logo

అక్రమ నిర్మాణం తొలగించండి

ఉండి మండలం ఎన్నార్పీఅగ్రహారం గ్రామంలోని ప్రభుత్వ భూమిలో వైకాపా జిల్లా కార్యాలయాన్ని అనధికారికంగా నిర్మిస్తున్న నేపథ్యంలో పంచాయతీ అధికారులు మంగళవారం ప్రొవిజినల్‌ ఆర్డర్‌ నోటీసులు జారీ చేశారు.

Published : 26 Jun 2024 03:53 IST

వైకాపా కార్యాలయానికి నోటీసులు

ఎన్నార్పీఅగ్రహారంలో గోడకు నోటీసు అతికించిన పంచాయతీ సిబ్బంది

ఉండి, న్యూస్‌టుడే: ఉండి మండలం ఎన్నార్పీఅగ్రహారం గ్రామంలోని ప్రభుత్వ భూమిలో వైకాపా జిల్లా కార్యాలయాన్ని అనధికారికంగా నిర్మిస్తున్న నేపథ్యంలో పంచాయతీ అధికారులు మంగళవారం ప్రొవిజినల్‌ ఆర్డర్‌ నోటీసులు జారీ చేశారు. పంచాయతీ కార్యదర్శి జేవీటీ నాయుడు, వీఆర్వో గోవిందు, సచివాలయ సిబ్బందితో కలిసి నిర్మాణ ప్రాంతానికి వెళ్లి అక్కడ ఉన్న కార్మికులకు నోటీసులు ఇచ్చేందుకు ప్రయత్నించారు. తీసుకొనేందుకు కార్మికులు నిరాకరించడంతో కట్టడం గోడలకు నోటీసు ప్రతిని అతికించారు. వైకాపా జిల్లా అధ్యక్షుడు శ్రీరంగనాథరాజు పేరిట ఈ నోటీసు జారీ అయ్యింది. గ్రామంలోని ఏపీ హౌసింగ్‌ కార్పొరేషన్‌కు చెందిన 72 సెంట్ల స్థలం(ఆర్‌ఎస్‌ నంబరు 201-3)లో పంచాయతీ అనుమతి లేకుండా 1,128 చదరపు మీటర్ల కొలతలతో చేపట్టిన భవన నిర్మాణాన్ని వెంటనే నిలిపివేయాలని, ఇప్పటికే చేసిన కట్టడాన్ని వారం రోజుల్లో తొలగించడంతో పాటు నిబంధనలకు అనుగుణంగా మార్పులు చేసి ప్లాన్‌ కోసం దరఖాస్తు చేయాలని స్పష్టం చేశారు. లేనిపక్షంలో కట్టడాన్ని పంచాయతీ సిబ్బందితో తొలగించి దానికి అయ్యే ఖర్చులను రాబడతామని నోటీసుల్లో పేర్కొన్నారు. మరోపక్క సెంట్రింగ్‌ సామగ్రి తరలింపు ప్రక్రియ మంగళవారం కూడా కొనసాగింది.

ఏలూరులో.. ఏలూరు టూటౌన్, న్యూస్‌టుడే: ఎలాంటి అనుమతులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా ఏలూరులో నిర్మించిన వైకాపా కార్యాలయానికి మున్సిపల్‌ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఏలూరు రైల్వే స్టేషన్‌ సమీపంలోని స్టేడియం పక్కనే రెండెకరాల్లో కార్యాలయం ఏర్పాటు చేశారు. కార్యాలయ భవనాన్ని 960 చదరపు మీటర్లలో అనుమతులు తీసుకోకుండానే నిర్మించారు. అప్పట్లో వైకాపా అధికారంలో ఉన్నందున అధికారులు కూడా పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పుడు పరిస్థితులు తారుమారు కావడంతో ఆరా తీశారు. ఈ నేపథ్యంలో నగర కమిషనర్‌ సంక్రాంతి వెంకటకృష్ణ ఆదేశించడంతో మంగళవారం టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు నోటీసులు జారీ చేశారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని