logo

నెత్తిన పెట్టుకొని ఊరేగారు

నగర, పురపాలికల్లో కొందరు అధికారులు గత అయిదేళ్లలో  వైకాపా వీర విధేయులుగా వ్యవహరించారు. స్థానిక  ప్రజాప్రతినిధులు కూర్చోమంటే.. కూర్చున్నారు.

Published : 26 Jun 2024 03:57 IST

పురాల్లో వైకాపా వీర విధేయులు
నాయకుల ఆజ్ఞలే శిరోధార్యంగా వ్యవహారాలు

ఈనాడు, ఏలూరు: నగర, పురపాలికల్లో కొందరు అధికారులు గత అయిదేళ్లలో  వైకాపా వీర విధేయులుగా వ్యవహరించారు. స్థానిక  ప్రజాప్రతినిధులు కూర్చోమంటే.. కూర్చున్నారు. నిల్చోమంటే నిల్చున్నారు. వారి ఆదేశాలను నెత్తినపెట్టుకుని ఊరేగారు. అధికారపార్టీ నేతలను ప్రసన్నం  చేసుకునేందుకు అడ్డగోలుగా వ్యవహరించారు. ఫలితంగా గత అయిదేళ్లలో నగర, పురపాలికలు అవినీతిలో కూరుకుపోయాయి. ఈ అవినీతి కూపాన్ని కడిగేయాల్సిన   గురుతర బాధ్యత కూటమి ప్రభుత్వంపై ఉంది.

వైకాపా నాయకులకు కొమ్ము కాస్తూ ఏలూరు పట్టణ ప్రణాళికాధికారి సాంబ నగరపాలికను భ్రష్టుపట్టించారు.  ప్లాన్‌ అప్రూవల్‌ లేని భవనాలను, నిబంధనలకు విరుద్ధంగా చేపడుతున్న నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలి. ఆయన మాత్రం ఒక్క అడ్డగోలు నిర్మాణాన్నీ ఆపలేదు. ఏలూరు నడిబొడ్డున రూ.కోట్ల విలువైన ప్రభుత్వ స్థలంలో కనీస అనుమతులు లేకుండా వైకాపా కార్యాలయం కడుతున్నా పట్టించుకోలేదు. నగరపాలికకు కూత వేటు దూరంలో ఉన్నా నోటీసు ఇచ్చే సాహసం కూడా చేయలేదు. నిర్మాణాల్లో నిబంధనల అతిక్రమణ స్థాయిని బట్టి చైన్‌మెన్ల ద్వారా రూ.50 వేల నుంచి రూ.2 లక్షల వరకు వసూలు చేసి..ఉన్నతాధికారుల మొదలు వైకాపా నాయకుల వరకు వాటాలు వేసుకున్నట్లు తెలుస్తోంది.

అధికార పార్టీకి వసూళ్ల రాజా

వైకాపా అధికారంలోకి వచ్చాక 2021లో జంగారెడ్డిగూడెం కమిషనర్‌గా వచ్చిన శ్రావణ్‌కుమార్‌ అధికార పార్టీ అడుగులకు మడుగులొత్తారు. అప్పటి ప్రజాప్రతినిధి ఆశీస్సులు, పాలకవర్గంలో కొందరి అండతో వసూళ్ల దందా చేస్తున్నారని అధికార, ప్రతిపక్షపార్టీ కౌన్సిలర్లే రచ్చ చేశారు. పట్టణ ప్రణాళిక విభాగంలో భారీగా దండుకుంటున్నారని ఆరోపిస్తూ కమిషనర్‌ను సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. పురపాలిక అవినీతిపై విచారణ చేయాలని ప్లకార్డులు పట్టుకుని ఆందోళన చేశారు. ఆయన పని చేసిన రెండేళ్లు వైకాపా నాయకులు తానా అంటే తందాన అన్నారు.

ఆయనకు భక్తుడిగా

భీమవరంలో ఇన్‌ఛార్జి ఎంహెచ్‌వోగా, శానిటరీ ఇన్‌స్పెక్టర్‌గా ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న వేండ్ర వెంకట దుర్గా ప్రసాద్‌ వైకాపా ఎమ్మెల్యే క్లాస్‌మెట్‌ మాత్రమే కాదు అపర భక్తుడు. అందుకే గతంలో కొవ్వూరు బదిలీ అయినా వెళ్లకుండా డిప్యుటేషన్‌పై భీమవరంలోనే పని చేశారు. ఆపై స్థిరపడిపోయారు. ఎమ్మెల్యే వద్ద పీఏగా కొనసాగుతున్న వ్యక్తికి అక్రమంగా అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగం కట్టబెట్టి వైకాపాకు వీర విధేయుడిగా ఉన్నారు.

ఎమ్మెల్యే చెప్పిందే వేదం

భీమవరం కమిషనర్‌ ఎం.శ్యామలకు అప్పటి భీమవరం ఎమ్మెల్యే మాటే శాసనం. ఎంత పెద్ద నిబంధనలైనా తుంగలో తొక్కేస్తారు. పట్టణంలో రహదారులు లేక జనం నరకం చూస్తుంటే అక్కడ రోడ్లు వేయించడం మాని వైకాపా నాయకుల లేఅవుట్లకు..స్థలాలకు రోడ్లు వేయించి స్వామి భక్తి చాటుకున్నారు. ఇలా పట్టణంలోని నర్సయ్య అగ్రహారంతోపాటు పురపాలికలో అధికారికంగా విలీనం కాని రాయలం, చినఅమిరంలో రోడ్లు వేయించారు. పారిశుద్ధ్య కార్మికులు, డ్రైవర్లు.. ఇలా 42 అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగాలు నిబంధనలకు విరుద్ధంగా వైకాపా నాయకులు చెప్పిన వారికి కట్టబెట్టారన్న ఆరోపణలున్నాయి.

అంతా కృష్ణార్పణం

ఏలూరు నగరపాలిక సంస్థ కమిషనర్‌గా వచ్చిన సంక్రాంతి వెంకట కృష్ణ అధికార పార్టీకి చెందిన ఓ బడాబాబు చేతిలో కీలుబొమ్మలా మారిపోయారు. నగరపాలికలో ఆశీలకు టెండర్లు పిలవకుండా బడాబాబు అనుచరుడినే కొనసాగించారు. చెత్తపన్ను వసూలు చేయని ఉద్యోగులకు నోటీసులు పంపి వారి ఖాతాల నుంచి రికవరీ చేస్తానంటూ వైకాపాపై ఆయనకున్న విధేయతను చాటుకున్నారు. నగరపాలికలో పార్కు స్థలాలను అడ్డగోలుగా వైకాపా నాయకులు ఆక్రమించారంటూ పత్రికల్లో కథనాలు వచ్చినా పట్టించుకున్న దాఖలాలు లేవు. ప్రజారోగ్య విభాగంలో ఉద్యోగులు బినామీ కార్మికులను పెట్టి పని చేస్తున్నా పట్టించుకోలేదు. అడ్డగోలుగా భవనాలు కట్టేస్తున్నా అదే తీరు. జనన మరణ విభాగంలో అనేక అవకతవకలు జరిగినా చర్యలు లేవు. నగరపాలికలోని దుకాణాల్లో చాలా వరకు వైకాపా నాయకుల ఆధీనంలో ఉండి అద్దె చెల్లింపులు చేయకున్నా మిన్నకున్నారు. రెవెన్యూ సిబ్బందితో ఆస్తిపన్ను వసూలు చేయించటంలోనూ విఫలమయ్యారు. వైకాపా నాయకులు చెప్పే అడ్డగోలు వ్యవహారాలను తీర్మానాల్లో పెట్టించి ఆమోదించడంలో ఆయన పాత్ర కీలకం.

వల్లమాలిన గౌరవం

భీమవరం పురపాలికలో ఏసీపీగా పని చేస్తున్న గౌరుకు వైకాపా ఎమ్మెల్యే మాటంటే వల్లమాలిన గౌరవం. ఆయన ఆదేశించారని జనసేన నాయకుడు మల్లినీడి బాబికి చెందిన పెంట్‌ హౌస్‌ను అడ్డగోలు కొట్టేశారు. నిర్మాణదారులకు కనీసం నోటీసులు ఇవ్వకుండా కూల్చేసి స్వామి భక్తిని చాటుకున్నారు. ఇదే తరహాలో నిబంధనలకు విరుద్ధంగా వందల సంఖ్యలో నిర్మాణాలున్నా కనీసం కన్నెత్తి చూడలేదు. వైకాపా నాయకుల అండతో అడ్డగోలుగా మాస్టర్‌ప్లాన్‌ నిబంధనలు అతిక్రమించి కట్టినా వాటిని కూల్చాలని ఉన్నతాధికారులు ఆదేశించినా నామమాత్రపు చర్యలతో మమ అనిపించారు. మళ్లీ అక్కడ నిర్మాణాలు యథాతథంగా ఉన్నా చర్యలు తీసుకోలేదు. వైకాపాకు చెందిన వారికి సీసీ రహదారుల కాంట్రాక్టులు కట్టబెట్టడంలో దిట్ట.

ప్రజారోగ్యంలో  అవినీతి కంపు

ఏలూరు ప్రజారోగ్య విభాగం ఇన్‌ఛార్జి వైద్యాధికారి మాలతి తీరుతో అవినీతి రాజ్యమేలుతోంది. ఆమెకు ఆ కొలువుకు అర్హత లేకున్నా వైకాపా ప్రజాప్రతినిధి అండతో గత రెండేళ్లుగా కొనసాగిస్తున్నారు. వైకాపా కౌన్సిలర్లు మొదలు నాయకుల వరకు చాలా మంది ఇళ్లలో ఇంటి, వంట పనులు చేసేందుకు పారిశుద్ధ్య కార్మికులను పంపించేస్తారు. పారిశుద్ధ్య కార్మికులు వైకాపా నేతల సిఫార్సులతో అడ్డగోలుగా ఉద్యోగాలు పొంది విధులకు రాకున్నా..బినామీ కార్మికులతో పనులు చేయిస్తున్నా చర్యలు తీసుకోరు. జనన-మరణాల పత్రాల విభాగంలో ముడుపులు ఇస్తేగాని పత్రాలు ఇవ్వకపోవటంపై పత్రికల్లో కథనాలు వచ్చినా చర్యల్లేవ్‌. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని