logo

Kadapa: వైకాపా నాయకుల కుమ్మక్కు.. భారీ నిర్మాణంలో జిమ్మిక్కు!

కడప కోఆపరేటివ్‌ కాలనీ - ఎస్పీ బంగళా మధ్య పోలీస్‌ పెట్రోల్‌బంకు పక్కన నిర్మించిన భారీ భవన దుకాణ సముదాయాన్ని ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మించారు.

Updated : 10 Jun 2024 07:21 IST

కళ్లు మూసుకున్న నగరపాలిక అధికారులు
లీజు నిబంధనలకు విరుద్ధంగా కట్టడం
న్యూస్‌టుడే, కడప నగరపాలక సంస్థ, నేరవార్తలు

పోలీస్‌ పెట్రోల్‌ బంకు పక్కన నిర్మించిన షాపింగ్‌ కాంప్లెక్స్‌

డప కోఆపరేటివ్‌ కాలనీ - ఎస్పీ బంగళా మధ్య పోలీస్‌ పెట్రోల్‌బంకు పక్కన నిర్మించిన భారీ భవన దుకాణ సముదాయాన్ని ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మించారు. ఇప్పటి వరకు సచివాలయ ప్రణాళిక సిబ్బంది, నగరపాలక అధికారులు అటు వైపు చూడలేదు. ఈ షాపింగ్‌ కాంప్లెక్స్‌ నిర్మిస్తున్న స్థలం పోలీస్‌ సంక్షేమ సంఘానికి చెందింది. దీనిని అమృత్‌ ఫుడ్‌ కోర్టు - ఫంక్షన్‌ హాల్‌ కట్టడానికి కేటాయిస్తే, లీజు నిబంధనలను పాటించకుండా, ప్రణాళిక అనుమతి లేకుండా భారీ నిర్మాణాలు సాగిస్తున్నా ఇప్పటి వరకు ఎవరూ అటువైపు కన్నెత్తి చూడకపోవడం గమనార్హం. మారిన రాజకీయ పరిస్థితుల్లో ఈ అంశంపై వివిధ రాజకీయ వర్గాలు అధికార యంత్రాంగాన్ని నిలదీశాయి. ఈ నేపథ్యంలో అధికారులు నోటీసులు జారీ చేశారు. అక్రమ నిర్మాణంపై ఒక వైపు తీవ్ర విమర్శలు వస్తుంటే... దీనిని ఏ మాత్రం ఖాతరు చేయకుండా ప్రముఖ ఆహారపదార్థాల విక్రయ సంస్థ సోమవారం ఇక్కడ తన వ్యాపార కార్యకలాపాలు ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తోంది.

పోలీస్‌ పెట్రోలు బంకు పక్కన పోలీస్‌ శాఖకు సంబంధించిన 14,850 చ.అ.స్థలాన్ని లీజుకివ్వడానికి 2023 మార్చిలో ఒక పత్రికలో ప్రకటన జారీ చేశారు. అదే నెల 29వ తేదీన వేలం నిర్వహించి లీజును ఖరారు చేశారు. అధికారికంగా ఒక వ్యక్తి పేరిట తీసుకున్నా.. దీని వెనుక కడప నియోజకవర్గంలోని వైకాపా ముఖ్య నాయకుడి సోదరుడు, నగరపాలక సంస్థ పాలకవర్గంలోని కీలక ప్రజాప్రతినిధి, హబీబుల్లా వీధికి చెందిన ఓ నాయకుడు ఉన్నారనేది బహిరంగ రహస్యం. నిబంధనల ప్రకారం ఈ స్థలంలో అమృత్‌ ఫుడ్‌ కోర్టు, ఫంక్షన్‌ హాల్‌ నిర్మించాలి. దీనికి ఏపీహెచ్‌బీ ఏఈ రూపొందించిన అంచనాల ప్రకారం రూ.60 లక్షలు డిపాజిట్‌ చేయాలి. ఈ మొత్తాన్ని మూడు  సంవత్సరాల పాటు చెల్లించాల్సిన అద్దెలో సర్దుబాటు చేస్తారు. నాలుగో సంవత్సరం నుంచి ప్రతి నెలా రూ.1,92,000 అద్దె చెల్లించాలి.

భవన ప్రణాళిక ఏదీ? : నిబంధనలను విరుద్ధంగా లీజుదారులు తమకు ఇష్టం వచ్చిన రీతిలో షాపింగ్‌ కాంప్లెక్స్‌ నిర్మించారు. నగరంలోని అత్యంత రద్దీ ప్రదేశంలో కడుతున్నా... ఇప్పటి వరకు ప్లాన్‌ అప్రూవల్‌కు దరఖాస్తు చేయలేదు. పోలీసు సంక్షేమశాఖ వారే నిర్మాణం చేపడుతున్నారని నగరపాలక అధికారులు ఉపేక్షించినట్టు సమాచారం. కానీ ఈ నిర్మాణాన్ని ప్రైవేటు వ్యక్తులు చేపట్టారనేది అందరికీ తెలుసు. సాధారణ ప్రజలు సెంటు రెండు సెంట్లలో ఇల్లు కట్టుకుంటే వారిని తీవ్ర వేధింపులకు గురిచేసిన అధికారులు దీనిపై ఎందుకు ఉదాసీనంగా వ్యవహరించారని నగరవాసులు ప్రశ్నిస్తున్నారు.

నోటీసులు ఇచ్చాం : దీనిపై నగరపాలక సంస్థ ప్రణాళిక విభాగం ఏసీపీ నాగేంద్రను వివరణ కోరగా కాంప్లెక్స్‌ నిర్మాణం ప్రారంభ దశలో ఒకసారి నోటీసులు ఇచ్చామని చెప్పారు. తాజాగా ఆదివారం మరోసారి నోటీసులు సిద్ధం చేసి ఆ నిర్మాణాలకే అతికించామని చెప్పారు. నిబంధనల ప్రకారం ప్లాన్‌ అప్రూవల్‌ పొందకపోతే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని