logo

ఉద్యానం.. జిల్లాకు తలమానికం

దేశంలోనే రెండో ఉద్యాన విశ్వవిద్యాలయంగా తాడేపల్లిగూడెం మండలం వెంకట్రామన్నగూడెంలో 2007 జూన్‌ 26న అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌ ఉద్యాన విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసింది.

Published : 26 Jun 2024 03:37 IST

నేడు వర్సిటీ  వ్యవస్థాపన దినోత్సవం

ఉద్యాన విశ్వవిద్యాలయం, న్యూస్‌టుడే : దేశంలోనే రెండో ఉద్యాన విశ్వవిద్యాలయంగా తాడేపల్లిగూడెం మండలం వెంకట్రామన్నగూడెంలో 2007 జూన్‌ 26న అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌ ఉద్యాన విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసింది. 2012లో  వైఎస్‌ఆర్‌ ఉద్యాన విశ్వవిద్యాలయంగా పేరు మార్చారు. అనంతరం రాష్ట్ర విభజనతో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొంది. 2014 తెదేపా ప్రభుత్వం ప్రోత్సాహంతో విద్యార్థులకు నాణ్యమైన విద్య  అందించడంతో పాటు రైతులకు వెన్నుదన్నుగా ఉంటూ దేశవ్యాప్తంగా ఖ్యాతి గడించింది. విద్యతో పాటు విద్యార్థులకు ఉద్యోగ, ఉపాధి, పరిశోధన రంగాల్లో స్థిరపడేందుకు అవసరమైన మార్గదర్శనం చేస్తోంది.  గ్రామీణ మహిళలు, యువత ఉపాధి పొందేందుకు విభిన్న అంశాలపై శిక్షణ ఇచ్చి, వారి ఆర్థికాభివృద్ధికి చేయూతనిస్తున్నామని వర్సిటీ ఉపకులపతి డా.టి.జానకిరామ్‌ తెలిపారు. నేడు వర్సిటీ వ్యవస్థాపక దినోత్సవం నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. 

కోర్సులు.. విద్యార్థులు

ఉద్యాన వర్సిటీలో బీఎస్సీ, పీజీ, పీహెచ్‌డీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. దీని పరిధిలో నాలుగు చొప్పున ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలు ఉన్నాయి. ఈ ఏడాది పులివెందులలో అయిదో ప్రభుత్వ ఉద్యాన కళాశాల ప్రారంభమైంది. రెండేళ్ల కాల పరిమితితో ఉద్యాన పాలిటెక్నిక్‌ కోర్సు అందుబాటులోకి తెచ్చారు. సేంద్రియ వ్యవసాయ, ఉద్యాన పంటల నర్సరీల యాజమాన్యంపై ప్రత్యేక సర్టిఫికేట్‌ కోర్సులు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాలు, భూటాన్, దక్షిణ సూడాన్, నేపాల్‌ తదితర దేశాల విద్యార్థులు ఉద్యాన విద్య  అభ్యసిస్తున్నారు. ఇప్పటి వరకు 5,707 మంది డిగ్రీ, 803 మంది పీజీ, పీహెచ్‌డీ, 3,483 మంది పాలిటెక్నిక్‌ కోర్సులు పూర్తి చేశారు.

కూటమి ప్రభుత్వంతో చిగురించిన ఆశలు

వైకాపా అయిదేళ్ల పాలనలో విశ్వవిద్యాలయం నిర్వహణ అంతంత మాత్రంగానే మారింది. అప్పటి తెదేపా హయాంలో చేపట్టిన భవనాలూ ఇప్పటికీ అసంపూర్తిగా దర్శనమిస్తున్నాయి.  ఎంతో ఆర్భాటంగా ప్రారంభించిన కేంద్ర గ్రంథాలయంలో సరైన మౌలిక వసతులు కల్పించలేకపోవడంతో వినియోగంలోకి రాలేదు.  కూటమి ప్రభుత్వంతో వర్సిటీకి పూర్వ వైభవం వస్తుందని విద్యార్థులు, రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి.

కొత్త వంగడాలు

19 రకాల ఉద్యాన పంటల నుంచి 38 రకాల నూతన వంగడాలను రాష్ట్ర, జాతీయ స్థాయిలో విడుదల చేశారు. గుంటూరులోని లాం పరిశోధన స్థానంలో నూతన మిరప రకం ఎల్‌సీఏ-643 రైతుల క్షేత్రాల్లో  చిరు సంచుల పరిశీలనలు పూర్తి చేసుకుని మంచి గుర్తింపు పొందాయి.

గ్రామాల దత్తత

వర్సిటీ పరిధిలోని 42 సంస్థలతో మన గ్రామం- మన విశ్వవిద్యాలయం (వీసీ టూ విలేజ్‌) కార్యక్రమంతో ఇప్పటి వరకు 171 గ్రామాలను దత్తత తీసుకున్నారు. గ్రామీణ యువత, మహిళలు, .రైతులకు ఉద్యాన పంటలపై అవగాహన కల్పిస్తున్నారు.

ప్రత్యేక పరిశోధనలు

2020 నుంచి వివిధ పంటల సంవత్సరాలు ప్రకటించి పరిశోధన, విస్తరణ కార్యక్రమాలు నిర్వహించారు. 2020-21 కొబ్బరి, 2021-22 నిమ్మ, 2022-23 అరటి, 2023-24 మిరప సంవత్సరంగా  ప్రకటించారు.

సాధించిన మైలురాళ్లు

దేశంలోనే ప్రతిష్టాత్మకమైన ఐసీఏఆర్, ఎన్‌ఏఈబీ సంయుక్తంగా ఒచ్చే ఏ గ్రేడ్‌ అక్రిడేషన్‌ను 2021లో  సాధించింది. అనంరాజుపేట పరిశోధన స్థానంలో   అరటి పంటపై టిష్యూ కల్చర్‌ ప్రయోగశాల ప్రత్యేక గుర్తింపు పొందింది. వినియోగించిన పువ్వులను డ్రై  ఫ్లవర్‌ టెక్నాలజీతో విలువ ఆధారిత ఉత్పత్తులు తయారు చేసేలా  తితిదేతో అవగాహన ఒప్పందం   చేసుకోవడంతో  అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని