logo

తీరు మారాలి.. ఫలితం చేరాలి

వ్యవసాయ రంగానికి ప్రాధాన్యమిచ్చి రైతాంగానికి వెన్నుదన్నుగా నిలుస్తామంటూ ఊదరగొట్టిన వైకాపా ప్రభుత్వం ఆ దిశగా చేపట్టిన చర్యల్లో పూర్తిగా చతికిలబడింది.

Published : 24 Jun 2024 04:27 IST

అందుబాటులోకి రాని సమీకృత ల్యాబ్‌లు

భీమవరంలో సమీకృత వ్యవసాయ ప్రయోగశాల   

వీరవాసరం, ఆకివీడు, న్యూస్‌టుడే: వ్యవసాయ రంగానికి ప్రాధాన్యమిచ్చి రైతాంగానికి వెన్నుదన్నుగా నిలుస్తామంటూ ఊదరగొట్టిన వైకాపా ప్రభుత్వం ఆ దిశగా చేపట్టిన చర్యల్లో పూర్తిగా చతికిలబడింది. గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాల సేవలు నామమాత్రంగా మారాయి. రైతులకు అత్యంత కీలకమైన భూసార పరీక్షలతో పాటు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు అందించాలనే లక్ష్యంతో ప్రతి నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన సమీకృత వ్యవసాయ ప్రయోగశాల (ఇంటిగ్రేటెడ్‌ అగ్రి ల్యాబ్‌)లు  పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాలేదు.

ప్రారంభమైనవి రెండే..

పశ్చిమగోదావరి జిల్లాలో ఏడు నియోజకవర్గాల్లో అగ్రి ల్యాబ్‌ భవనాల నిర్మాణం పూర్తయినా పాలకొల్లు, ఉండి, ఆచంట, నరసాపురంలలో వాటిని ఇంకా ప్రారంభించ లేదు. వీటిలో పరికరాలు నిరుపయోగంగా మారాయి. భీమవరం, ఇరగవరం ల్యాబ్‌లలో మాత్రం ఎరువులు, విత్తనాలకు సంబంధించిన పరీక్షలు నిర్వహిస్తున్నట్లు సిబ్బంది చెబుతున్నారు. పలు నియోజకవర్గాల్లో రైతు భరోసా కేంద్రాల ప్రయోగశాలలల్లో ఉన్న పరికరాలను ఎన్నికలకు ముందు అగ్రి ల్యాబ్‌లకు తరలించారు.

అంతా ప్రచార ఆర్భాటం

సమీకృత ల్యాబ్‌ల ద్వారా ప్రతి రోజూ 50 నమూనాలు విశ్లేషిస్తామని, 24 గంటల్లోనే ఫలితాలను రైతుల చరవాణికి సంక్షిప్త సందేశం రూపంలో పంపుతామని వైకాపా నాయకులు గొప్పలు చెప్పారు. పరీక్షల కోసం ఒక్కో ల్యాబ్‌లో రూ.25 లక్షలతో విలువైన అధునాతన పరికరాలను అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. ప్రతి రైతుకు నేల ఆరోగ్య కార్డులు అందజేస్తామన్నారు. క్షేత్రస్థాయిలో ఇవేమీ అమలు చేయలేకపోయారు.

గతంలో ఇలా..

ఏటా వేసవిలో ఎంపిక చేసిన గ్రామాల్లో భూసార పరీక్షలు నిర్వహించేవారు. వీటి ఫలితాల ఆధారంగా మట్టిలో ఉదజని సూచిక, లవణాల పరిమాణం, నత్రజని, పొటాష్, సేంద్రియ కర్బనం, భాస్వరం ఏ స్థాయిలో ఉన్నాయో తెలుసుకొని దానికి అనుగుణంగా ఎరువుల వినియోగంపై అధికారులు సిఫార్సు చేసేవారు. గతంలో తెదేపా ప్రభుత్వ హయాంలో 2019-20లో చివరిగా మట్టి పరీక్షలు నిర్వహించారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మూడేళ్ల పాటు ఎలాంటి పరీక్షలు నిర్వహించలేదు. గతేడాది ప్రతి మండలంలో ఎంపిక చేసిన గ్రామాల్లో వెయ్యికిపైగా నమూనాలు సేకరించారు. వీటిని తాడేపల్లిగూడెంలో భూసార పరీక్ష కేంద్రానికి పంపారు. ఫలితాలను ఇప్పటి వరకు రైతులకు అందజేయలేదు. దీంతో నేలలో పోషకాల శాతం తెలియక రైతులు విచ్చలవిడిగా ఎరువులు వినియోగించి నష్టపోతున్నారు. గి మార్కెట్‌లో అందుబాటులో ఉన్న ఎరువులు, పురుగుమందుల నమూనాలను సేకరించి అగ్రి ల్యాబ్‌లలో పరీక్షిస్తే నకిలీలకు అడ్డుకట్టేపడే అవకాశం ఉంది. వైకాపా సర్కారు ల్యాబ్‌ల నిర్మాణం పూర్తి చేసినా వాటిని వినియోగంలోకి తీసుకురావడంలో నిర్లక్ష్యం వహించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని