logo

1,067 ఉపాధ్యాయ కొలువులు!

సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించి ఎన్డీయే అధికారంలోకి రాగానే తొలి సంతకం మెగా డీఎస్సీపై పెడతానని చంద్రబాబునాయుడు మేనిఫెస్టోలో చెప్పిన విధంగానే సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ఆ పనిచేశారు.

Published : 26 Jun 2024 03:59 IST

మెగా డీఎస్సీపై నిరుద్యోగుల ఆశలు
ఏలూరు విద్యా విభాగం, న్యూస్‌టుడే

సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించి ఎన్డీయే అధికారంలోకి రాగానే తొలి సంతకం మెగా డీఎస్సీపై పెడతానని చంద్రబాబునాయుడు మేనిఫెస్టోలో చెప్పిన విధంగానే సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ఆ పనిచేశారు. వైకాపా ప్రభుత్వం డీఎస్సీ-2024 ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా సుమారు  6 వేల ఉపాధ్యాయ కొలువులను భర్తీ చేస్తామని ప్రకటించింది. దీన్ని కొత్త ప్రభుత్వం రద్దు చేయనుంది. త్వరలో డీఎస్సీ ప్రకటనను వెలువరించనుంది.

ఉమ్మడి జిల్లా ప్రాతిపదికన..

రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ బడుల్లో 16,347 ఉపాధ్యాయ కొలువులను మెగా డీఎస్సీ ద్వారా భర్తీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాకు తాత్కాలిక ప్రాతిపదికన 1,067 కేటాయించింది. వైకాపా ప్రభుత్వం నూతన విద్యా విధానం పేరిట ప్రాథమిక పాఠశాలల్లోని 3, 4, 5 తరగతుల్ని ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో విలీనం చేసిన విషయం తెలిసిందే. వీటిని మళ్లీ ప్రాథమిక బడుల్లో చేర్చడం ద్వారా మరికొంతమంది ఉపాధ్యాయుల అవసరం ఏర్పడుతుంది.

విద్యార్థులు, ఉపాధ్యాయ నిష్పత్తి మారితే..

వైకాపా ప్రభుత్వం అమలు చేసిన నూతన విద్యా విధానంలో ఉమ్మడి జిల్లాలో కొందరు ఉపాధ్యాయులు మిగులు జాబితాలోకి వెళ్లారు. ప్రతి 30 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు చొప్పున కేటాయించడం.. అలాగే 3, 4, 5 తరగతుల విలీనంతో కూడా ఈ పరిస్థితి ఏర్పడింది. ఎన్డీయే ప్రభుత్వం చెప్పిన ప్రకారం మెగా డీఎస్సీ నిర్వహించాలంటే ప్రతి 10 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు చొప్పున కేటాయించాల్సి ఉంటుంది. లేదా జీవో 117 రద్దు చేసి పాత పద్ధతిలో 3, 4, 5 తరగతులను ప్రాథమిక పాఠశాలల్లోకి తీసుకు రావాల్సి ఉంటుంది.
స్కూలు అసిస్టెంట్లు అవసరం.. ఉమ్మడి జిల్లాలో ప్రస్తుతం 200 మంది వరకు స్కూలు అసిస్టెంట్లు అవసరం అవుతారు. ఉన్నత పాఠశాలల్లో ఆంగ్లంతో పాటు తెలుగు మాధ్యమాన్ని కొనసాగిస్తే మరికొందరి అవసరం ఏర్పడుతుంది. 117 జీవో రద్దు చేస్తే ఎస్‌జీటీల అవసరం కూడా ఉంటుంది. మెగా డీఎస్సీ నిర్వహణకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇంకా విధి విధానాలు వెలువడలేదని జిల్లా విద్యా శాఖాధికారి ఎస్‌.అబ్రహం తెలిపారు. రెండు మూడు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉందని వివరించారు.

డీఎస్సీ కోసం ఎదురుచూపు.. ఉమ్మడి జిల్లాలో ఉపాధ్యాయ కొలువుల భర్తీకి సంబంధించి ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) నిర్వహణ అనంతరం డీఎస్సీ ద్వారా ఉద్యోగాలు పొందడానికి సుమారు 25 వేల మంది వరకు నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారు. ఎన్డీయే ప్రభుత్వం ప్రకటించిన ప్రకారం మెగా డీఎస్సీ నిర్వహిస్తే వందలాది మంది ఆశలు ఫలించే అవకాశముంది.

ఉమ్మడి జిల్లాకు  కేటాయింపు ఇలా..

మొత్తం ఉపాధ్యాయ కొలువులు 1,067
సెకండరీ గ్రేడ్‌   434

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని