logo

తాడేపల్లిగూడెం తీర్పు విలక్షణం.. వరుసగా ఆరు ఎన్నికల్లో ఆరు పార్టీల గెలుపు

భౌగోళికంగా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాకు కేంద్ర స్థానంలో ఉన్న తాడేపల్లిగూడెం అసెంబ్లీ నియోజకవర్గం ఎన్నికల రాజకీయాల్లో సరికొత్త రికార్డు సృష్టించింది. 1999 నుంచి 2024 వరకు వరుసగా ఇక్కడ జరిగిన ఆరు ఎన్నికల్లో ఆరు వేర్వేరు పార్టీల అభ్యర్థులు

Updated : 07 Jun 2024 08:52 IST

ఈనాడు, భీమవరం: భౌగోళికంగా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాకు కేంద్ర స్థానంలో ఉన్న తాడేపల్లిగూడెం అసెంబ్లీ నియోజకవర్గం ఎన్నికల రాజకీయాల్లో సరికొత్త రికార్డు సృష్టించింది. 1999 నుంచి 2024 వరకు వరుసగా ఇక్కడ జరిగిన ఆరు ఎన్నికల్లో ఆరు వేర్వేరు పార్టీల అభ్యర్థులు గెలిచారు. తెలంగాణలోని నిర్మల్, ఆంధ్రప్రదేశ్‌లోని పెందుర్తి వంటి అతికొద్ది నియోజకవర్గాల్లో ఇలా ఆరు పార్టీల నుంచి  అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా ఎన్నికయినా అవి వరుసగా జరగలేదు.

  • 1952లో ఏర్పడిన తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో 1983 వరకు ఆరుసార్లు ఎన్నికలు జరగ్గా అందులో ఐదుసార్లు కాంగ్రెస్‌ పార్టీ గెలిచింది. 1983లో తెలుగుదేశం ఆవిర్భవించాక ఆ పార్టీకి కంచుకోటగా మారింది. యీలి ఆంజనేయులు 1983లో తెదేపా అభ్యర్థిగా విజయం సాధించారు. అప్పటి నుంచి 1999 వరకు ఆరుసార్లు ఎన్నికలు జరిగితే అందులో 5సార్లు తెదేపానే విజయదుందుభి మోగించింది.
  • ప్రజారాజ్యం పార్టీ పశ్చిమ గోదావరి జిల్లాలో గెలిచిన ఏకైక నియోజకవర్గం తాడేపల్లిగూడెం. పార్టీ అధ్యక్షుడు చిరంజీవి ఈ జిల్లాలోని పాలకొల్లులో ఓటమి పాలైనా  గూడెం ఓటర్లు ఆ పార్టీకి పట్టం కట్టి యీలి నానిని ఎమ్మెల్యేగా గెలిపించారు.
  • మ్మడి పశ్చిమ గోదావరి జిల్లా చరిత్రలో భాజపా గెలిచిన ఏకైక అసెంబ్లీ నియోజకవర్గం కూడా ఇదే. 2019లో తెదేపా, జనసేన మద్దతుతో భాజపా అభ్యర్థి పైడికొండల మాణిక్యాలరావు విజయం సాధించారు.
  •  ఈ నియోజకవర్గం నుంచి గెలిచిన ఎమ్మెల్యేల్లో ముగ్గురు దేవాదాయశాఖ మంత్రులుగా పనిచేశారు. 1983లో యీలి ఆంజనేయులు ఎన్టీఆర్‌ తొలి క్యాబినెట్‌లో దేవాదాయ శాఖ అమాత్యుడయ్యారు. 2014లో గెలిచిన భాజపా అభ్యర్థి పైడికొండల మాణిక్యాలరావుకు ఉమ్మడి ప్రభుత్వంలో చంద్రబాబు క్యాబినెట్‌లోనూ ఇదే పదవి దక్కింది. 2019లో గెలిచిన వైకాపా అభ్యర్థి కొట్టు సత్యనారాయణ కూడా మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణలో అదే శాఖ మంత్రి పదవిని దక్కించుకున్నారు.

1994 నుంచి 2024 వరకు అత్యధిక పర్యాయాలు పోటీ చేసిన అభ్యర్థిగా కొట్టు సత్యనారాయణ ప్రత్యేకంగా నిలిచారు. అత్యధిక సార్లు ఓడిపోయినదీ ఆయనే. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు