logo

ఏలూరు కాలువలో బాలుడి గల్లంతు

ఏలూరు కాలువలో ప్రమాదవశాత్తు పడిపోయిన బాలుడు గల్లంతైన ఘటన తాడేపల్లిగూడెం పట్టణంలో ఆదివారం చోటు చేసుకుంది. పట్టణ సీఐ సుబ్రహ్మణ్యం తెలిపిన వివరాల మేరకు..

Published : 24 Jun 2024 04:19 IST

రేవు వద్ద గుమిగూడిన స్థానికులు

తాడేపల్లిగూడెం అర్బన్, న్యూస్‌టుడే: ఏలూరు కాలువలో ప్రమాదవశాత్తు పడిపోయిన బాలుడు గల్లంతైన ఘటన తాడేపల్లిగూడెం పట్టణంలో ఆదివారం చోటు చేసుకుంది. పట్టణ సీఐ సుబ్రహ్మణ్యం తెలిపిన వివరాల మేరకు.. తాడేపల్లిగూడెం మండలం పడాల గ్రామానికి చెందిన వానపల్లి సూరిబాబు, ధనలక్ష్మి దంపతుల కుమారుడు మణికంఠ(16) స్థానిక జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి చదుతున్నాడు. తండ్రి క్షౌరశాల నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. ఆదివారం సైకిలుకు పంక్చర్‌ కావడంతో స్థానిక చిన వంతెన వద్ద ఉన్న దుకాణం వద్దకు వెళ్లాడు. అక్కడ పంక్చర్‌ వేయించుకుని కాళ్లు, చేతులు శుభ్రం చేసుకునేందుకు యాగర్లపల్లి కాలువ వద్దకు వెళ్లి రేవులో దిగాడు. నీటి ప్రవాహం అధికంగా ఉండటంతో ప్రమాదవశాత్తు కాలుజారి కాలువలో పడిపోయాడు. ఆ సమయంలో అక్కడ ఎవ్వరూ లేకపోవడంతో గల్లంతయ్యాడు. సమాచారం తెలుసుకున్న పట్టణ పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. రెస్క్యూ బోట్‌ సహాయంతో కాలువలో గాలించారు. చీకటి పడేవరకు వెతికినప్పటికీ ఆచూకీ లభించలేదు. అప్పటి వరకు తమ కళ్లముందు ఉన్న కుమారుడు కాలువలో గల్లంతైన విషయాన్ని తెలుసుకున్న తల్లితండ్రులు ఘటనా స్థలానికి చేరుకుని ఆచూకీ కోసం ఆశగా ఎదురు చూశారు. జాడ తెలియకపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. పోలీసులు వారిని సముదాయించే ప్రయత్నం చేశారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని