logo

బోసిపోతున్న బుడుగుల బువ్వ!

గడిచిన మే నెలలో అయిదు నక్షత్రాల హోటళ్లలో పనిచేసే వంటగాళ్లను తీసుకొచ్చి విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ఎలా తయారు చేయాలో వంట నిర్వాహకులకు వైకాపా ప్రభుత్వం తణుకులో శిక్షణ ఇప్పించింది.

Published : 24 Jun 2024 04:40 IST

బడి భోజనానికి వేలమంది డుమ్మా
మెనూ మార్పుతోనే లక్ష్యానికి చేరువ

పాలకొల్లు, న్యూస్‌టుడే: గడిచిన మే నెలలో అయిదు నక్షత్రాల హోటళ్లలో పనిచేసే వంటగాళ్లను తీసుకొచ్చి విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ఎలా తయారు చేయాలో వంట నిర్వాహకులకు వైకాపా ప్రభుత్వం తణుకులో శిక్షణ ఇప్పించింది. ఎలా వండాలో తెలియక కాదు ఇచ్చేది సరిపోక నిర్వాహకులు ఇబ్బంది పడుతున్నారని మాత్రం గమనించలేకపోయింది. భోజనం తాజాగా వండిపెడితే చాలు విద్యార్థులకు తాజ్‌ హోటల్‌ నుంచి తెచ్చినట్టే ఉంటుందనే విషయాన్ని విస్మరించింది. శిక్షణలన్నీ బూడిదలో పోసిన పన్నీరయ్యాయిగాని నేటికీ ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం చేసే విద్యార్థుల సంఖ్య పెంచలేకపోయారు.

రాష్ట్రంలోనే ప్రథమం.. 

2014-19 మధ్య కాలంలో తెదేపా ప్రభుత్వం ఉండగా మధ్యాహ్న భోజన పథకం అమల్లో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో కొనసాగేది. పాఠశాల ప్రాంగణంలోనే పెరటి తోటలు పెంచడం ఎప్పటికప్పుడు ధరల పెరుగుదలకు అనుగుణంగా మెనూ ఛార్జీలు పెంచడం నిర్వాహకులకు ఊరటగా ఉండేది. తర్వాత వచ్చిన వైకాపా ప్రభుత్వం మెనూ మార్చడం తప్ప పెరుగుతున్న ధరలను దృష్టిలో పెట్టుకుని నిర్వాహకులకు బాసటగా నిలిచింది లేదు. పెరటితోటల పెంపకానికి మంగళం పాడటంతో పిల్లలకు తాజా కూరలే కరువయ్యాయి.

మూడేళ్లుగా అవే చెల్లింపులు...

వైకాపా ప్రభుత్వం వచ్చిన తర్వాత నిత్యావసరాలన్నీ కొండెక్కి కూర్చున్నాయి. ఏది కొనాలన్నా.. ఏం వండాలన్నా అయ్యే పరిస్థితి లేదు. ఇటువంటి ఇబ్బందుల్లోనూ ఎన్నిసార్లు విన్నవించినా మెనూ ఛార్జీలు పెంచలేదు. ప్రాథమిక పాఠశాల స్థాయిలో విద్యార్థికొచ్చి రూ.5.88 పైసలు, ఉన్నత పాఠశాల విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.8.57 చొప్పున మాత్రమే గడిచిన మూడేళ్లుగా కొనసాగుతుంది. ప్రస్తుత ధరలతో పోల్చి మెనూ ఛార్జీలను కొత్త ప్రభుత్వం పెంచితే ఫలితాలు బాగుంటాయని ఉపాధ్యాయ వర్గాలు చెబుతున్నాయి.

వేలల్లో అయిష్టత.. 

బడి భోజనం ఏ రోజు కాదనం అనే పరిస్థితి నుంచి అమ్మో బడి భోజనమా అనే స్థితికి విద్యార్థులు చేరారంటే గత ప్రభుత్వ వైఫల్యమే. ప్రాంతాలవారి అభిరుచులను గుర్తించకుండా అమలు చేసిన మెనూ వేల సంఖ్యలో విద్యార్థులను బడి భోజనానికి దూరం చేసింది. ఏ రోజు చూసినా మొత్తం పాఠశాలల్లో హాజరైన విద్యార్థుల్లో సరాసరిన 5 వేల మంది భోజనం చేయడానికి రావడం లేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. శనివారం ఏలూరు జిల్లాలో పరిశీలిస్తే మొత్తం 3,175 మంది, పశ్చిమలో 5,596 మంది విద్యార్థులు మధ్యాహ్న భోజనానికి గైర్హాజరయ్యారు. గతంలో వంట నిర్వాహకులకు ప్రత్యేక దుస్తులు ఇచ్చి పరిశుభ్రతగా అమలు చేసిన ఘనత తెదేపా ప్రభుత్వానికి దక్కింది. గతం మాదిరి మార్పులతోనే మళ్లీ మధ్యాహ్న భోజనం ఉద్దేశం నెరవేరుతుందని అత్యధికంగా ఉపాధ్యాయులు, వంట నిర్వాహకులు అభిప్రాయపడుతున్న తరుణంలో ఆ దిశగా సంస్కరించాల్సి ఉంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని