logo

‘ఇన్‌లైన్‌ క్లోరినేషన్‌’ విధానంలో తాగునీటి సరఫరా

గ్రామాల్లో మంచి నీటి ట్యాంకుల ద్వారా శుద్ధి చేసిన  నీటి  సరఫరాకు ‘ఇన్‌లైన్‌ క్లోరినేషన్‌’ విధానాన్ని అమలు చేస్తున్నారు.

Published : 24 Jun 2024 04:13 IST

పైలట్‌ ప్రాజెక్టుగా పలు గ్రామాల్లో అమలు

ట్యాంకు వద్ద అమర్చిన ఆటో క్లోరినేషన్‌ పరికరం

బుట్టాయగూడెం, న్యూస్‌టుడే: గ్రామాల్లో మంచి నీటి ట్యాంకుల ద్వారా శుద్ధి చేసిన  నీటి  సరఫరాకు ‘ఇన్‌లైన్‌ క్లోరినేషన్‌’ విధానాన్ని అమలు చేస్తున్నారు. కొత్తగా చేపట్టిన ఈ విధానంలో ట్యాంకుల వద్ద ఏర్పాటు చేసిన పరికరాలు, పంపుల నుంచి ట్యాంకులో నీరు పరిశుభ్రమై నేరుగా కుళాయిలకు సరఫరా అవుతుంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జల్‌జీవన్‌ మిషన్‌లో భాగంగా గ్రామీణ మంచినీటి పథకాలు, సరఫరా శాఖ ద్వారా ఎవిడెన్స్‌ యాక్షన్‌ సంస్థ సాంకేతిక భాగస్వామ్యంతో ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు. మన్యం ప్రాంతంలోని బుట్టాయగూడెం మండలం అంతర్వేదిగూడెం, నాగులగూడెంతో పాటు జిల్లాలోని మాదేపల్లి, గోపన్నపాలెం, రంగాపురం, బలివే గ్రామాలను పైలట్‌ ప్రాజెక్టులుగా ఎంపిక చేసి కొత్త విధానాన్ని అమలు చేస్తున్నారు.

ట్యాంకు ఎక్కే పని లేకుండా..

పాత విధానంలో పదిహేను రోజులకోసారి పంచాయతీ సిబ్బంది మెట్ల ద్వారా ట్యాంకు పైకి ఎక్కి శుభ్రం చేసి క్లోరిన్‌ మాత్రలు కలిపే వారు. అది ప్రమాదకరం కావడమే కాకుండా శ్రమతో కూడింది. దీంతో సకాలంలో క్లోరినేషన్‌ నిర్వహణ జరిగేది కాదు. ‘ఇన్‌ లైన్‌ క్లోరినేషన్‌’ విధానం ద్వారా ట్యాంకుకు సంబంధించిన బోరు గొట్టానికి డివైజ్‌ పంపును అనుసంధానం చేసి క్లోరిన్‌ మాత్రను అమర్చి ట్యాంకుపైకి ఆ నీరు వెళ్లి క్లోరినేషన్‌ అయ్యేలా యూనిట్‌ ఏర్పాటు చేస్తారు. తద్వారా గ్రామంలోని ప్రతి కుళాయికీ శుద్ధి చేసిన తాగునీరు సరఫరా అవుతుంది. తాగునీరు క్లోరినేషన్‌ వల్ల నీటిలో ఉండే బ్యాక్టీరియా నశించి నీరు శుద్ధి అవుతుంది. దీని వల్ల డయేరియా, కలరా, టైఫాయిడ్, నీటి ద్వారా వ్యాప్తి చెందే వ్యాధులను నివారించుకోవచ్చు. ట్యాంకు వద్ద ఏర్పాటు చేసిన యూనిట్‌ గొట్టానికి 200 గ్రాముల పరిమాణం ఉన్న క్లోరిన్‌ మాత్రను అమర్చితే లక్ష లీటర్ల నీటికి సరిపోతుందని ఎవిడెన్స్‌ యాక్షన్‌ సంస్థ రీజినల్‌ కో-ఆర్డినేటర్‌ జి.ప్రవీణ్‌కుమార్‌ వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని