logo

అగ్రిల్యాబ్‌లు..అలంకారమే

గతేడాది జులై 8న అప్పటి ముఖ్యమంత్రి జగన్‌ దెందులూరు మండలం గోపన్నపాలెంలో అగ్రి టెస్టింగ్‌ ల్యాబ్‌ ప్రారంభించారు. నాబార్డు, ఆర్‌కేవీవై నిధులు రూ.65 లక్షలతో నిర్మించిన ఈ భవనంలో అగ్రి టెస్టింగ్‌ ల్యాబ్‌తో పాటు పశు వ్యాధి నిర్ధారణ ప్రయోగశాలను ఏర్పాటు చేశారు.

Published : 24 Jun 2024 04:11 IST

గతేడాది జులై 8న అప్పటి ముఖ్యమంత్రి జగన్‌ దెందులూరు మండలం గోపన్నపాలెంలో అగ్రి టెస్టింగ్‌ ల్యాబ్‌ ప్రారంభించారు. నాబార్డు, ఆర్‌కేవీవై నిధులు రూ.65 లక్షలతో నిర్మించిన ఈ భవనంలో అగ్రి టెస్టింగ్‌ ల్యాబ్‌తో పాటు పశు వ్యాధి నిర్ధారణ ప్రయోగశాలను ఏర్పాటు చేశారు. భవనమైతే ప్రారంభించారు కానీ రైతులకు సేవలు మాత్రం అందుబాటులోకి రాలేదు. అంతేకాదు పేరుకు ప్రధాన ద్వారం తెరిచి ఉంచుతున్నారు. లోపల ల్యాబ్, ప్రయోగశాల గదులకు తాళాలు వేసి ఉండటం గమనార్హం. దీంతో ల్యాబ్‌కు వచ్చిన రైతులు నిరాశగా తిరిగి వెళ్తున్నారు. కనీసం శుభ్రం చేసేవారు లేకపోవడంతో భవనం మెట్ల ఎదుట పిచ్చిమొక్కలు పెరిగి అపరిశుభ్రంగా మారింది.

దెందులూరు, ఏలూరు గ్రామీణ, న్యూస్‌టుడే: జిల్లాలో అగ్రి టెస్టింగ్‌ ల్యాబ్‌లు అలంకారప్రాయంగా మారాయి. రైతులు, పశు పోషకులకు అందుబాటులో మెరుగైన సేవలందించాలనే లక్ష్యంతో జిల్లా కేంద్రం ఏలూరు మినహా ఆరు నియోజకవర్గాల్లో వీటి నిర్మాణం చేపట్టారు. రైతులు పండించే వివిధ రకాల పంటల సాగుకు అవసరమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల నాణ్యతను ల్యాబుల్లో పరీక్షలు చేసి అన్నదాతలకు నాణ్యమైన సేవలందించాలనేది ప్రభుత్వ లక్ష్యం. ఇక్కడే పశు సంవర్ధక శాఖకు చెందిన పశు వ్యాధి నిర్ధారణ ప్రయోగశాలను ఏర్పాటు చేశారు. ఇక్కడ వరకు బాగానే ఉన్నా చాలాచోట్ల వీటి సేవలు అన్నదాతలకు అందుబాటులో లేవు.

ఏడాదవుతున్నా.. 

నూజివీడు, భీమడోలు, కైకలూరు నియోజకవర్గాల్లో ల్యాబ్‌లు సేవలందిస్తున్నాయని అధికారులు చెబుతున్నా.. వీటి సేవలు అరకొరగానే అందుతున్నాయని కర్షకులు చెబుతున్నారు. చింతలపూడిలో ల్యాబ్‌ నిర్మాణంలో ఉంది. కొయ్యలగూడెం మండలం కె.కన్నాపురంలో ల్యాబ్, ప్రయోగశాలకు సంబంధించిన పరికరాలు లేకపోవడంతో నిరుపయోగంగా ఉంది.  

మొలక శాతం తెలిసేదెలా..

ప్రస్తుత ఖరీఫ్‌ సీజన్‌లో జిల్లాలో సుమారు 2.08 లక్షల ఎకరాల్లో వరి సాగుకు రైతులు సన్నద్ధమవుతున్నారు. విత్తనాలు రైతు భరోసా కేంద్రాల వద్ద అందుబాటులో లేనందున రైతులు వ్యాపారుల వద్ద, బయట మార్కెట్లో కొనుగోలు చేస్తున్నారు. ఇవి ఎంత మేరకు నాణ్యమైనవి.. ఎంత శాతం మొలక వస్తుందో తెలుసుకోవాలంటే అగ్రి టెస్టింగ్‌ కేంద్రాల్లో పరీక్షలు చేయించాల్సి ఉంటుంది. సేవలు అందుబాటులో లేకపోవడంతో రైతులు బయట కొనుగోలు చేసిన విత్తనాల్ని అలాగే వినియోగిస్తున్నారు.

కల్తీ సంగతేమిటి?

వరితో పాటు మొక్కజొన్న, పెసర, మినుము, పత్తి, కూరగాయలు, ఆకుకూరలు, ఇతర ఉద్యాన పంటలు వేలాది ఎకరాల్లో సాగు చేస్తున్నారు. వీటికి అవసరమైన ఎరువులు, పురుగు మందుల్లోనూ కల్తీ జరుగుతోంది. కల్తీ విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు విక్రయాలను అరికట్టాలంటే ల్యాబుల్లో పరీక్షలు చేయాల్సి ఉంటుంది. అయితే ల్యాబ్‌లు వినియోగంలో లేవు. కొత్త ప్రభుత్వమైన వీటి సేవలు అందుబాటులోకి తీసుకురావాలని అన్నదాతలు కోరుతున్నారు. 

వేధిస్తున్న సిబ్బంది  కొరత

ల్యాబ్‌లు, ప్రయోగశాలల్లో పరీక్షలు చేసేందుకు సాంకేతిక సిబ్బంది అవసరం. అయితే వారిని నియమించలేదని తెలుస్తోంది. అధికారులు మాత్రం ఏడీఏ కార్యాలయాల్లోని సాంకేతిక సిబ్బందిని ల్యాబుల్లో వినియోగిస్తున్నామని చెబుతున్నారు. క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే సిబ్బంది ఎక్కడా కానరావడం లేదు. ఈ విషయమై జిల్లా వ్యవసాయ అధికారి హబీబ్‌ బాషా మాట్లాడుతూ నూజివీడు, భీమడోలు, కైకలూరులలో ల్యాబ్‌లు సేవలందిస్తున్నాయని, చింతలపూడిలో భవన నిర్మాణం జరుగుతోందన్నారు. కొత్త ప్రభుత్వం మార్గదర్శకాలను అనుసరించి మిగతా చోట్ల కూడా సేవలు వినియోగంలోకి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని