logo

తల్లితో సహజీవనం.. కూతురుపై అత్యాచారం

బాలికపై అత్యాచార ఘటనలో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను ఏలూరు డీఎస్పీ శ్రీనివాసులు ముదినేపల్లిలో మంగళవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు.

Published : 26 Jun 2024 03:30 IST

నిందితుడిని అరెస్టు చేసి వివరాలు తెలుపుతున్న డీఎస్పీ శ్రీనివాసులు

ముదినేపల్లి, న్యూస్‌టుడే:  బాలికపై అత్యాచార ఘటనలో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను ఏలూరు డీఎస్పీ శ్రీనివాసులు ముదినేపల్లిలో మంగళవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ముదినేపల్లి మండలంలోని ఓ గ్రామానికి చెందిన మహిళ భర్త వదిలేయడంతో పదేళ్ల పాప, ఏడేళ్ల బాబుతో కలిసి ఉంటోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌కు చెందిన ఎం.ఉదయ్‌కుమార్‌తో ఏడాది కిందట పరిచయం ఏర్పడి అది కాస్తా సహజీవనంగా మారింది. ఉదయ్‌కుమార్‌ నమ్మించి రూ.2.20 లక్షలు నగదు తీసుకున్నాడు. మహిళ పనికి వెళ్లినప్పుడు ఇంటిలో ఒంటరిగా ఉన్న పదేళ్ల బాలికను పలుసార్లు బెదిరించి, కొట్టి అత్యాచారం చేశాడు. గత నెల 19న అర్ధరాత్రి వేళ బాలికపై అత్యాచారానికి యత్నిస్తుండగా మహిళ చూసి అతన్ని నిలదీసింది. ఈ విషయం బయట చెబితే చంపేస్తానని బెదిరించి బాలికను, తల్లిని కొట్టి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. కేసు పెట్టకుండా రాజీ చేసుకోవాలంటూ మహిళపై గ్రామానికి చెందిన సురేశ్, అశ్విని, కిశోర్, విజయలక్ష్మి ఒత్తిడి తీసుకొచ్చారు. వినకపోవడంతో దాడి చేసి కొట్టారు. దీంతో ఈ నెల 16న బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దిశ పోలీసుస్టేషన్‌ డీఎస్పీ ఎన్‌.మురళీకృష్ణ ఆధ్వర్యంలో నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాలికకు వైద్య పరీక్షలు చేసి విచారణ నిర్వహించారు. నిందితుడిని మంగళవారం ఉదయం ద్వారకా తిరుమల మండలం కన్నాపురంలో అరెస్టు చేసి న్యాయస్థానానికి తరలించగా న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్‌ విధించినట్లు డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు. చాకచక్యంగా వ్యవహరించి నిందితుడిని అరెస్టు చేసిన కైకలూరు రూరల్‌ సీఐ కృష్ణకుమార్, ఎస్సై వెంకట్కుమార్, హెడ్‌ కానిస్టేబుల్‌ శంకరరావు, కానిస్టేబుల్‌ నాగబాబులను ఆయన అభినందించారు. రాజీకి రానందుకు బాధిత మహిళపై దాడి చేసిన నలుగురిని త్వరలో అరెస్టు చేస్తామని తెలిపారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని