logo

మస్తర్లలో మతలబు!

అధికారుల పర్యవేక్షణ లోపం కారణంగా మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి.

Updated : 22 Jun 2024 05:28 IST

బినామీల పేర్లు  నమోదు చేస్తూ ఉపాధి హామీలో అక్రమాలు

 తిరుమలంపాలెం చెరువులో ఇటీవల పనిచేసిన చోటే మళ్లీ చేస్తున్న ఉపాధి కూలీలు

ద్వారకాతిరుమల, న్యూస్‌టుడే: అధికారుల పర్యవేక్షణ లోపం కారణంగా మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. మేట్లను అడ్డు పెట్టుకుని క్షేత్ర సహాయకులు అవినీతికి పాల్పడుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రోజూ పని ప్రాంతంలోనే మస్తర్లు వేయాల్సిన మేట్లు వారం చివరిలో ఒకే రోజు వేయడమే అందుకు నిదర్శనం.
ద్వారకాతిరుమల మండలంలో 16,874 జాబ్‌ కార్డులు ఉన్నాయి. సుమారు 26,800 మంది కూలీలు ఉన్నారు. వీరిలో 9800 మంది ఉపాధి పనులకు వస్తున్నారు. గతంలో సహాయకులు కొలతలు ఇచ్చి కూలీలకు మస్తర్లు వేసేవారు. రెండేళ్ల కిందట కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు 50 జాబ్‌ కార్డులకు ఒక మేట్‌ను నియమించారు. వారే రోజూ కూలీలను తీసుకొచ్చి కొలతలు ఇచ్చి పనిచేయించాలి. మస్తర్లు కూడా వేయాలి. అనంతరం ఫోన్‌లో కూలీల ఫొటోలను యాప్‌ ద్వారా అప్‌లోడ్‌ చేయాలి. అయితే తిరుమలంపాలెం, నారాయణపురం, గుణ్ణంపల్లి, బుట్టాయగూడెం తదితర గ్రామాల్లో  నిబంధనల ఉల్లంఘనలు జరిగాయి.

నారాయణపురం మస్తరు షీˆటులో కొంత మందికి హాజరు వేసి, 
రాని వారికి గైర్హాజరు వేయకుండా ఖాళీగా వదిలేసిన వైనం.

ఎలాగంటే..

మేట్లు మస్తర్లను షీˆట్లలో వేయకుండా ముందుగా బినామీ పేర్లను కూడా జత చేసి ఫోన్‌ ద్వారా పంపుతున్నారు. వారి పేర్లు గుర్తు కోసం రాత పుస్తకాల్లో నమోదు చేస్తున్నారు. వారానికోసారి షీˆట్లలో నమోదు చేస్తున్నారు. అదేంటని అడిగితే తమకు ఆలస్యంగా ఇచ్చారని సాకులు చెబుతున్నారు. పలుచోట్ల పనికి వచ్చిన వారికి హాజరు వేసి రాని వారికి గైర్హాజరు అని వేయకుండా ఖాళీలు వదిలేస్తున్నారు. ఇంటికి వెళ్లాక బినామీ పేర్ల మీద మస్తర్లు వేస్తూ సొమ్ములు కాజేస్తున్నారు. ఇలా రూ.లక్షలు దోచుకుంటున్నారు. అధికారులు ఎవరూ పట్టించుకోకపోవడంతో వారి ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. ప్రస్తుతం ప్రభుత్వం మారినా వారి తీరులో మార్పు రాలేదని చెబుతున్నారు.

చర్యలు తీసుకుంటాం

‘అక్రమాలు జరగకుండా ఎప్పటికప్పుడు ఉపాధిహామీ సిబ్బందికి హెచ్చరికలు జారీ చేస్తున్నాం. అవినీతి ఆరోపణలు వచ్చిన చోట విచారణ చేపడతాం. తప్పు జరిగినట్లు తేలితే చర్యలు తీసుకుంటాం’ అని ద్వారకాతిరుమల ఏపీవో హేమంత్‌ తెలిపారు.  

శ్రమ దోపిడీ  జరుగుతోందిలా

ఉపాధి హామీ కూలీలు నిర్ణీత కొలతల ప్రకారం పని పూర్తి చేస్తేనే దానికి అనుగుణంగా కూలి డబ్బులు వస్తాయి.  లేదంటే తగ్గిపోతాయి. అయితే పనికి రాని వాళ్ల పేర్ల మీద కూడా మస్తర్లు వేయడం ద్వారా శ్రమ దోపిడీ జరుగుతోంది. వాస్తవంగా పనిచేసిన కూలీలకు డబ్బులు తక్కువగా వస్తున్నాయి. పలు గ్రామాల్లో వారానికి కూలి డబ్బులు రూ.300  మాత్రమే పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని