logo

అన్నదాతకు మీరే అండా దండా

పశ్చిమ డెల్టాలో అతి ప్రధానమైన జలవనరుల, డ్రెయిన్ల వ్యవస్థ గడిచిన అయిదేళ్లలో అస్తవ్యస్తంగా మారింది. తుమ్మితే ఊడిపోయేలా లాకుల తలుపులు ఎప్పుడు మొరాయిస్తాయో తెలియని స్థితిలో అవుట్‌ఫాల్‌ స్లూయిజ్‌లున్నాయి.

Published : 20 Jun 2024 04:31 IST

జలవనరులకు జవసత్వాలివ్వాల్సిందే
అయిదేళ్ల వైకాపా పాలనలో అధ్వానంగా నిర్వహణ
పాలకొల్లు, న్యూస్‌టుడే

పాలకొల్లు ఆవ డ్రెయిన్‌లో తూడు ఇలా

పశ్చిమ డెల్టాలో అతి ప్రధానమైన జలవనరుల, డ్రెయిన్ల వ్యవస్థ గడిచిన అయిదేళ్లలో అస్తవ్యస్తంగా మారింది. తుమ్మితే ఊడిపోయేలా లాకుల తలుపులు ఎప్పుడు మొరాయిస్తాయో తెలియని స్థితిలో అవుట్‌ఫాల్‌ స్లూయిజ్‌లున్నాయి. వీటన్నింటిని గాడిలో పెట్టగలిగేది జలవనరులశాఖ. అంతటి ప్రతిష్ఠాత్మక శాఖకు జిల్లాలోని పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు మంత్రిగా గురువారం బాధ్యతలు స్వీకరిస్తున్న తరుణంలో అవస్థల్లో ఉన్న వ్యవస్థ అంతా ఆయన చేయూత కోరుతోంది. కాలువలు, డ్రెయిన్ల వ్యవస్థపై పూర్తి అవగాహన ఉన్న మంత్రి జిల్లాలోని ఆ శాఖకు సంబంధించిన పనులన్నీ ఇక ప్రగతిబాట పట్టిస్తారని అంతా ఆశిస్తున్నారు.

శిథిలస్థితిలో లక్ష్మీపాలెం లాకులు

ఆధునికీకరించాల్సిందే..

సాగునీటి కాల్వల నిర్వహణ పనులకు గత ప్రభుత్వం ఏటా నీళ్లొదిలేయడం తప్ప, ఒక్క ఏడాది కూడా పూర్తిస్థాయి నిధులు మంజూరు చేయలేదు. జిల్లాలోని నాలుగు డివిజన్ల పరిధిలోని 11 ప్రధాన పంటకాల్వల కింద సుమారు 2.50 లక్షల ఎకరాల ఆయకట్టు సాగవుతుంది. ఈ ఏడాది కూడా నిర్వహణ పనులకు రూ.17.14 కోట్లతో 150కు పైగా పనులు చేయడానికి జలవనరులశాఖ ప్రతిపాదనలు చేసింది. కానీ పైసా విడుదల చేయలేదు. వచ్చే ఏడాది సకాలంలో నిధులు మంజూరు చేసి టెండర్ల ప్రక్రియ వేగంగా పూర్తిచేసి కాలువలు కట్టగానే ఆధునికీకరణ పనులు జరిగేలా మంత్రి చూడాల్సి ఉంది.

లాకులు కాదు లీకులే

ఆంగ్లేయుల కాలంలో నిర్మించిన లాకుల తలుపులు చాలాచోట్ల ఊడిపోయి సాగునీరు వృథాగా పోతున్నా పట్టించుకున్న నాథుడు లేకపోయాడు. ఉమ్మడి జిల్లాలో నీటితీరువా రూపేణా ఏటా రూ.20 కోట్లు వరకు రైతుల నుంచి ఆదాయం వస్తోంది. ప్రధాన పంటలన్నింటికీ మార్కెట్‌ కమిటీల ద్వారా శిస్తు రూపేణా మరో రూ.70 కోట్లు వరకు కడుతున్నారు. ఇంత ఆదాయం ఇస్తున్న అన్నదాతల మేలు కోరి లాకులను బాగుచేయించాలి. మార్కెట్‌ కమిటీలకు పనులు చేసుకునేలా స్వేచ్ఛనివ్వాలి.


మంత్రి నిమ్మలపైనే రైతుల ఆశలు

జిల్లాలో 21 మేజర్, 59 మీడియం, 500పైగా మైనర్‌ డ్రెయిన్లున్నాయి. అయిదేళ్లుగా వీటిలో బకెట్టు మట్టి కూడా పూడికతీయకపోవడంతో మొత్తం డ్రెయిన్లు పూడిపోయాయి. ఉప్పుటేరులో డ్రెడ్జింగ్‌ కోసం ప్రతిపాదించిన రూ.25 కోట్లు, గునుపూడిసౌత్‌ డ్రెయిన్‌ పూడికతీత కోసం ప్రతిపాదించిన రూ.2.5 కోట్లు విడుదల చేయిస్తే ఆయా డ్రెయిన్లు అభివృద్ధి చెందుతాయి. నక్కల, కాజ, తూర్పుకొక్కిలేరు, ముసికేపాలెం అవుట్‌ఫాల్‌ స్లూయిజ్‌ల మరమ్మతులు చేసేందుకు గుత్తేదారులకు భరోసా ఇచ్చి పనులు జరిగేలా చూడాలి. రెగ్యులేటర్ల మరమ్మతులు, అవుట్‌ఫాల్‌ స్లూయిజ్‌ల అభివృద్ధి పనులంటూ గడిచిన రెండేళ్లలో రూ.500 కోట్లు ఇవ్వాలని డ్రెయిన్లశాఖ చేసిన ప్రతిపాదనలు కార్యరూపం దాల్చేలా కృషి చేయాలి. ఇవన్నీ జరిగిన నాడు సాగునీటితోపాటు తాగునీటి ఇబ్బందులు దూరమవుతాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని