logo

AP Election Results: ఉమ్మడి కడప జిల్లాలో గెలిచేదెవరు... ఓడేదెవరు..?

గతంలో ఎన్నడూ లేనంతగా ఈసారి.. సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఓట్ల లెక్కింపు ప్రక్రియకు సుమారు 22 రోజులుగా అభ్యర్థులు.. నాయకులు.. కార్యకర్తలు.. ప్రజలు వేయికళ్లతో ఎదురుచూడాల్సి వచ్చింది.

Updated : 04 Jun 2024 08:22 IST

గతంలో ఎన్నడూ లేనంతగా ఈసారి.. సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఓట్ల లెక్కింపు ప్రక్రియకు సుమారు 22 రోజులుగా అభ్యర్థులు.. నాయకులు.. కార్యకర్తలు.. ప్రజలు వేయికళ్లతో ఎదురుచూడాల్సి వచ్చింది. ఇన్ని రోజుల నిరీక్షణ నేటితో ముగిసింది. ఈ రోజే ఓట్ల లెక్కింపు క్రతువు మొదలు కానుంది. సార్వత్రిక సమరంలో ఉత్కంఠకు నేడు తెరపడనుంది. విజయలక్ష్మి ఎవరిని వరిస్తుందో మరికొన్ని గంటల్లో తేలనుంది. జిల్లాలోని 7 శాసనసభ, ఒక లోక్‌సభ నియోజకవర్గాలు ఉన్నాయి. మొత్తం 16,39,066 మందికి ఓటుహక్కు కల్పించారు. గత నెలలో జరిగిన ఎన్నికల వేళ 13,04,256 మంది ఓటేశారు. కోటి ఆశలతో బరిలోకి దిగిన అభ్యర్థుల్లో ఎవరు నెగ్గుతారు..? ఎవరు ఓడిపోతారు...? పాలన పగ్గాలు ఏ పార్టీ చేతిలోకి వెళ్తాయి...?రాష్ట్రాన్ని నడిపించే నాయకుడెవరు..? గెలుపు కిరీటం సొంతం చేసుకునేదెవరు.? శాసనసభ, లోక్‌సభలోకి ఎవరు అడుగుపెడతారు. ఎగ్జిట్‌ పోల్స్‌లో నిజమెంత...? అన్నది మరికొన్ని గంటల్లో తేటతెల్లం కానుంది.

 ఈనాడు, కడప

పోలీసు భద్రత మధ్య ఓట్ల లెక్కింపు కేంద్రం


4 దశాబ్దాల చరిత్రను తిరగరాసి...!

పులివెందుల ఎన్నికపై ఆసక్తి నెలకొంది. నాలుగు దశాబ్దాల చరిత్రలో తొలిసారిగా పారదర్శకంగా ఎన్నికలు జరిగాయనే అభిప్రాయం ఉంది. వైకాపా అరాచకాలు, అక్రమాలకు అడ్డుకట్టవేశామంటూ గెలుపుపై తెదేపా ధీమా ఉండగా.. మెజార్టీపై వైకాపాలో ఆందోళన నెలకొంది. ఈ స్థానం నుంచి 2019లో వైకాపా అధినేత జగన్‌ 90 వేల మెజార్టీతో విజయం సాధించగా... ఈసారి అంత రాకపోవచ్చనే విస్తృత చర్చ సాగుతోంది. తెదేపా అభ్యర్థి బీటెక్‌ రవి మాత్రం తాను గెలుస్తానంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు.


త్రిముఖ పోటీ... ఎవరో మేటి

  భూపేష్‌రెడ్డి          అవినాష్‌రెడ్డి            షర్మిల

కడప పార్లమెంట్‌కు ఈసారి ఆసక్తికర పోటీ నెలకొంది. తెదేపా నుంచి భూపేష్‌రెడ్డి పోటీపడుతుండగా, కాంగ్రెస్‌ పార్టీ నుంచి పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల, వైకాపా నుంచి వైఎస్‌ అవినాష్‌రెడ్డి తలపడుతున్నారు. మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య చుట్టూ తిరుగుతూ ఎన్నికల ప్రచారం సాగింది. కేసులో నిందితుడు అవినాష్‌రెడ్డిని ఓడించాలంటూ షర్మిలతో వివేకా తనయ సునీత ఓటర్లకు పిలుపునిస్తూ హోరెత్తించారు. చివరకు తన కుమారుడు జగన్‌ నిలబెట్టిన అవినాష్‌రెడ్డికి కాకుండా కుమార్తె షర్మిలకు ఓటేయాలని అమెరికాలో ఉన్న వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి సతీమణి విజయమ్మ వీడియో సందేశం ద్వారా ఓటర్లకు పిలుపునిచ్చారు.


సై అంటే సై

మాధవిరెడ్డి         అంజాద్‌బాషా

రెడ్డెప్పగారి మాధవి తెదేపా అభ్యర్థిగా ఇక్కడ విజయం సాధిస్తే... ఈ నియోజకవర్గం నుంచి తొలిసారి ఓ మహిళ శాసనసభకు వెళ్లి రికార్డుకెక్కనున్నారు. పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి సతీమణిగా గుర్తింపు, తెదేపా బలం పుంజుకోవడం ఆమె బలాలుగా భావిస్తున్నారు. వైకాపా బలంగా ఉన్నప్పటికీ అభ్యర్థి అంజాద్‌బాషా కుటుంబ సభ్యుల చెడ్డ పేరు గెలుపును దెబ్బతీస్తాయనే భయం వెంటాడుతోంది.


గురు శిష్యుల సవాల్‌

వరదరాజులురెడ్డి          రాచమల్లు

తెదేపా అభ్యర్థి వరదరాజులరెడ్డి పేరు ప్రతిష్టలు, పార్టీ బలంతో విజయావకాశాలు మెండుగా ఉన్నాయి. వైకాపా అభ్యర్థి, సిట్టింగ్‌ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డిపై అవినీతి మరకలు, చేసిన అరాచకాలు ఎన్నికల్లో వెంటాడాయి. పార్టీ ఎమ్మెల్సీ రమేష్‌యాదవ్‌ సహాయ నిరాకరణ నష్టాన్ని కలిగించింది. పార్టీ కీలక నేతలు, కౌన్సిలర్లు పార్టీ నుంచి జారిపోవడం తీవ్ర ప్రభావం చూపించనున్నాయి.


గెలుపు నీదా... నాదా...

సుధాకర్‌యాదవ్‌        రఘురామిరెడ్డి

మైదుకూరు నుంచి తెదేపా అభ్యర్థిగా పుట్టా సుధాకర్‌ యాదవ్‌ పోటీపడుతున్నారు. రెండుసార్లు వరుస ఓటమితో సానుభూతి, తెదేపా బలం, వైకాపా అభ్యర్థి అక్రమాలు  తనకు కలిసొచ్చాయనే ధీమాతో పుట్టా ఉండగా.. వైకాపా అభ్యర్థి రఘురామిరెడ్డి సంక్షేమ పథకాలు తనకు విజయాన్ని చేకూర్చుతాయనే ఆశాభావంతో ఉన్నారు.


గట్టెక్కేదెవరో?

రోశన్న             సుధ

వైకాపా నుంచి సిట్టింగ్‌ ఎమ్మెల్యే సుధ పోటీ పడుతుండగా.. కూటమి నుంచి భాజపా అభ్యర్థి రోశన్న తలపడ్డారు. భాజపాకు పార్టీ పరంగా బలం లేనందున 30 వేల మెజార్టీతో గెలుస్తామన్న వైకాపా నేతలు.. ఇప్పుడు 5 వేలతోనే బయటపడతామనడం.. కూటమి అభ్యర్థి బలపడ్డారనడానికి నిదర్శనం. ఇక్కడ పోటాపోటీగా పరిస్థితి ఉంది.


నువ్వా... నేనా

కృష్ణ చైతన్యరెడ్డి          రవీంద్రనాథ్‌రెడ్డి

తెదేపా అభ్యర్థి పుత్తా కృష్ణ చైతన్యరెడ్డి గెలుపు ధీమాతో ఉన్నారు. యువకుడు కావడం, తెదేపా బలం పుంజుకోవడం, తండ్రి పుత్తా నరసింహారెడ్డి అదనపు బలం, వైకాపా అభ్యర్థిపై పార్టీలో వ్యతిరేకత కలిసొచ్చాయనే ఆశతో ఉన్నారు. సీఎం జగన్‌ మేనమామ రవీంద్రనాథ్‌రెడ్డి మాత్రం పార్టీ బలాన్నే నమ్ముకుని ఎన్నికల్లో తలపడ్డారు. తెదేపా మాత్రం గెలుపు ధీమాతో ఉంది.


హోరాహోరీ 

ఆదినారాయణరెడ్డి           సుధీర్‌రెడ్డి

వైకాపా నుంచి సిట్టింగ్‌ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డిపై కూటమి నుంచి భాజపా అభ్యర్థి ఆదినారాయణరెడ్డి పోటీపడ్డారు. కూటమి అభ్యర్థికి కుటుంబ బలంతో పాటు తెదేపా శ్రేణులు గట్టిగా పని చేయడం కలిసొచ్చాయి. సుధీర్‌రెడ్డిపై ఆరోపణలు, పార్టీలో వ్యతిరేకత ఇబ్బందులు కలిగించినా పార్టీ బలంపై ఆశలుపెట్టుకున్నారు. 


లెక్కింపు కేంద్రానికి చేరుకున్న పోస్టల్‌ బ్యాలట్‌ వాహనం

  స్టవ్‌లు తీసుకెళ్తున్న సిబ్బంది


కాయ్‌ రాజా కాయ్‌

తేలనున్న అభ్యర్థుల భవితవ్యం
ఓటర్లు ఎవరి వైపు మొగ్గు చూపారో?

 ఏర్పాట్లను పరిశీలిస్తున్న కలెక్టర్‌ అభిషిక్త్‌ కిశోర్‌ 

రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం ఎన్నికల ఫలితాలు వెలువడనుండడంతో అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. కొన్ని ప్రాంతాల్లో తమ పార్టీ గెలుస్తుందని తెదేపా, కాదు తమ పార్టీనే గెలుస్తుందని వైకాపా వర్గాలు భారీగా పందేలు కాస్తున్నారు. మదనపల్లె పట్టణంలో వైకాపా, తెదేపా అభ్యర్థులిద్దరూ మైనార్టీలు కావడంతో గెలుపెవరిదో అని పెద్ద ఎత్తున పందేలు జరిగాయి. ఎంపీ అభ్యర్థులపై, సీఎం ఎవరనేదో కూడా పందేలు వేశారు. నీరుగట్టువారిపల్లెలో కొందరు చంద్రబాబు గెలుస్తారని రూ.లక్ష బెట్టింగ్‌ వేస్తే జగన్‌ మోహన్‌రెడ్డి గెలుస్తారని రూ.1.10 లక్షలు బెట్టింగ్‌ వేశారు. ఈ డబ్బు మొత్తం ఓ మధ్యవర్తి వద్ద ఉంచి గెలిచిన పార్టీకి చెందిన వ్యక్తి నుంచి 10 శాతం డబ్బులు తీసుకుని మిగిలినవి ఇచ్చేవిధంగా ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం. పెద్దతిప్పసముద్రం మండలంలో పోలింగ్‌ కేంద్రాల మధ్య బెట్టింగ్‌ ఎక్కువగా జరుగుతోంది. మండలంలోని కాట్నగల్లు 112, 113 పోలింగ్‌ కేంద్రాల్లో వైకాపాకు ఒక్క ఓటైనా మెజార్టీ వస్తుందని వైకాపా వర్గీయులు రూ.3 లక్షలు కట్టగా తెదేపా వర్గీయులు రూ.2 లక్షలు పందేం కాశారు. పీలేరులో తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థిపై రూ.లక్ష, వైకాపాపై రూ.70 వేలు కట్టారు. ములకలచెరువు మండలంలో తెదేపా గెలుస్తుందని రూ.లక్ష, వైకాపా గెలుస్తుందని రూ.60 వేలు కట్టారు. ములకలచెరువుకు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న సత్యసాయి జిల్లా వాసులు కూడా తంబళ్లపల్లె నియోజకవర్గంలోకి వచ్చి బెట్టింగులకు పాల్పడుతుండటం గమనార్హం. రాజంపేట నియోజకవర్గంలో ఒక్క రోజులోనే కోట్ల రూపాయిలు పందేలు పెట్టారు. మండలాలు, వార్డులు, పోలింగ్‌ కేంద్రాలు వారీగా వీటిని పెడుతున్నారు. ఎక్కవ మంది తెదేపా గెలుస్తుందని భారీ ఎత్తున పందేం కాశారు. ఎన్నికల్లో నగదు, భూములు, ఇళ్లు వంటి కూడా లెక్క చేయకుండా పందెం పెట్టారని చర్చించుకుంటున్నారు. రైల్వే కోడూరు మండలం ఓబులవారిపల్లె, మంగంపేట, పుల్లంపేట మండలాల్లో ఇప్పటికే కొందరు రూ.కోట్లలో పందేలు కాస్తున్నారు. ఎక్కువ మంది కోడూరులో జనసేన గెలుస్తుందని, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వస్తుందని పందేలు కాస్తున్నారు.


పోటాపోటీ

నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి, భాజపా    పెద్దిరెడ్డి వెంకటమిథున్‌రెడ్డి, వైకాపా

రాజంపేట ఎంపీ స్థానానికి కూటమి నుంచి భాజపా అభ్యర్థిగా నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి రంగంలోకి దిగారు. వైకాపా నుంచి మూడోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి తలపడ్డారు. మాజీ సీఎంగా నల్లారి ప్రజలకు సుపరిచితులు కాగా, మిథున్‌రెడ్డి అంగబలం, ధనబలంతో పోటీ పడ్డారు. దీంతో ఇక్కడ అభ్యర్థుల మధ్య పోరు పోటాపోటీగా ఉంది.దీనిపై ప్రజల్లో సర్వత్రా ఆసక్తి నెలకొంది.

 హోరాహోరీ 

మదనపల్లె నియోజకవర్గంలో కూటమి నుంచి తెదేపా అభ్యర్థిగా హాజహాన్‌ బాషా, వైకాపా నుంచి నిస్సార్‌ అహ్మద్‌ తలపడ్డారు. ఇద్దరూ పార్టీల బలాలపైనే పోరాడారు. సంక్షేమ పథకాలపై వైకాపా, ప్రజా వ్యతిరేకత, ఉద్యోగుల సానుకూలత, పార్టీ బలంపై తెదేపా ఆధారపడింది. తెదేపా, వైకాపా అభ్యర్థుల మధ్య హోరాహోరీగా పోటీ నెలకొంది.

నువ్వా... నేనా

తంబళ్లపల్లె నియోజకవర్గంలో కూటమి నుంచి తెదేపా అభ్యర్థి జయచంద్రారెడ్డి రాజకీయాల్లోకి కొత్తగా ప్రవేశించడం, అనతి కాలంలోనే ఎన్నికల్లో తలపడాల్సిన పరిస్థితిని ఎదుర్కొన్నారు. వైకాపా అభ్యర్థి పెద్దిరెడ్డి ద్వారకనాథ్‌రెడ్డి అంగ, ధనబలంతో పోటీపడ్డారు. ఇద్దరి అభ్యర్థుల మధ్య పోటీ తీవ్రంగా ఉంది.

గెలుపు నీదా... నాదా...

పీలేరు నియోజకవర్గంలో  తెదేపా అభ్యర్థిగా బరిలో నిలిచిన నల్లారి కిషోర్‌కుమార్‌రెడ్డికి పార్టీ బలం. వైకాపా అభ్యర్థి చింతల రామచంద్రారెడ్డి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కనుసన్నల్లో పనిచేయడం మచ్చగా నిలిచింది.

విజయం  వరించేదెవరికి...

రాయచోటి నియోజకవర్గంలో వైకాపా అభ్యర్థి శ్రీకాంత్‌రెడ్డిపై వ్యతిరేకత తీవ్ర నష్టాన్ని కలిగించింది. తెదేపా అభ్యర్థి మండపల్లి రాంప్రసాద్‌రెడ్డి పోలింగ్‌ సమయానికి పుంజుకున్నారు. దీంతో ఇద్దరి మధ్య పోటీ తీవ్రంగా నెలకొంది.

గట్టెక్కేదెవరో?

రాజంపేట నియోజకవర్గంలో వైకాపా అభ్యర్థిగా ఆకేపాటి అమరనాథ్‌రెడ్డి, కూటమి నుంచి తెదేపా అభ్యర్థి సుగవాసి బాలసుబ్రహ్మణ్యం పోటీపడ్డారు.  తెదేపాకు సంప్రదాయ ఓట్లు, రెండు ప్రధాన సామాజిక వర్గాల ఓటర్ల మద్దతు సుగవాసికి అదనపు బలాలు.

గట్టిపోటీనిచ్చారు...

రైల్వేకోడూరు నియోజకవర్గంలో కూటమి నుంచి జనసేన పార్టీ అభ్యర్థిగా అరవ శ్రీధర్‌ రంగంలోకి దిగగా, వైకాపా అభ్యర్థిగా కొరముట్ల శ్రీనివాసులు బరిలో నిలిచారు. వీరి మధ్య గట్టి పోటీ నెలకొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని