logo

చిట్టితల్లీ జాగ్రత్త!

బాలల పట్ల కొందరు చూపుతున్న వికృత తీరును, జరుగుతున్న ఘటనలు చూస్తుంటే సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.

Published : 24 Jun 2024 04:23 IST

మైనర్లను వదలని కామాంధులు
వరుస ఘటనలతో ఆందోళనలో తల్లిదండ్రులు

మండవల్లి, కైకలూరు, న్యూస్‌టుడే : బాలల పట్ల కొందరు చూపుతున్న వికృత తీరును, జరుగుతున్న ఘటనలు చూస్తుంటే సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. కుటుంబసభ్యులు, తెలిసిన వారే అకృత్యాలకు పాల్పడుతున్నప్పుడు చిన్నారులకు రక్షణ ఎక్కడ ఉంటుందనే సందేహం కలుగుతోంది. పూర్వం బడి స్థాయిలో బాలబాలికలు కల్మషం లేని హృదయాలతో కలిసి మెలిసి తిరిగే వారు. కానీ నేడు ఆ పరిస్థితి లేదు. బడి స్థాయి నుంచే ఫోన్, ఇంటర్‌ నెట్‌ ప్రభావం చిన్నారులపై పడుతోంది.

  • ఈ నెల 19న ఏలూరుకు చెందిన పదో తరగతి విద్యార్థిని తనకు సామాజిక మాధ్యమాల్లో పరిచయమైన వ్యక్తిని కలిసేందుకు వెళ్లగా గదిలో నిర్బంధించి అత్యాచారానికి పాల్పడ్డాడు. అదే రోజున జంగారెడ్డిగూడెం మండలం చల్లవారిగూడెం నిర్వాసిత కాలనీకి చెందిన మైనర్‌ బాలిక బయటకు వెళ్లిన తరుణంలో జీలుగుమిల్లి మండలానికి చెందిన సందీప్‌ అనే వ్యక్తి అపహరించి లైంగిక దాడికి పాల్పడ్డాడు.
  • గత సంవత్సరం మండవల్లిలోని ఓ వసతిగృహంలో చదువుతున్న అయిదో తరగతి చిన్నారిని సొంత పెద్దమ్మ కొడుకు(22), మరో 50 ఏళ్ల వ్యక్తి ఇంటికి తీసుకు వచ్చి లైంగికంగా దాడి చేశారు. ఈ సంఘటనలో పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి నిందితులను జైలుకు పంపితే ఐదారు నెలలకు బెయిల్‌పై వచ్చి దర్జాగా తిరుగుతున్నారు. 
  • ఆ ఘటనను మరవకు ముందే మండవల్లిలోనే మే నెల 15న పాఠశాలకు వెళ్లిన విద్యార్థిని తోటి విద్యార్థే అత్యాచారానికి ఒడిగడితే అక్కడే ఉన్న కొంత మంది దీన్ని చరవాణిలో  చిత్రీకరించారు. ఆ దృశ్యాలు మైనర్‌ బాలిక తల్లిదండ్రులకు చూపి డబ్బు డిమాండ్‌ చేశారు. అడిగినంత సొమ్ము ఇవ్వకపోయే సరికి వాటిని వాట్సాప్‌ గ్రూప్‌ల్లో షేర్‌ చేశారు.
  • ఇంటి పక్కనే ఉన్న ఓ చిన్నారికి దుస్తులు కుడతానంటూ కొలతలు తీసుకోవాలని టైలర్‌ అసభ్యంగా ప్రవర్తించిన తీరు కైకలూరులో ఇటీవల చోటు చేసుకుంది. విషయం తల్లికి తెలియడంతో కుల పెద్దల వద్ద పంచాయితీ పెట్టింది. అక్కడ న్యాయం జరగకపోయే సరికి పోలీసులను ఆశ్రయించింది.
  • ముదినేపల్లి మండలంలో తండ్రి వరసయ్యే వ్యక్తి అత్యాచారానికి యత్నించగా బాలిక తప్పించుకుంది. తప్పని చెప్పాల్సిన గ్రామ పెద్దలు రాజీకి ఒప్పుకోలేదని బాలిక తల్లిపై దాడి చేశారు.

ఓ కంట కనిపెడుతుండాలి

చిన్నారులను నిత్యం తల్లిదండ్రులు ఓ కంట కనిపెడుతూ ఉండటం ఎంతో అవసరం. స్మార్ట్‌ ఫోన్, ట్యాబ్, కంప్యూటర్‌లలో ఇంటర్‌నెట్‌ వాడకంపై తప్పక నిఘా ఉండాలి. సాధ్యమైనంత వరకు వీటికి దూరంగా పెట్టడమే మంచిది. చరవాణుల్లో పేరంటల్‌ కంట్రోల్‌ యాప్‌ను వినియోగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే బయటకు పంపేటప్పుడు.. పక్కింటి వాళ్లకు   అప్పగించేప్పుడు ఒకటి రెండు సార్లు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది.

ధైర్యంగా ఫిర్యాదు చేయాలి

‘చిన్నారులపై అఘాయిత్యాలపై కొందరు పోలీసుల్ని ఆశ్రయించినా మరికొందరు పెద్దల పంచాయితీల పేరుతో ఇంకా వెనుకాడుతున్నారు. అలా కాకుండా ధైర్యంగా ఫిర్యాదు చేస్తే నిందితులకు కఠిన శిక్షలు పడేలా వివిధ చట్టాలున్నాయి.  పోలీసులు ఫిర్యాదు తీసుకోకపోతే మానవ హక్కుల సంఘాలను ఆశ్రయించొచ్చు. న్యాయమూర్తి అధ్యక్షత వహించే న్యాయసేవాధికార సంస్థకు నేరుగా ఫిర్యాదు చేయవచ్చు’ అని న్యాయవాది పవన్‌కాంత్‌ తెలిపారు.

పర్యవేక్షణ అవసరం

పిల్లలు ఫోన్లు ఎక్కువగా చూడటంతో మానసిక ప్రవర్తనలో మార్పు వస్తోంది. ఫోన్లు తెరవగానే అశ్లీలతతో కూడిన వీడియోలు ప్రత్యక్షమవుతున్నాయి. సామాజిక మాధ్యమాల్లోనూ     ఆ ప్రభావం అధికంగా ఉంటోంది. పిల్లల మానసిక స్థితిపై పాఠశాలలో ఉపాధ్యాయులు, ఇంటి వద్ద తల్లిదండ్రులు ప్రత్యేక చొరవ చూపాలి. వారు ఏం చేస్తున్నారు.. ఎక్కడికి వెళ్తున్నారో పర్యవేక్షణ ఉండాలి. 

గొరిపర్తి నాగభూషణం, మానసిక వైద్య నిపుణుడు, ఏలూరు 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు