logo

YS Sharmila: నువ్వూ, నీ కొడుకే పెయిడ్‌ ఆర్టిస్టులు!: సజ్జలపై షర్మిల తీవ్రస్థాయిలో ఆగ్రహం

రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ‘నన్ను పెయిడ్‌ ఆర్టిస్ట్‌ అంటావా?. నేనెవరిని అనుకుంటున్నావు?.

Updated : 08 Apr 2024 07:51 IST

కమలాపురంలో వైఎస్‌ షర్మిలను కలవడానికి పోటీపడుతున్న జనం

ఈనాడు, కడప, న్యూస్‌టుడే, పెండ్లిమర్రి, కమలాపురం, చెన్నూరు: రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ‘నన్ను పెయిడ్‌ ఆర్టిస్ట్‌ అంటావా?. నేనెవరిని అనుకుంటున్నావు?. రాజన్న బిడ్డని గుర్తుపెట్టుకో!. అధికార మదం తలకు ఎక్కిందా?. మతి ఉండే మాట్లాడుతున్నావా?. నువ్వూ.. నీ కొడుకు పేమెంట్‌ తీసుకుని నన్ను.. సునీతను పలు విధాలుగా హింసించారు. సామాజిక మాధ్యమాల్లో హేలన చేశారు. నోరు ఉందని ఏది పడితే అది మాట్లాడితే  ఊరుకునేది లేదు. మీ ఇంట్లో ఆడవాళ్లు లేరా?. మీ ఇంట్లో ఆడవాళ్లు కూడా పెయిడ్‌ ఆర్టిస్ట్‌లేనా?.అంత పెద్ద మాటలు అనడానికి మాకు సంస్కారం’ ఉందంటూ షర్మిల తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి సజ్జలకి సలహాదారుగా నియమించడం జగన్‌ చేసుకున్న ఖర్మంటూ షర్మిల వ్యాఖ్యానించారు. చెన్నూరులో ఆదివారం రాత్రి జరిగిన సభలో షర్మిల మాట్లాడుతూ నేను రాజశేఖర్‌రెడ్డికి పుట్టలేదంటూ నా తల్లిని సైతం అవమానించిన వ్యక్తి సజ్జల రామకృష్ణారెడ్డి అంటూ మండిపడ్డారు.

సజ్జల, ఆయన కొడుకు కలిసి సామాజిక మాధ్యమాల్లో మమ్మల్ని ఎంతో అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు గమనిస్తున్నారు.. జాగ్రత్తగా ఉండండని హెచ్చరించారు. ‘జైజగన్‌ అనే వారికి కఠినంగా హెచ్చరిక కూడా చేస్తున్నా. నేనూ కూడా జైజగన్‌ అనుకుంటూ తిరిగానని గుర్తు చేస్తున్నా. జగన్‌ జైల్లో ఉంటే ప్రజల కోసం రోడ్లపై తిరిగిన దాన్ని. జగన్‌ పెట్టిన మ్యానిఫెస్టోపై ఊరూరా తిరిగి ప్రచారం చేశా. జగన్‌ అధికారంలోకి వస్తే అమ్మఒడి ఇద్దరు పిల్లలకు ఇస్తామని చెప్పా. ఇప్పుడు ఇద్దరు పిల్లలకు వస్తోందా?. రైతులు రాజులవుతారని నేనే ప్రచారం చేశా.. వారికి వచ్చాయా లాభాలు.. ధరల స్థిరీకరణ నిధి ఇచ్చాడా?. సంపూర్ణ మద్యపాన నిషేధమని చెప్పా.. అయిందా మద్యపాన నిషేధం?. మీలాగే నేను నమ్మి మోసపోయా. మీరూ మోసపోవద్దు’ అని హెచ్చరిస్తున్నానన్నారు. ‘వివేకా లాంటి మంచి మనిషి ఇవాళ భూతద్దం పెట్టి వెతికినా దొరకరు. అలాంటి మంచి మనిషిని నరికి చంపేశారు. చంపినవాళ్లకు.. చంపించిన వాళ్లకు మధ్య ఎన్నో లావాదేవీలున్నాయి. సీబీఐ దగ్గర ఆధారాలున్నాయి. అవినాష్‌రెడ్డి నిందితుడని చెప్పింది. నిందితుడుని జగన్‌ కాపాడుతున్నారు. న్యాయం చేయకపోగా మళ్లీ అదే మనిషికి టిక్కెట్‌ ఇచ్చారు. ఇది అహంకారం కాకపోతే మరేంటని?’..అని నిలదీశారు. ఈ అన్యాయం అడ్డుకోవడానికి మాత్రమే నేను ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని షర్మిల పునరుద్ఘాటించారు. పొత్తులో భాగంగా కమలాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా సీపీఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్రను పోటీకి పెడుతున్నట్లు ఆమె ప్రకటించారు. కార్యక్రమంలో వివేకా కుమార్తె సునీత, రాజ్యసభ మాజీ సభ్యుడు తులసిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

కమలాపురం సభలో మాట్లాడుతున్న షర్మిల, పక్కన వైఎస్‌ సునీత, నాయకులు తులసిరెడ్డి, గాలి చంద్ర

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు