి బయట విద్యార్థులను, బడిఈడు పిల్లలను పాఠశాలల్లో చేర్చుతారు. ఇలాంటి విద్యార్థులను గుర్తించి బడిలో చేర్చడానికి నేను బడికి పోతా కార్యక్రమాన్ని పాఠశాల విద్యాశాఖ ప్రారంభించింది. 6-14ఏళ్ల పిల్లలు బడికి దూరం కాకూడదని, డ్రాపౌట్‌ పిల్లలను తిరిగి పాఠశాలల్లో చేర్చాలనేది దీని ఉద్దేశం. ఈ నెల 13 నుంచి ప్రారంభమైన ప్రత్యేక డ్రైవ్‌ జులై 12వరకు కొనసాగుతుంది. గతంలో వైకాపా ప్రభుత్వం తూతూమంత్రంగా నిర్వహించడంతో లక్ష్యం నీరుగారింది. దాంతో బడిబయట పిల్లల సంఖ్య ఎక్కువగా ఉండేది.

ఉన్నతాధికారుల పర్యవేక్షణ

చాలాచోట్ల విద్యార్థులు బడుల్లో చేరడంలేదు. తల్లిదండ్రులు కూలి పనులకు ఇతర ప్రాంతాలకు వెళ్లేటప్పుడు వెంట తీసుకెళ్తున్నారు. తిరిగి స్వస్థలాలకు చేరేసరికి విద్యాసంవత్సరం సగం పూర్తవడంతో పాఠశాలకు దూరంగా ఉంటున్నారు. కొందరు ప్రైవేటు పాఠశాలల్లో చదివేందుకు చేరుతున్నారు, రుసుములు సకాలంలో చెల్లించలేక మధ్యలోనే మానేస్తున్నారు. అలాంటివాళ్లందరూ బడి బయట విద్యార్థులుగా మారుతున్నారు. ఇలాంటి విద్యార్థుల టీసీలను ఆయా ప్రైవేటు పాఠశాలలు ఇవ్వాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. గత ఏడాది జిల్లాలో 1240 మంది విద్యార్థులను గుర్తించారు, వాళ్లను పాఠశాలలో పూర్తిస్థాయిలో చేర్చే వరకు అప్పటి కలెక్టర్‌ పి.ప్రశాంతి కృషి చేశారు. ఈ ఏడాది పూర్తిస్థాయిలో విజయవంతం చేయాలని పాఠశాల విద్యాశాఖ ఆర్జేడీ జి.నాగమణి ఆదేశించారు. కొత్తగా చేరికలతోపాటు బడిబయట విద్యార్థులంతా పాఠశాలల్లో చేరేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులు, ఉపాధ్యాయులకు సూచించారు.

ప్రత్యేక కార్యక్రమాలు

జిల్లాస్థాయిలో ప్రదర్శనలు, గ్రామసభ ద్వారా పిల్లలను బడిలో చేర్చడంపై అవగాహన కల్పించడం. ఇందుకోసం బడిఉత్సవాన్ని నిర్వహిస్తారు. విద్యార్థినులు బడిబయట ఉండకూడదని బాలికలతో ప్రతిజ్ఞ చేయిస్తున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 550 మంది ఉన్నట్లు గుర్తించారు. వార్డులు, గ్రామాలకు వెళ్లి విద్యాసదస్సులు నిర్వహిస్తారు, విద్యకోసం ప్రభుత్వం అందించే సౌకర్యాలు వివరిస్తారు. గుర్తించిన పిల్లలను యూడైస్‌లో నమోదు చేస్తారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని