logo

వేంపాడు మేజర్‌ను పాడుపెట్టారు

చింతలపూడి ఎత్తిపోతల పథకం..కృష్ణా..గోదావరి జిల్లాల్లో లక్షలాది మంది రైతులకు జీవనాధారం కానుంది. లక్షలాది ఎకరాలకు గోదావరి జలాలు అందించే బృహత్తర పథకమిది.

Published : 26 Jun 2024 03:45 IST

అయిదేళ్ల వైకాపా పాలనలో పైసా విదల్చని వైనం
చింతలపూడి ఎత్తిపోతలలో కీలక కాలువ ఇది
చాట్రాయి, న్యూస్‌టుడే

చింతలపూడి ఎత్తిపోతల పథకంలో కీలకమైన వేంపాడు మేజర్‌ కాలువ

చింతలపూడి ఎత్తిపోతల పథకం..కృష్ణా..గోదావరి జిల్లాల్లో లక్షలాది మంది రైతులకు జీవనాధారం కానుంది. లక్షలాది ఎకరాలకు గోదావరి జలాలు అందించే బృహత్తర పథకమిది. చాట్రాయి మండలం చీపురుగూడెం వద్ద అక్విడెక్టు నిర్మించి అక్కడి నుంచి నూతన కాలువ ద్వారా వేంపాడు మేజర్‌ కాలువ 13.08 కిమీ వద్దకు చేరేలా పనులు చేపట్టారు. కొంత మేరకు భూములను సేకరిస్తూనే కాలువ తవ్వకాలకు ఆటంకాలు లేకుండా చేపట్టారు. ఇక వేంపాడు మేజర్‌ కాలువ 13.8 కి.మీ నుంచి ఎన్నెస్పీ ప్రధాన కాలువ 117 కిలో మీటరు రెగ్యులేటర్‌కు గోదావరి జలాలు చేరాలన్నదే ‘చింతలపూడి ఎత్తిపోతల’ పథకం తొలి లక్ష్యం.

వేంపాడు మేజర్‌ కాలువ 53 కి.మీ.దూరంలో,.. 32 వేల ఎకరాల ఆయకట్టుతో చాట్రాయి, ముసునూరు, బాపులంపాడు మండలాలతో సహా వేంపాడు గ్రామం వరకు ఉంది.

117 కిలో మీటరు రెగ్యులేటర్‌ నుంచి నూజివీడు బ్రాంచి కాలువ ద్వారా నూజివీడు, ఆగిరిపల్లి మండలాలు, జమాలాపురం బ్రాంచి, బాపులపాడు మేజర్, నూజివీడు బ్రాంచి కాలువల ద్వారా ఉమ్మడి కృష్ణా జిల్లాలో 2.10 లక్షల ఎకరాల సాగర్‌ ఆయకట్టుకు గోదావరి జలాలు సాగు నీరుగా అందుతాయి. ఇవే కాక ఆయా ప్రాంతాల పరిధిలో చెరువులకు, రక్షిత నీటి అవసరాలకు మళ్లించేలా చేశారు. ఇలాంటి బృహత్తర పథకాన్ని జగన్‌ ప్రభుత్వం మూలకు చేర్చింది. ఇందుకు అసలు కారణమేమిటనే ఆలోచన చేస్తే చింతలపూడి ఎత్తిపోతల రూపకల్పన అప్పటి ముఖ్యమంత్రిగా ‘చంద్రబాబు’ చేయడమే. ఫలితంగా గడిచిన ఆయిదేళ్లుగా పైసా విదల్చలేదు.

 వైకాపా  పాలనలో  నిలిపి వేసిన పనులు

సర్దుకుపోయారు.. వైకాపా పాలన మొదలవగానే వేంపాడు మేజర్‌ కాలువపై పనులు నిలిపి వేశారు. పైసా కూడా వచ్చే అవకాశం ఏ కోశానా కన్పించక పోవడంతో గుత్తేదారులు యంత్రాలు, తాత్కాలిక నివాసాలను సైతం సర్దుకుని వెళ్లిపోయారు. ఇక ఎక్కడి పనులక్కడే నిలిచి కాలువకు గండ్లు పడ్డాయి. వాటిలో నుంచి వర్షం నీరు ప్రవహించి పూడిక మేటలు వేశాయి. కాలువ గట్లపై తుమ్మ చెట్లు పెరిగి పెరిగి అరణ్యంలా మారింది. కాలువలో జమ్మి పెరిగింది. సిమెంటు కట్టడాల్లో ఇనుము  తుప్పు పట్టింది.

గండ్లతో కర్షకులకు ఇక్కట్లు. వేంపాడు మేజర్‌ కాలువపై పడిన గండ్లతో ఇరువైపులా వ్యవసాయ పనులకు వెళ్లే రైతులకు ఇక్కట్లు తప్పడం లేదు. కాలువ ‘0’ నుంచి చాట్రాయి వరకు ఇదే పరిస్థితి. తాజాగా పనులు మంజూరు చేసినా సర్వే చేసేందుకు లక్షలాది రూపాయలు ఖర్చు చేస్తేనే వాహనాలు నడిచే అవకాశముంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని