logo

యోగా ప్రాచీన సంస్కృతిలో భాగం

భారత ప్రాచీన సంస్కృతిలో యోగా ఒక భాగమని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమలశాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ అన్నారు.

Published : 22 Jun 2024 04:08 IST

 కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాసవర్మ

 భీమవరం పట్టణం, న్యూస్‌టుడే: భారత ప్రాచీన సంస్కృతిలో యోగా ఒక భాగమని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమలశాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ అన్నారు. భీమవరంలోని భారతీయ విద్యాభవన్స్‌ పాఠశాల ఆవరణలో శుక్రవారం 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన శ్రీనివాసవర్మ మాట్లాడుతూ ప్రస్తుత జీవన విధానంలో మార్పులు వచ్చాయని, మన ప్రాచీన జీవన విధానాన్ని తిరిగి స్వీకరించాలన్నారు. యోగా ప్రతిఒక్కరూ చేయవచ్చని, ఎవరికీ ఎలాంటి పరిమితులు లేవన్నారు. అద్భుత ఫలితాలను ఇచ్చే యోగా ఇప్పుడు విశ్వవ్యాప్తమైందన్నారు. కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ మాట్లాడుతూ శారీరక శ్రమ తగ్గడంతో చిన్నవయసులోనే ఊబకాయం, మధుమేహం, రక్తపోటు వంటి వ్యాధులకు గురవుతున్నామన్నారు. ముఖ్యంగా విద్యార్థులు చదువు, పోటీ పరీక్షల్లో మానసిక ఒత్తిడి నుంచి బయటపడేందుకు ఆటలు, యోగా సాధన చేయాలన్నారు. ఎస్పీ వి.అజిత మాట్లాడుతూ ప్రతిఒక్కరు రోజుకు కనీసం 20 నిమిషాలు శారీరక వ్యాయామం చేయాలన్నారు. ముందుగా కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మతో కలిసి కలెక్టర్, ఎస్పీ, జిల్లా ఉన్నతాధికారులు, విద్యార్థులు యోగాసనాలు వేశారు. భారతీయ విద్యాభవన్స్‌ యాజమాన్యం కేంద్రమంత్రి, కలెక్టర్‌ను సన్మానించారు. ఈ కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్‌ సి.వి.ప్రవీణ్‌ఆదిత్య, జిల్లా రెవెన్యూ అధికారి జె.ఉదయభాస్కరరావు, అదనపు ఎస్పీలు వి.భీమారావు, ఎ.టి.వి రవికుమార్, భీమవరం కమిషనర్‌ ఎం.శ్యామల, యోగా కార్యక్రమ సమన్వయకర్త డాక్టర్‌ బి.శ్రీరాం, డీఎంహెచ్‌వో డాక్టర్‌ డి.మహేశ్వరరావు, భారతీయ విద్యాభవన్స్‌ కార్యదర్శి యు.కె విశ్వనాథరాజు, వైస్‌ఛైర్మన్‌ బీహెచ్‌ అచ్యుతరామరాజు, జిల్లా రైస్‌మిల్లర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు సామంతపూడి శ్రీరామరాజు తదితరులు పాల్గొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని