logo

పోలీసులు కాదు.. వైకాపా కార్యకర్తలే

వైకాపా అయిదేళ్ల అరాచకాలను కొందరు ఖాకీలు తమ విధ్వంస కాండతో పరాకాష్ఠకు తీసుకెళ్లారు. పార్టీ జెండా పట్టుకోని కార్యకర్తల్లా..కండువా కప్పుకోని వీరాభిమానుల్లా విధేయతను ప్రదర్శించారు. వృత్తి గౌరవాన్ని బుగ్గిపాలు చేశారు.

Published : 22 Jun 2024 05:36 IST

అయిదేళ్లు అధికార పార్టీకి వీరవిధేయత
ప్రతిపక్షాలపై అడ్డగోలుగా కేసులు
వైకాపా నేతలు ఊ అంటేనే ఎఫ్‌ఐఆర్‌
అరాచక పాలనకు అన్నివిధాలా అండ
ఈనాడు, భీమవరం

వైకాపా అయిదేళ్ల అరాచకాలను కొందరు ఖాకీలు తమ విధ్వంస కాండతో పరాకాష్ఠకు తీసుకెళ్లారు. పార్టీ జెండా పట్టుకోని కార్యకర్తల్లా..కండువా కప్పుకోని వీరాభిమానుల్లా విధేయతను ప్రదర్శించారు. వృత్తి గౌరవాన్ని బుగ్గిపాలు చేశారు. ప్రతిపక్షాలు నోరు మెదిపితే బెదిరింపులతో గొంతు నొక్కారు. ప్రశ్నిస్తే తప్పుడు కేసులతో బెంబేలెత్తించారు. వైకాపా అక్రమాలపై గొంతు చించుకున్న వారి వేదన అరణ్యరోదనగానే మిగిలిపోయింది.

ఉమ్మడి జిల్లాలో అయిదేళ్ల వైకాపా పాలనలో కొందరు పోలీసుల తీరు చూస్తే వైకాపా కార్యకర్తల కన్నా దారుణంగా ఉంది. పోలీసు దుస్తులకున్న గౌరవాన్ని మంటగలిపేలా పనిచేశారు. అధికార పార్టీ దురాగతాలపై ప్రతిపక్షాలు ఎన్ని ఫిర్యాదులు చేసినా అవన్నీ గాలికిపోవటం తప్ప పట్టించుకోలేదు. వైకాపా ఎమ్మెల్యేలకు, మంత్రులు చెప్పిందానికి గంగిరెద్దులా తలాడించటం తప్ప చేసిందేమీ లేదు. కేసు పెట్టాలన్నా..ఫిర్యాదు తీసుకోవాలన్నా స్థానిక ఎమ్మెల్యే చెప్పాల్సిందే. ప్రతిపక్షాల కార్యకర్తలు చిన్న ధర్నా చేస్తే నానా యాగీ చేసి లాఠీలు ఝుళిపించారు. పలు  సెక్షన్లు పెట్టి కేసులు బనాయించారు. వైకాపా నాయకులు ఎన్ని దురాగతాలు చేసినా కేసులు పెట్టరు. పెట్టినా నామమాత్రపు కేసులతో మమ అనిపించేవారు. జిల్లాలో ఏ సంఘం నిరసనకు పిలుపునిచ్చినా..గృహనిర్బంధాలు చేసి ఇబ్బంది పెట్టారు. ఇలాంటి విధ్వంసం చేసిన పోలీసుల్లో కొందరు బదిలీ అయిపోగా..మరికొందరు ఇంకా కొనసాగుతున్నారు.

కారుమూరి చెప్పిందే శాసనం

తణుకు గ్రామీణ సీఐగా పని చేసిన ఆంజనేయులు  వైకాపా బ్రాండ్‌ అంబాసిడర్‌గా పని చేశారు. వైకాపా నేత కారుమూరి ఆదేశాలను శిరసావహించారు అమరావతి రైతులు ప్రశాంతంగా పాదయాత్ర చేస్తుంటే... అనుమతి లేదని, ఎక్కువ మంది పాల్గొనకూడదని, కొర్రీలు పెట్టి దాదాపు రెండు గంటల పాటు   నిలిపేశారు. తణుకు నరేంద్ర కూడలిలో వైకాపా కార్యకర్తలు రైతుల పాదయాత్రను అడ్డుకునే ప్రయత్నం చేయగా వారికి రక్షణ కల్పిస్తూ అధికారపార్టీ కొమ్ముకాశారు. అత్తిలి మండలంలో వైకాపా కార్యకర్తలు ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేస్తే రూ.10 లక్షలు మామూళ్లు తీసుకుని కడుపునొప్పితో చనిపోయినట్లు కేసు నమోదు చేశారు. తెదేపా అధినేత చంద్రబాబు తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలని పాదయాత్ర చేస్తుంటే ఆరిమిల్లి రాధాకృష్ణ, ఇతర ముఖ్య తెదేపా నాయకులను గృహ నిర్బంధంలో ఉంచి ఇబ్బంది పెట్టారు.

భీమవరంలో మరో భక్తుడు

భీమవరం టూటౌన్‌లో 2019-22 వరకు పని చేసిన సీఐ కృష్ణకుమార్‌ వైకాపాకు అపర భక్తుడిగా పని చేశారు. నియోజకవర్గంలో బలపడుతున్న జనసేనను తొక్కిపెట్టడమే లక్ష్యంగా పని చేశారు. ఎమ్మెల్యే చెప్పిందే ఆయనకు శాసనం. ఆయన ఆదేశాలు అమలు చేయడానికి ఎంతకైనా తెగిస్తారు. వినాయక చవితి ఉత్సవాలు చేస్తున్న జనసేన కార్యకర్త ప్రసాద్‌ను అన్యాయంగా అరెస్ట్‌ చేసి తప్పుడు కేసు పెట్టించారు. జనసేనలో ఉత్సాహంగా పని చేసే యువతను అడ్డగోలు కారణాలతో స్టేషన్‌కు రప్పించి రోజంతా కూర్పోబెట్టి ఇబ్బంది పెట్టేవారు. వైకాపా నాయకులు, కార్యకర్తలు ఎంత నేరం చేసినా పట్టించుకోరు. 21 మంది వైకాపా నాయకులు, కార్యకర్తలు ఓ జూద శిబిరం నిర్వహిస్తూ పట్టుబడినా వారిని తప్పించేశారు.

ప్రతిపక్షాలపై తప్పుడు కేసులు

లోకేశ్‌ పాదయాత్ర నూజివీడులో జరుగుతుండగా వైకాపా కార్యకర్తలు యాత్రకు అడ్డుగా వచ్చి జెండాలు ఊపుతూ..రాళ్లు రువ్వారు. దీంతో యువగళం కార్యకర్తలు ప్రతిఘటించారు. సీఐ అంకబాబు మాత్రం వైకాపా నాయకులపై కాకుండా తెదేపా కార్యకర్తలపై కేసులు నమోదు చేశారు. తెదేపా నాయకులు స్టేషన్‌ ముందు బైఠాయించినా చలనం లేదు.

వైకాపా అజెండా మోస్తూ ఆగడాలు

 తెదేపా యువనేత లోకేశ్‌ తలపెట్టిన యువగళం పాదయాత్ర భీమవరంలో ప్రవేశించగానే తెదేపా నాయకులు, కార్యకర్తలపై వైకాపా మూకలు రాళ్ల వర్షం కురిపించారు. కర్రలు, సోడా సీసాలతో దాడికి తెగబడ్డారు. వైకాపా జెండాలు చేతపట్టుకుని నినాదాలు చేస్తూ రెచ్చగొట్టి వీరంగం సృష్టించారు. వైకాపా శ్రేణుల దాడిలో తెదేపా నాయకులు గాయపడ్డారు. ఇలా జరగడానికి అప్పటి భీమవరం డీఎస్పీ శ్రీనాథ్, సీఐ అడబాల శ్రీనివాస్‌ కారణం. వైకాపా కార్యకర్తలు దాడి చేస్తారని తెదేపా నాయకులు వీరికి సమాచారం ఇచ్చినా అధికార పార్టీపై ఉన్న ప్రేమతో పట్టించుకోలేదు. రోడ్లపై  జెండాలు, కర్రలు పట్టుకుని సవారీ చేసినప్పుడు డీఎస్పీ శ్రీనాథ్‌ అక్కడే ఉండి కూడా నియంత్రించలేదు. సీఐ అడబాల శ్రీనివాస్‌ కేసు నమోదు విషయంలో దారుణంగా వ్యవహరించారు. దాడి చేసిన వైకాపా రౌడీలను వదిలి చింతమనేని ప్రభాకర్, తోట సీతారామలక్ష్మి, కోళ్ల నాగేశ్వరరావు తదితర 13 మంది నాయకులు, 39 మంది యువగళం వాలంటీర్లపై హత్యాయత్నం కేసులు బనాయించారు.

కైకలూరులో కల్లోలం

వైకాపా పాలనలో కైకలూరు ఎస్సైగా పని  చేసిన షణ్ముకసాయి దాష్టీకాలు అన్నీ ఇన్నీ కావు. పార్టీలో ఉంటూనే ఎమ్మెల్యేకు అసమ్మతి నాయకులుగా ఉన్న యలవర్తి శ్రీనివాస్‌ను పర్సు దొంగతనం కేసులో ఇరికించి స్టేషన్‌కు తీసుకువెళ్లారు. ఎమ్మెల్యే అనుచరులకు అప్పగించి స్టేషన్‌లోనే దారుణంగా దాడిచేయించారు. స్టేషన్‌కు వెళ్లి ప్రశ్నించిన   అసమ్మతి నేత పాపారావుగౌడ్‌ను కూడా స్టేషన్‌లోనే దారుణంగా కొట్టారు. అక్కడి నుంచి ముదినేపల్లి బదిలీ అయినా ఇదే పంథా. ఎన్నికల ముందు మండలంలోని 38 మంది కీలక తెదేపా, జనసేన నాయకులపై వారికే తెలియకుండా..రౌడీషీట్లు తెరిచారు. వీరిపై గతంలో కేసులు లేకున్నా తప్పుడు కేసులు నమోదు చేసి రౌడీషీట్లు తెరిచారు. ఇలా ప్రతి విషయంలో ప్రభుత్వ ఉద్యోగిలా కాకుండా పార్టీకి కార్యకర్తలా పని చేశారు.

ఏలూరులో అతి చేసి..

 ప్రస్తుత ఏలూరు గ్రామీణ సీఐ శ్రీనివాస్‌ తెదేపా కార్యకర్తలను శత్రువుల్లా చూశారన్న ఆరోపణలున్నాయి. వైకాపా కార్యకర్తలు పోలవరం కుడిగట్టుపై రాత్రుళ్లు తవ్వకాలు చేస్తుంటే తెదేపా నాయకులు అడ్డుకున్నారు. దీంతో రెచ్చిపోయిన వైకాపా కార్యకర్తలు 9 మందిని ఇష్టారాజ్యంగా కొట్టారు. రెండు కార్లు బద్దలు కొట్టారు. అయినా సీఐకి ఇవేమీ కనిపించలేదు. 9 మంది తెదేపా కార్యకర్తలపై ఎదురు కేసులు బనాయించారు.

  •  ఎస్‌బీ డీఎస్పీగా వచ్చిన శ్రీనివాసాచారి వైకాపా అంటే ప్రాణం తీసుకునేవారు. చింతమనేని అరెస్ట్టు సమయంలో దాదాపు 200 మంది పోలీసులతో మోహరించి దారుణంగా ప్రవర్తించారు. చింతమనేని తరుఫు న్యాయవాది ఇంట్లో ఉంటే అత్యంత కిరాతకంగా పోలీసులతో తలుపులు బద్దలుకొట్టి విధ్వంసం సృష్టించారు.
  • మూడో పట్టణ సీఐగా పని చేసిన రాజాజీ గతంలో తెదేపా కార్యకర్తలను అన్యాయంగా అరెస్టు చేసి..స్టేషన్‌లో నిర్బంధించారు. ఒక రోజంతా కుటుంబ సభ్యులను కానీ, పార్టీ నాయకులను కానీ చూడనివ్వకుండా అతి చేశారు. ఇదేమిటని ప్రశ్నించిన తెదేపా నాయకులను సైతం బెదిరించారు.
     
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని