logo

అయిదేళ్లూ.. చేతులెత్తేశారు

చిన్నారుల సంరక్షణకు, బాలింతలు-గర్భిణుల ఆరోగ్యానికి భరోసానిచ్చేవి అంగన్‌వాడీ కేంద్రాలు. అంతటి కీలకమైన ఆ కేంద్రాల నిర్వహణపై వైకాపా ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేసింది.

Published : 24 Jun 2024 04:43 IST

మొండిగోడలుగా అంగన్‌వాడీ భవనాల నిర్మాణాలు
చిన్నారులు, గర్భిణుల సంక్షేమంపై వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యం

భీమవరం అర్బన్, న్యూస్‌టుడే: చిన్నారుల సంరక్షణకు, బాలింతలు-గర్భిణుల ఆరోగ్యానికి భరోసానిచ్చేవి అంగన్‌వాడీ కేంద్రాలు. అంతటి కీలకమైన ఆ కేంద్రాల నిర్వహణపై వైకాపా ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేసింది. నాడు-నేడు పథకంలో అన్ని కేంద్రాలకు సొంత భవనాలు నిర్మిస్తున్నామంటూ ఊకదంపుడు ప్రచారం చేశారు. నిర్మాణాలు మాత్రం పూర్తి కాలేదు. 
జిల్లా వ్యాప్తంగా అసంపూర్తిగా ఉన్న నిర్మాణాలను పూర్తి చేసి అందుబాటులోకి తేవాల్సిన వైకాపా ప్రభుత్వం ఆ బాధ్యత నుంచి చేతులెత్తేసింది. వీరవాసరంలో కేంద్రం సంఖ్య 6కి కొత్త భవనం నిర్మాణం పూర్తి కాలేదు. ఇదే మండలం పంజా వేమవరం-2కి సంబంధించిన నిర్మాణమూ ఇంతే. మత్స్యపురి 6వ అంగన్‌వాడీ కేంద్రం భవన నిర్మాణం పునాది దశ దాటలేదు. తోలేరులో అసంపూర్తిగా నిలిచిన భవనాన్ని చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోతారు. భీమవరం మండలం పల్లిపాలెంలోని కేంద్రం నిర్మాణ పనులు చివరి దశలో ఆగిపోయాయి. 

తోలేరు-2లో భవన నిర్మాణం తీరు 

అద్దె భవనాల్లో ఇక్కట్లు

అద్దె భవనాల్లో కనీస వసతులు లేకపోవడంతో అవి సమస్యలకు నిలయాలుగా మారాయి. అక్కడికొచ్చే బాలింతలు, గర్భిణులకు సరైన సదుపాయాలు లేవు. చిన్నారులు తాగేందుకు అధిక శాతం చోట్ల నీటి సరఫరా కూడా లేదు. చాలా చోట్ల గాలి వెలుతురు సరిగా లేని అద్దె గదుల్లో కేంద్రాలను నెట్టుకు రావాల్సి వస్తుందని అంగన్‌వాడీ సిబ్బంది వాపోతున్నారు పట్టణాల్లో ఒక్కో అంగన్‌వాడీ కేంద్రానికి రూ.6 వేలు, గ్రామాల్లో రూ.2 వేలు చొప్పున అద్దె కింద ప్రభుత్వం చెల్లిస్తోంది. మొత్తానికి గడిచిన ఐదేళ్లలో అంగన్‌వాడీ కేంద్రాలు సమస్యలకు చిరునామాగా మారిపోయాయి. 

  • గోడలు లేకుండా శిథిలస్థితికి చేరినట్లుగా కనిపిస్తున్న ఈ నిర్మాణం భీమవరం మండలం తుందుర్రులోని అంగన్‌వాడీ కేంద్రం. స్థానిక చిన్నారుల శ్రేయస్సు కోసం ఆ నిర్మాణం పూర్తి చేయాల్సి ఉన్నా పాలకులు పట్టించుకోలేదు. రూ.లక్షలు వెచ్చించిన నిర్మాణం నిరుపయోగంగా ఉంది. పిచ్చి మొక్కలు ఏపుగా పెరిగి అధ్వానంగా మారింది. 

ఇవీ అంతే.. గతంలో తెదేపా ప్రభుత్వం  మంజూరు చేసిన భవనాలు చాలా వరకు పూర్తయి చివరి దశలో పనులు నిలిచిపోయాయి. తర్వాత అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రతినిధులు వాటిని విస్మరించారు. అలాంటివి ఒక్క భీమవరం ప్రాజెక్టు పరిధిలోనే 7 వరకు ఉన్నాయి. వాటికి బదులుగా కొత్తవి మంజూరు చేశారు.   అవైనా పూర్తయ్యాయా అంటే అదీ లేదు. ఇప్పటికీ చాలా చోట్ల నిర్మాణాలు సాగుతూనే ఉన్నాయి. కొన్ని చివరి దశలో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. 
పూర్తి చేస్తాం : నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయి. త్వరలోనే పూర్తయ్యే అవకాశం ఉంది. వివిధ కారణాలతో కొన్ని చోట్ల నిర్మాణ పనులు ఆలస్యంగా మొదలయ్యాయి. 

సుజాతరాణి, ఐసీడీఎస్‌ పీడీ, భీమవరం 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని