logo

Betting: వైకాపా తరఫున పందేలు కాసి అప్పులపాలు.. కృష్ణా బ్యారేజీలోకి దూకి ఆత్మహత్య

ఎన్నికల్లో వైకాపా తరపున కాసిన పందేలు ఓ వ్యక్తి ప్రాణాలు తీశాయి. ఆ పార్టీ ఓడిపోవడంతో అప్పుల పాలయ్యారు.

Updated : 12 Jun 2024 07:44 IST

ఘటనపై అనేక అనుమానాలు

సుబ్బారావు (పాత చిత్రం) 

ప్రొద్దుటూరు నేరవార్తలు, న్యూస్‌టుడే: ఎన్నికల్లో వైకాపా తరపున కాసిన పందేలు ఓ వ్యక్తి ప్రాణాలు తీశాయి. ఆ పార్టీ ఓడిపోవడంతో అప్పుల పాలయ్యారు. దీనికితోడు అప్పులు చేసి రూ.కోట్లు స్థానిక వైకాపాకు చెందిన కీలక నేతలకు ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఒత్తిడి పెరగడంతో మనస్పాం చెంది ప్రొద్దుటూరు పట్టణానికి చెందిన ఓ గుత్తేదారుడు విజయవాడలోని కృష్టా బ్యారేజీలో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన మంగళవారం వెలుగులోకి వచ్చింది. ఆయన మృతిపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పట్టణంలోని వైఎంఆర్‌ కాలనీకి చెందిన వెంకట సుబ్బారావు (52) అనే వ్యక్తి కాంట్రాక్టు పనులు చేస్తుంటారు. మైదుకూరు రోడ్డులోని రోడ్డు విస్తరణ పనులు కూడా అతనే చేసినట్లు తెలుస్తోంది. ఈనెల 7న మధ్యాహ్నం ఇంటి నుంచి వెళ్లిన సుబ్బారావు తిరిగి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు అతనికి ఫోన్‌ చేయగా స్విచ్‌ఆఫ్‌ వచ్చింది. మరుసటి రోజు కూడా అదే పరిస్థితి ఉండటంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు స్థానిక మూడో పట్టణ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదిలా ఉండగా మంగళవారం ఉదయం విజయవాడ కృష్ణా బ్యారేజీలో మృతదేహం ఉండటంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని వెలికి తీసి పరిశీలించగా అతని వద్ద పోన్‌ నంబర్లతో ఉన్న ఓ కాగితం కనిపించింది. ’నాపేరు సుబ్బారావు..మాది ప్రొద్దుటూరు..దయచేసి ఈ నంబర్లకు ఫోన్‌ చేయండి అని రాసి ఉంది.‘ అందులో  ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమమల్లు శివప్రాదురెడ్డి బావమరిది బంగారుమునిరెడ్డితో పాటు కుటుంబ సభ్యుల ఫోన్‌ నంబర్లు ఉన్నాయి. ఆ నంబర్ల ద్వారా సుబ్బారావు ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని పోలీసులు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. అతని ఆత్మహత్యపై పోలీసులు విచారణ చేపట్టారు. ఇటీవల జరిగిన ఎన్నిల్లో రాష్ట్రం, ప్రొద్దుటూరులో వైకాపా గెలుపుపై రూ.కోట్ల పందేలు కాయడంతో పాటు తెలిసిన వ్యక్తుల వద్ద రూ.కోట్ల అప్పులు చేసి వైకాపాకు చెందిన ముఖ్య నేతలకు ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. దాంతో పాటు ఎన్నికల్లో పార్టీల గెలుపు ఓటములపై మధ్యవర్తిగా ఉంటూ పందేలు వేయించారని, పందెంలో ఓడిన వారు డబ్బులు ఇవ్వకపోడంతో గెలిచిన వారి నుంచి ఒత్తిడి పెరిగినట్లు తెలుస్తోంది. వైకాపాను నమ్ముకుని రూ.కోట్ల నష్టపోవడంతోనే ఆయన ఆత్మహత్య చేసుకున్నట్లు పట్టణంలో ప్రచారం జరుగుతోంది. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆయన ఆత్మహత్య చేసుకోవడంతో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని