logo

అయిదేళ్లలో ఒక్క రూపాయీ పెంచలేదు!

అది విద్యార్థులకు పాఠాలు చెప్పి.. వారిని ఉన్నత పౌరులుగా తీర్చిదిద్దే విశ్వవిద్యాలయం. అక్కడ రాజకీయాలు కాదు కదా.. విద్యార్థులు, అధ్యాపకులను ఇబ్బందులకు గురి చేసే ఏ నిర్ణయాలకు చోటుండకూడదు.

Updated : 24 Jun 2024 05:37 IST

వేతనాల తీరుపై ట్రిపుల్‌ఐటీ అధ్యాపకుల ఆవేదన
కులపతి, ఉపకులపతుల ఏకపక్ష నిర్ణయాలతో అవస్థలు

  • నూజివీడు ట్రిపుల్‌ ఐటీ ఎంతో మంది గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులకు చదువు చెప్పి.. వారిని ఉన్నత పౌరులుగా తీర్చిదిద్దే విశ్వవిద్యాలయం. సుమారు 7 వేల మంది విద్యార్థులు చదువుకునే ఈ విశ్వవిద్యాలయానికి కులపతి, ఉపకులపతులుగా పనిచేస్తున్న వ్యక్తులు తీసుకుంటున్న నిర్ణయాలు అధ్యాపకులకు తలనొప్పిగా మారాయి. విశ్వవిద్యాలయానికి పెద్ద తలగా వ్యవహరించే వారు క్యాంపస్‌ అభివృద్ధిని పక్కన పెట్టడం, అధ్యాపకుల సంక్షేమం, విద్యార్థులను పట్టించుకోకపోవడంతో పాటు మౌలిక సదుపాయాల కల్పనను గాలికొదిలేశారు. ప్రభుత్వంతో చర్చించి యూజీసీ నిధులను తీసుకు రావడం మానేసి.. రోజువారి వ్యవహారాల్లో తలదూర్చుతూ అధ్యాపకులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు.
  • నూజివీడు ట్రిపుల్‌ ఐటీలో పని చేస్తున్న అధ్యాపకులు దాదాపు పదేళ్ల పై నుంచి ఉన్నవారే. ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాల నుంచి వచ్చిన వారే.. అలాంటి ఎంతో మంది ప్రతిభ కలిగిన అధ్యాపకులు.. ఇక్కడ సౌకర్యాలు లేకపోవడం... పైపెచ్చు రాజకీయాలను భరించలేక ఇతర విశ్వవిద్యాలయాలకు తరలిపోతున్నారు. ఇక్కడ పని చేస్తున్న కులపతి కేసీ రెడ్డి పలు రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారని అధ్యాపకులు ఆరోపిస్తున్నారు. తెదేపా హయాంలో రెండు సార్లు ఇంక్రిమెంట్లు ఇస్తే.. గడిచిన అయిదేళ్లలో ఒక్కసారి కూడా ఇవ్వలేదని వాపోతున్నారు. మీకు జీతాలు ఇవ్వడమే ఎక్కువంటూ హేళనగా మాట్లాడుతున్నారని అధ్యాపకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ పనిచేసిన కులపతులు, ఉపకులపతులు రాజకీయాలను ప్రోత్సహించింది లేదని.. అయిదేళ్లుగా విశ్వవిద్యాలయం ఆవరణలో రాజకీయాల సంస్కృతి బాగా పెరిగిపోయిందని ఆరోపిస్తున్నారు.

నూజివీడు పట్టణం, న్యూస్‌టుడే: అది విద్యార్థులకు పాఠాలు చెప్పి.. వారిని ఉన్నత పౌరులుగా తీర్చిదిద్దే విశ్వవిద్యాలయం. అక్కడ రాజకీయాలు కాదు కదా.. విద్యార్థులు, అధ్యాపకులను ఇబ్బందులకు గురి చేసే ఏ నిర్ణయాలకు చోటుండకూడదు. ఆ విద్యాలయానికి కులపతి, ఉప కులపతులుగా పనిచేసిన వ్యక్తుల ఒంటెద్దు పోకడలు, ఏకపక్ష నిర్ణయాలతో క్యాంపస్‌ ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదని పలువురు అభిప్రాయ పడుతున్నారు. అయిదేళ్లుగా వారి వేధింపులు, ఒత్తిళ్లలను పంటి బిగువున భరించిన ఉద్యోగులు, అధ్యాపకులు ఇప్పుడు స్వేచ్ఛగా బయటకి వస్తున్నారు. వారికి జరిగిన అన్యాయాన్ని చెబుతూ కూటమి ప్రభుత్వమైనా న్యాయం చేయాలని కోరుతున్నారు.

కోర్టు ఉత్తర్వులను సైతం పక్కన పెట్టి..

పదేళ్ల పైనుంచి ఇక్కడ పనిచేస్తున్న అధ్యాపకులను ఇప్పటికీ క్రమబద్ధీకరించలేదని వారు వాపోతున్నారు. దీనిపై ఎన్నోసార్లు కులపతికి విన్నవించినా స్పందించకపోవడంతో కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఇచ్చినా మధ్యంతర ఉత్తర్వులను సైతం పక్కన పెట్టిన అధికారులు.. ప్రభుత్వం నుంచి వచ్చిన జీవోలే వర్తిస్తాయని చెప్పడంపై మండి పడుతున్నారు.

20 మందే శాశ్వత అధ్యాపకులు

విశ్వవిద్యాలయంలో యూజీసీ నిబంధనల ప్రకారం విద్యార్థుల నిష్పత్తికి అనుగుణంగా  అధ్యాపకుల నియామకం జరగడం లేదు. 36 మంది ఫ్రొఫెసర్లు, 72 మంది అసోసియేట్ ఫ్రొఫెసర్లు, 213 మంది సహాయ అధ్యాపకులు ఉండగా.. వీరిలో  20 మంది మాత్రమే శాశ్వత ప్రాతిపదికన పనిచేస్తున్నారు. ఈ ప్రభుత్వమైనా తమ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని అధ్యాపకులు కోరుతున్నారు.

ఆందోళన చేసినా ఫలితం లేదు

‘గత ప్రభుత్వంలో జరిగిన అన్యాయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. 2010 నుంచి కళాశాలలో పనిచేస్తున్నాం. వైకాపా ప్రభుత్వంలో జరిగిన అన్యాయం మాకు ఎప్పుడు జరగలేదు. గత అయిదేళ్లలో ఒక్కసారి కూడా జీతాలు పెంచకుండా మమ్మల్ని వేధించారు. ఇబ్బందులకు గురి చేశారు. దీనిపై నూజివీడు క్యాంపస్‌కు ఇటీవల కులపతి వస్తున్నారని తెలిసి ఆందోళన సైతం నిర్వహించాం. ఆయన మమ్మల్ని పట్టించుకోలేదు. అసలు మా డిమాండ్లు ఎంటి అని కూడా అడగలేదు.’ ఫ్రొఫెసర్‌ బొత్స శ్రీనివాసరావు అన్నారు.

ఈ బాధలు ఎప్పుడూ లేవు

‘గత ప్రభుత్వంలో పడిన బాధలు ఎప్పుడు పడలేదు. 2012 నుంచి కళాశాలలో అసిస్టెంట్ ఫ్రొఫెసర్‌గా విధులు నిర్వహిస్తున్నా. గత తెదేపా హయాంలోనే రెండు సార్లు ఇంక్రిమెంట్లు పెంచారు. తర్వాత వచ్చిన వైకాపా ప్రభుత్వంలో ఒక్క రూపాయి కూడా పెంచలేదు.’ అని దుర్గాబాబు ఆవేదన వ్యక్తం చేశారు.

విద్యార్థులూ ఇబ్బందులు  పడుతున్నారు

‘గత 12 సంవత్సరాలుగా కళాశాలలో పనిచేస్తున్నా. వైకాపా పాలన అయిదేళ్లలో ఒక్కసారి కూడా జీతం పెరగలేదు. గత ప్రభుత్వంలో పడిన ఇబ్బందులను ఎప్పుడూ పడలేదు. ట్రిపుల్‌ ఐటీ కళాశాలలను వైకాపా నిర్వీర్యం చేసింది.  భోజనం వసతి బాగోలేదని ఎన్నో సార్లు విద్యార్థులు కూడా ధర్నా చేసిన సందర్భాలున్నాయి.’ అని ఫ్రొఫెసర్‌ వేణుగోపాల్‌ తెలిపారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని