logo

సమయం.. సందర్భం లేదు

తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో నానాటికీ విద్యుత్తు కోతలు అధికమవుతున్నాయి. కొన్ని రోజులుగా వేళాపాళా లేకుండా సరఫరా నిలిచిపోతోంది. వర్షాలు పడుతున్నా ఇళ్లల్లో ఉక్కపోత తప్పడం లేదు.

Updated : 26 Jun 2024 04:42 IST

గాలి వీచినా.. వర్షం  కురిసినా కరెంటు కోతలు

చెట్ల కొమ్మల మధ్య విద్యుత్తు తీగలు

తాడేపల్లిగూడెం అర్బన్, న్యూస్‌టుడే : తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో నానాటికీ విద్యుత్తు కోతలు అధికమవుతున్నాయి. కొన్ని రోజులుగా వేళాపాళా లేకుండా సరఫరా నిలిచిపోతోంది. వర్షాలు పడుతున్నా ఇళ్లల్లో ఉక్కపోత తప్పడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో పంకా తిరగకుండా ఇంట్లో ఉండటం సాధ్యమేనా అని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా మధ్యాహ్నం, రాత్రి వేళల్లో విద్యుత్తు నిలిచిపోవడంతో చిన్న పిల్లలు, వృద్ధులు నిద్ర లేక ఇబ్బంది పడుతున్నారు. వాస్తవానికి విద్యుత్తు కోతలు అమలు చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించకపోయినా...  కోతలకు సాంకేతిక సమస్యలు కారణమని చెబుతున్నారు. డిమాండ్‌కు తగ్గట్టుగా విద్యుత్తు సరఫరా చేయలేక వివిధ కారణాలు చూపి గ్రామాలు, పట్టణంలోని పలు ప్రాంతాల్లో అనధికారిక కోతలు విధిస్తున్నారు. వాటికి వార్షిక తనిఖీలు అనే ముద్ర వేస్తున్నారు.

చెట్ల కొమ్మల్లో తీగలు

చాలా వరకు విద్యుత్తు లైన్లు చెట్ల కొమ్మల్లోనే ఉంటున్నాయి. గాలులు వీచే సమయంలో  తీగలు ఒకదానికొకటి తాకి నిప్పులు చిమ్ముతూ సాంకేతిక సమస్యకు కారణంమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎలాంటి సమస్య ఉండకూడదని ముందుగానే సరఫరా నిలిపేస్తున్నారు. భారీ ఈదురు గాలులకు చెట్లు నేలకొరుగుతున్నాయి. ఆ సమయంలో  తీగలు సైతం తెగిపోయి సరఫరాకు ఆటంకం కలుగుతోంది. తిరిగి విద్యుత్తును పునరుద్ధరించాలంటే గంటల సమయం పడుతోంది. విద్యుత్తు ఉద్యోగులు సైతం తీవ్రంగా శ్రమించాల్సి వస్తోంది.

ఫోన్‌ చేస్తే స్పందించడం లేదు

తరచూ విద్యుతు సరఫరాకు అంతరాయం కలుగుతోంది. సమయం సందర్భం లేకుండా కరెంటు పోతుండటంతో చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఎక్కువ శాతం రాత్రి వేళల్లో నిలిచిపోతోంది. అర్ధరాత్రి సమయంలో అధికారులకు ఫోన్‌ చేస్తుంటే వారు స్పందించడం లేదు.  

 గిరీష్, రామచంద్రరావుపేట

తరచూ అవాంతరం

డిమాండ్‌కు తగ్గ సరఫరా లేక  లో ఓల్టేజ్‌ సమస్య వస్తోంది. వర్షాలు పడిన ప్రతీసారి ఇదే సమస్య ఎదురవుతోంది.  విద్యుత్తు ఉన్నా పంకాలు తిరగని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో విద్యుత్తు ఉపకరణాలు మరమ్మతులకు గురయ్యే ప్రమాదం ఉంది.

 రాంబాబు, పడాల

లో ఓల్టేజ్‌ సమస్యలు

డిమాండ్‌ తగ్గట్టుగా సరఫరా చేయలేకపోవడంతో లో ఓల్టేజ్‌ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. అలాంటి సమయంలో విద్యుత్తు ఉపకరణాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. ఇటీవల ఏసీల వినియోగం భారీగా పెరిగింది.  ఇటీవల పాతూరులో లో ఓల్టేజ్‌్ సమస్య కారణంగా తరచూ  విద్యుత్తు సరఫరాకు అంతరాయం కలిగేది. దీంతో స్థానికులు ధర్నాకు దిగారు. ఎమ్మెల్యే జోక్యంతో నూతన విద్యుత్తు పరివర్తకాన్ని ఏర్పాటు చేశారు.

చర్యలు తీసుకుంటాం : ‘డిమాండ్‌కు తగ్గట్టుగానే సరఫరా చేస్తున్నాం. కొన్ని ప్రాంతాల్లో సాంకేతిక సమస్యలతో ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. నిరంతర సరఫరాకు చర్యలు తీసుకుంటాం’ అని ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీరు వెంకటేశ్వరరావు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని