logo

ఆదిలోనే ఆరోగ్యానికి వధ

ఆదివారం వస్తే మాంసం కూర తినాలని ఎందరికో ఉంటుంది. అందులోనూ రకరకాల వంటలను ఆరగిస్తారు. కానీ మనం తింటున్న మాంసం మంచిదేనా అని క్షణం ఆలోచించారా..?

Updated : 24 Jun 2024 05:23 IST

కబేళాల్లో నిబంధనల ఉల్లంఘన 
పురపాలికల్లో పర్యవేక్షణ ఉత్తిదే

ఆదివారం వస్తే మాంసం కూర తినాలని ఎందరికో ఉంటుంది. అందులోనూ రకరకాల వంటలను ఆరగిస్తారు. కానీ మనం తింటున్న మాంసం మంచిదేనా అని క్షణం ఆలోచించారా..? అలా చేయకుంటే ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు. ఎందుకంటే జిల్లాలో ఏదో ఒకచోట కుళ్లిన మాంసం విక్రయించారనో, కలుషితమైన మాంసం వండుకుని తినడంతో అనారోగ్యానికి గురయ్యామంటూ ఆందోళనలు చూస్తుంటాం. ఇటీవల భీమవరం పట్టణంలోని ఓ దుకాణదారు కుళ్లిన మాంసం విక్రయించడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేసి దుకాణం మూసివేయించారు.  శనివారం తాడేపల్లిగూడెంలో ఇలాంటి సంఘటన వెలుగుచూసింది.  కుళ్లిన మాంసం ఇచ్చారని అడిగితే దుకాణదారు నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు. పురపాలక సంఘం వద్ద సమాధానమిచ్చేవారు లేరు. ఇలాంటి ఘటనలు ఎందుకు జరుగుతున్నాయో  కబేళాలను పరిశీలిస్తే అర్థమవుతుంది. ‘న్యూస్‌టుడే’ బృందం ఆదివారం పరిశీలించగా..అన్ని చోట్లా నిబంధనల ఉల్లంఘనే కనిపించింది.

న్యూస్‌టుడే, భీమవరం పట్టణం, నరసాపురం, తాడేపల్లిగూడెం అర్బన్, ఆకివీడు

భీమవరం కబేళాలో  అపరిశుభ్ర వాతావరణం  

ఆకివీడు

 • వసతులు లేవు. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో కబేళా వినియోగంలో లేదు.
 • వ్యాపారులకు అనుకూలమైనచోట జంతువులను వధించారు.
 • పాటదారు మాత్రం వ్యాపారుల దగ్గర నుంచి రుసుములు వసూలు చేశారు.

భీమవరం

 • పరిసరాలు శుభ్రంగా ఉన్నాయో లేదో పరిశీలించేందుకు పురపాలక అధికారులు లేరు.
 • మాంసంపై అధికారిక ముద్ర వేయకుండానే కొందరు తీసుకెళ్లినా అడిగేవారు లేరు
 • నిర్వహణ ప్రైవేటు వ్యక్తులకు అప్పగించామని పర్యవేక్షించేందుకు పురపాలక అధికారులు ఎవరూ రాలేదు.

నరసాపురం

 • పశు వైద్యాధికారి లేరు.
 • వ్యాపారులే జంతువులను తీసుకొచ్చి వధించి మాంసాన్ని తీసుకెళ్లారు.
 • కబేళా ఆవరణను శుభ్రం చేసేవారు లేరు.

తాడేపల్లిగూడెం

 • ఇక్కడ డ్రెయినేజీ వ్యవస్థ లేకపోవడంతో మేకలు, గొర్రెలకు సంబంధించిన వ్యర్థాలను ఖాళీ స్థలాల్లోకి వేస్తున్నారు.
 • గొర్రెలు, మేకలను కోసే ముందు పరిశీలించాల్సిన పశువైద్యుడు రాలేదు. మున్సిపల్‌ సిబ్బంది మాత్రం మాంసంపై ముద్రలు వేశారు.
 • జంతు వ్యర్థాలను సకాలంలో తొలగించక పరిసరాలు దుర్వాసనతో నిండాయి.

ఏలూరు

 • పర్యవేక్షించిన అధికారులు లేరు. పశువైద్యుడు రాలేదు
 • మాంసానికి ముద్ర తూతూమంత్రమే. అక్కడ ఉన్నవాళ్లు వేసుకుని వెళ్తున్నారు. కొందరైతే ముద్ర లేకుండానే తీసుకెళ్లారు.

నిబంధనలు ఇవీ

 • పట్టణంలో ఓ నిర్దేశితప్రాంతంలో కబేళా ఉంటుంది. అక్కడ మాత్రమే మేకలు, గొర్రెలు వధిస్తారు
 • వధించేముందు పశువైద్యాధికారి ఆ జంతువును పరిశీలించాలి. అది ఎలాంటి జబ్బుపడనిదని, బాగానే ఉందని నిర్ధారించి ముద్ర వేస్తారు
 • అధికారుల పర్యవేక్షణలో ముద్ర వేసిన మాంసాన్ని అమ్మాలి.

జరుగుతోంది ఇది

 • తాడేపల్లిగూడెం, జంగారెడ్డిగూడెం, నరసాపురం, ఆకివీడు, ఏలూరు, నూజివీడు పట్టణాల్లో పశువైద్యాధికారి పరిశీలించకుండానే జంతువులను వధిస్తున్నారు
 • దాదాపు అన్నిచోట్లా ఉదయం 5 గంటల తర్వాత నుంచి వ్యాపారులు ఇష్టారీతిలో మాంసాన్ని కబేళా నుంచి బయటకు తీసుకెళ్తున్నారు
 • ‘న్యూస్‌టుడే’ బృందాన్ని చూసి హడావుడిగా గొర్రెలు, మేకల ఆరోగ్యాన్ని నిర్ధారించే ముద్రలను కొందరు, వ్యాపారులు, ప్రైవేటు వ్యక్తులు, పారిశుద్ధ్య సిబ్బంది వేయడం గమనార్హం
 • భీమవరం, ఆకివీడు, నరసాపురం, తాడేపల్లిగూడెం, నూజివీడు, జంగారెడ్డిగూడెంలోని కబేళాల పరిసరాలు అపరిశుభ్రంగా ఉన్నాయి. గంటన్నర పాటు రద్దీగా ఉండే ఆయా ప్రాంతాల్లో దోమల ఉద్ధృతి ఎక్కువగా ఉంది. తెల్లవారేసరికి ఈగలు గుప్పుమన్నాయి, కుక్కలు గుంపులుగా చేరి జంతువుల వ్యర్థాలను ఈడ్చుకెళ్లాయి. 

ఆదేశాలిస్తాం

పురపాలక సంఘాల్లోని కబేళాలను పరిశీలించాలని సంబంధిత అధికారులను ఆదేశిస్తానని పురపాలక రాజమహేంద్రవరం ఆర్డీ సీహెచ్‌ నాగనరసింహారావు అన్నారు. కబేళాల్లో శుభ్రత ఉండాలని, జంతువులను వధించే ముందు పశువైద్యాధికారి పర్యవేక్షణ ఉండాలన్నారు. కొన్నిచోట్ల ఎందుకు హాజరుకాలేదో తెలుసుకుని ఇక నుంచి పశువైద్యుల పర్యవేక్షణ ఉండేలా చూస్తానన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని