logo

మాటు వేసి.. మాయం చేసి!

పక్కాగా ప్లాన్‌ చేసి మాటు వేస్తారు. ఆదమరిస్తే ఏమార్చేస్తారు. రెప్పపాటు కాలంలోనే ద్విచక్ర వాహనాలను మాయం చేస్తారు. కొన్నాళ్లుగా ఉమ్మడి జిల్లాలో నమోదవుతున్న వాహన చోరీల తీరిది.

Published : 20 Jun 2024 04:46 IST

క్షణాల్లో ద్విచక్ర వాహనాల చోరీ
నిందితుల్లో యువకులే అధికం

పక్కాగా ప్లాన్‌ చేసి మాటు వేస్తారు. ఆదమరిస్తే ఏమార్చేస్తారు. రెప్పపాటు కాలంలోనే ద్విచక్ర వాహనాలను మాయం చేస్తారు. కొన్నాళ్లుగా ఉమ్మడి జిల్లాలో నమోదవుతున్న వాహన చోరీల తీరిది. ఈ కేసుల్లో పట్టుబడుతున్న నిందితుల్లో అత్యధికులు యువకులు ఉండటం ఆందోళన కలిగిస్తోంది. సులభంగా డబ్బు సంపాదించాలన్న దురాశతో అడ్డదారులు తొక్కుతూ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు.

 న్యూస్‌టుడే, ఏలూరు టూటౌన్‌

ఉమ్మడి పశ్చిమ జిల్లాలో ద్విచక్ర వాహనాల చోరీలు ఇటీవల విపరీతంగా పెరిగాయి. ఖరీదైన సరికొత్త వాహనాలే లక్ష్యంగా చోరీలకు పాల్పడుతున్నారు. కూడళ్లు, రైతుబజార్లు, నడక మార్గాలు, వాణిజ్య సముదాయాలు తదితర రద్దీ ప్రాంతాల్లో నిలిపిన ద్విచక్ర వాహనాలను అపహరిస్తున్నారు. వరుస చోరీలతో బాధితులు పోలీసుస్టేషన్లకు క్యూ కడుతున్నారు. దొంగలను పట్టుకోవడం... పోయిన వాహనాలను కనిపెట్టడం పోలీసులకు సవాల్‌గా మారుతోంది. బాధితుల వివరాలు నమోదు చేసుకుని.. ఎక్కడికక్కడ సీసీ కెమెరాల ఫుటేజీలు పరిశీలించి.. నిందితులను పట్టుకోవడంలో పోలీసులు తలమునకలవుతున్నారు.

తొలుత రెక్కీ... ఆపై అపహరణ..

యజమానులు ద్విచక్ర వాహనాలను ఎక్కడైనా నిలిపి... తమ పనులు ముగించుకొని నిమిషాల వ్యవధిలోపు వెనక్కి వస్తున్నా... అప్పటికే వాహనాలు చోరీకి గురవుతున్నాయి. దొంగలు ఇద్దరు, ముగ్గురు ఉంటారని... రద్దీ కూడళ్లలో మాటు వేస్తారని.. వాహనాన్ని నిలిపిన వ్యక్తి లోపలికి వెళ్లగానే దొంగల్లో ఒకరు అతడ్ని అనుసరిస్తారని పోలీసులు చెబుతున్నారు. ఒకరు రెక్కీ నిర్వహిస్తారని వివరించారు. యజమాని కదలికలను మరో దొంగకు తెలియజేస్తాడని... అతడు తిరిగొచ్చేలోపు వాహనాన్ని అపహరించేస్తున్నారు. ఇందుకోసమే వినియోగదారులు మెరుగైన వాహన లాక్‌లు వాడాలని... హ్యాండిల్‌ లాక్‌తో పాటు టైరుకు, ఫోర్కుకు కలిపి ఉండేలా యు  షేప్‌ లాక్‌లు వినియో గించాలని పోలీసులు  సూచిస్తున్నారు.

వ్యసనాలకు అలవాటు పడి...

వ్యసనాలకు బానిసైన యువకులే ద్విచక్ర వాహనాలను ఎక్కువగా చోరీ చేస్తున్నారని అధికారులు చెబుతున్నారు. బెట్టింగ్‌లు, మద్యం, ఇతర మత్తు పదార్థాలకు బానిసై అప్పులు చేయడం... వాటిని తీర్చేందుకు అడ్డదారులు అన్వేషించడం పరిపాటిగా మారిందని పేర్కొంటున్నారు. అప్పులు తీర్చేందుకు ద్విచక్ర వాహనాల దొంగతనాలకు పాల్పడుతున్నారని వివరిస్తున్నారు. రూ.లక్ష విలువైన వాహనాన్ని సైతం రూ.20 వేల నుంచి రూ.25 వేలకు విక్రయిస్తున్నారని తెలియజేస్తున్నారు.

  •  గతేడాది వీరవాసరం మండలంలో ఒకే ప్రాంతానికి చెందిన పది మంది యువకులు ద్విచక్ర వాహనాల చోరీ కేసుల్లో పట్టుబడ్డారు. వారంతా సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో చోరీలకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది.
  •  కొన్నాళ్ల కిందట భీమవరం, పాలకోడేరు పరిధిలో ఖరీదైన ద్విచక్ర వాహనాల చోరీ కేసుల్లో పట్టుబడిన వారంతా యువకులే. రూ.1.70 లక్షల విలువైన వాహనాన్ని కేవలం రూ.18 వేలకే విక్రయించి సొమ్ము చేసుకున్నట్లు నిందితుల్లో ఒకరు చెప్పారు.
  •  గతేడాది ఏలూరు సీసీఎస్‌ పోలీసులు అపహరణకు గురైన ఖరీదైన బుల్లెట్లు, పల్సర్లు, ఇతర ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఇక్కడా నిందితులందరూ ముప్పై ఏళ్లలోపు యువకులే.

 సులభంగా సంపాదించేందుకు...

కొందరు యువకులు సులభంగా సంపాదించేందుకు వాహనాలు చోరీ చేస్తున్నారు. ఫలితంగా జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. కేసుల్లో ఇరుక్కుంటున్నారు. చోరీకి గురైన వాహనాలను గుర్తించి త్వరితగతిన స్వాధీనం చేసుకుంటున్నాం. ఎస్పీ మేరీ ప్రశాంతి ఆదేశానుసారం పలు బృందాలు వాహనాలను గుర్తించే పనిలో ఉన్నాయి.

 సీహెచ్‌ మురళీకృష్ణ, సీసీఎస్‌ సీఐ, ఏలూరు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని