logo

Chandrababu: గెలిచే సీట్లను చేజార్చారు!.. నేతల తీరుపై చంద్రబాబు తీవ్ర అసంతృప్తి

రాజంపేటలో తెదేపా ఓటమిపై ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తాను స్వయంగా ప్రచారానికి రావడంతో పాటు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్,

Updated : 19 Jun 2024 11:51 IST

రాజంపేట తెదేపా అభ్యర్థిగా పోటీ చేసిన సుగవాసి బాలసుబ్రహ్మణ్యంతో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు

ఈనాడు, కడప: రాజంపేటలో తెదేపా ఓటమిపై ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తాను స్వయంగా ప్రచారానికి రావడంతో పాటు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్, తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ సైతం ప్రచారం చేయడంతో పాటు రాజంపేటను అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చిన తర్వాత సైతం ఓటమి చెందడం ఏమిటని ప్రశ్నించారు. రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రిని మంగళవారం రాజంపేటలో తెదేపా అభ్యర్థిగా పోటీ చేసిన సగవాసి బాలసుబ్రహ్మణ్యం మంగళవారం కలిశారు. ఓటమికి గల కారణాలపై నివేదిక సమర్పించారు. ఈ సందర్భంగా తెదేపాకు కంచుకోటలాంటి రాజంపేటలో ఓడిపోవడం ఏమిటంటూ ఒకింత అసహనం వ్యక్తం చేశారు.

ఓటమికి కారణాలను బాలసుబ్రహ్మణ్యం... చంద్రబాబుకు వివరిస్తూ వైకాపా నుంచి తెదేపాలో చేరిన వారిలో చాలా మంది హడావుడి చేశారు తప్ప, చివరకు ఆశించినంతగా పార్టీకి పని చేయలేదంటూ తెలిపారు. కొత్తగా పార్టీలో చేరిన వారికి ప్రాధాన్యం ఇవ్వడంతో తెదేపాలో చిరకాలంగా ఉన్న వారికి ప్రాధాన్యం లేకపోవడంతో నష్టం జరిగిందని వివరించారు. వ్యూహాత్మకంగా కొందరు వైకాపాకు పని చేశారని తెలిపారు. ఓటమి భయంతో వైకాపా భారీగా నిధులు వెచ్చించిందని తెలిపారు. పరిస్థితి తనకేమాత్రం సంతృప్తికరంగా లేదని చంద్రబాబు అన్నారని సమాచారం. రెండు రోజుల ముందు తంబళ్లపల్లె తెదేపా అభ్యర్థి జయచంద్రారెడ్డి సైతం చంద్రబాబును కలిశారు. ఈ సమయంలోనూ చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. గెలిచే స్థానాన్ని పోగొట్టారంటూ మండిపడ్డారు.

నియోజకవర్గంలో పార్టీకి చెందిన కొందరు వ్యక్తులు పని చేయకపోవచ్చని ముందే చెప్పానని... దాన్ని పరిగణలోకి తీసుకుని ముందడుగు వేయాల్సిందని సూచించినట్లు సమాచారం. నియోజకవర్గంలో తనను ఓడిస్తే... పార్టీ ఇన్‌ఛార్జి బాధ్యతలు తమకు వస్తాయనే ప్రయత్నాల్లో భాగంగా తన గెలుపు అవకాశాలను కొందరు గండికొట్టారని జయచంద్రారెడ్డి వివరించే ప్రయత్నం చేయగా... ఆ విషయం తనకు తెలుసని.. ఇకపై పార్టీ బలోపేతానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. ముందుగా నియోజకవర్గంలో చేపట్టాల్సిన చర్యలను చంద్రబాబు.. జయచంద్రారెడ్డికి వివరించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని