logo

అడ్డగోలుగా అప్పగించేస్తారా?

కొందరు అధికారులకు వైకాపా పాలనలో అలవాటైన అడ్డగోలు వైఖరి.. ప్రభుత్వం మారినా కొనసాగుతోంది. దానికి డీసీసీబీలో శుక్రవారం జరిగిన ఇన్‌ఛార్జి సీఈవో అడ్డగోలు నియామకమే ఉదాహరణ.

Updated : 22 Jun 2024 06:01 IST

నిబంధనలకు విరుద్ధంగా డీసీసీబీ ఇన్‌ఛార్జి సీఈవో నియామకం
మంత్రి అచ్చెన్నాయుడు జోక్యంతో హుటాహుటిన తొలగింపు

కొందరు అధికారులకు వైకాపా పాలనలో అలవాటైన అడ్డగోలు వైఖరి.. ప్రభుత్వం మారినా కొనసాగుతోంది. దానికి డీసీసీబీలో శుక్రవారం జరిగిన ఇన్‌ఛార్జి సీఈవో అడ్డగోలు నియామకమే ఉదాహరణ. నిబంధనలకు పాతరేస్తూ జిల్లా ఉన్నతాధికారులు అనర్హుడికి కట్టబెట్టడం పెద్ద దుమారమే రేగింది. ఇప్పటి వరకు వైకాపాతో అంటకాగిన అధికారికి ఉన్నత పదవులు కట్టబెట్టడంలో ఆ అధికారుల ఆంతర్యంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఈనాడు, ఏలూరు, ఏలూరు వన్‌టౌన్, న్యూస్‌టుడే

జిల్లా సహకార కేంద్ర బ్యాంకు 34 శాఖల పరిధిలోని 258 సహకార సంఘాల్లోని రైతుకు రుణాలు, వ్యవసాయ అనుబంధ ప్రోత్సాహకాలు అందించడంలో సీఈవో బాధ్యతలు ఎంతో కీలకం. జిల్లాలోని సహకార సంఘాలు, శాఖలు పరిధిలో దాదాపుగా రూ.3 వేల కోట్లకు పైగా సాగే లావాదేవీల్లో సీఈవో కొలువు ఎంతో ముఖ్యం. ఇప్పటి వరకు సీఈవోగా ఉన్న బి.శ్రీదేవి పదవీ కాలం ఈనెల 20తో ముగిసింది. దీంతో కొత్త సీఈవో వచ్చే వరకు ఇన్‌ఛార్జి సీఈవోకు బాధ్యతలు అప్పగించాల్సి ఉంది. ప్రస్తుతం డీసీసీబీ ఛైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తున్న జేసీ బి.లావణ్యవేణి ఆమె పదవి కాలం పూర్తయిందనే విషయాన్ని కలెక్టర్‌ ప్రసన్నవెంకటేశ్‌ దృష్టికి తీసుకువెళ్లారు. అక్కడే భారీ స్థాయిలో మంతనాలు జరిగాయని తెలుస్తోంది. ఆగమేఘాలపై ప్రస్తుతం బ్యాంకు డీజీఎంగా పనిచేస్తున్న జీఎన్‌వీ సత్యనారాయణకు ఇన్‌ఛార్జి బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసేశారు.

నిబంధనలకు పాతరేసి

జిల్లా సహకార కేంద్ర బ్యాంకులో 2012 నుంచి జనరల్‌ మేనేజర్లుగా(జీఎం) ఉన్నవారు ఇద్దరు, డీజీఎంలుగా పనిచేస్తున్న వారు ముగ్గురున్నారు. నిబంధనల ప్రకారం వీరిలో సీనియార్టీని బట్టి ఒకరిని నియమించాలి. కానీ గత అయిదేళ్లు వైకాపాతో అంటకాగిన, 2021లో డీజీఎంగా నియామకమైన జీఎన్‌వీ సత్యనారాయణను ఇన్‌ఛార్జి సీఈవోగా నియమించారు. ఆప్కాబ్‌ చేయాల్సిన నియామకాలను ఇన్‌ఛార్జి బాధ్యతల పేరుతో జిల్లా అధికారులు ఎలా చేస్తారు..అసలు ఎందుకు చేశారన్నది అనుమానాలకు తావిస్తోంది. దీంతో ఈ పదవి విషయంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగి ఉంటుందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇన్‌ఛార్జిగా నియమితులైన సత్యనారాయణ తాడేపల్లిగూడెం మెయిన్‌ బ్రాంచిలో నోడల్‌ అధికారిగా పనిచేస్తున్న కాలంలో రూ.16 కోట్ల  రుణాల కుంభకోణం వెలుగుచూసింది. ఆ సమయంలో ఆయనపై 53 ఇన్‌స్పెక్షన్‌ విచారణ వేశారు. ఈ నివేదిక ఇంకా రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఒక జూనియర్‌ అధికారి...పైగా అవినీతి ఆరోపణలు ఉన్న వ్యక్తికి ఇటువంటి కీలక పదవి ఎలా కట్టబెడతారని ఆ శాఖలో చర్చ సాగుతోంది.

మంత్రి ఆగ్రహం

అడ్డగోలుగా ఇన్‌ఛార్జి సీఈవో నియామకం జరిగిన విషయం తెలుసుకున్న వ్యవసాయ, సహకార శాఖ మంత్రి అచ్చెన్నాయుడు.. వెంటనే పరిశీలించి జిల్లా ఉన్నతాధికారులతో మాట్లాడారు. నిబంధనలకు విరుద్ధంగా ఎలా నియమిస్తారని ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. దీంతో ఉన్నతాధికారులు వెంటనే నియామకాలను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ విషయమై కలెక్టర్‌ ప్రసన్న వెంకటేశ్‌ వివరణ కోరగా..‘ఇన్‌ఛార్జి బాధ్యతలు కావటం వల్లే నియమించాం..అవినీతి ఆరోపణలు ఉన్నాయనే విషయం నా దృష్టిలో లేదు. విషయం తెలిసిన వెంటనే బాధ్యతల నుంచి తొలగించాం’ అని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని