logo

నీట్‌లో అవకతవకలపై న్యాయ విచారణకు డిమాండు

నీట్‌ ఫలితాల్లో జరిగిన అక్రమాలపై న్యాయ విచారణ చేపట్టాలని డిమాండ్‌ చేస్తూ పలు విద్యార్థి, యువజన సంఘాల నాయకులు కడపలోని అంబేడ్కర్‌ విగ్రహం ఎదుట ప్లకార్డులతో బుధవారం నిరసన వ్యక్తం చేశారు.

Published : 13 Jun 2024 02:35 IST

అంబేడ్కర్‌ విగ్రహం ఎదుట ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థి, యువజన సంఘాల నేతలు

అరవిందనగర్‌ (కడప), న్యూస్‌టుడే: నీట్‌ ఫలితాల్లో జరిగిన అక్రమాలపై న్యాయ విచారణ చేపట్టాలని డిమాండ్‌ చేస్తూ పలు విద్యార్థి, యువజన సంఘాల నాయకులు కడపలోని అంబేడ్కర్‌ విగ్రహం ఎదుట ప్లకార్డులతో బుధవారం నిరసన వ్యక్తం చేశారు. గ్రేటర్‌ రాయలసీమ విద్యార్థి యువజన సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఓబులేసు మాట్లాడుతూ అవకతవకల వెనుక భాజపా నేతల హస్తం ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయన్నారు. తక్షణమే  కేంద్ర ప్రభుత్వం స్పందించి, చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఎన్‌ఎస్‌యూఐ జిల్లా అధ్యక్షుడు మామిళ్ల బాబు, పాలెం హరిప్రసాద్, జీఆర్‌ఎస్‌వై జిల్లా అధ్యక్షుడు రెడ్డిసాయి, నవీన్, వెంకటసుబ్బయ్య, తదితరులు పాల్గొన్నారు.

కడప ఏడురోడ్లు: నీట్‌లో చోటుచేసుకున్న అవకతవకలపై సమగ్ర విచారణ చేయించి, అందుకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆర్‌ఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు ప్రశాంత్‌ డిమాండ్‌ చేశారు. స్థానిక అప్సర సర్కిల్‌ సమీపంలో ఆర్‌ఎస్‌యూ నాయకులు నిరసన తెలిపారు. ప్రశాంత్‌ మాట్లాడుతూ 67 మంది విద్యార్థులకు 720కి 720 మార్కులతో జాతీయస్థాయిలో మొదటి ర్యాంకు రావడం, ఇందులో ఏడుగురు ఒకే సెంటర్‌లో పరీక్ష రాయడం  అనేక అనుమానాలకు తావిస్తోందన్నారు. జూన్‌ 14న ఫలితాలను విడుదల చేస్తామని ప్రకటించి, దేశవ్యాప్తంగా ఎన్నికల కౌంటింగ్‌ జరుగుతున్న జూన్‌ 4నే వెల్లడించడంలో మతలబు ఏంటని ప్రశ్నించారు. దీనిపై సమగ్ర విచారణ చేపట్టాలని, 24 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలన్నారు. ఆర్‌ఎస్‌యూ జిల్లా ఉపాధ్యక్షుడు చెన్నకేశవరెడ్డి, నగర అధ్యక్షుడు హరిబాబు, ఆర్‌ఎస్‌యూ నాయకులు కుమార్, సందీప్, శ్యాంసుందర్, సంతోష్‌ తదితరులు పాల్గొన్నారు.

మారుతీనగర్‌: నీట్‌ పరీక్ష ఫలితాలపై సిట్టింగ్‌ జడ్జితో సమగ్ర విచారణ జరపాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు రాహుల్‌ డిమాండు చేశారు. స్థానిక జిల్లా కార్యాలయంలో బుధవారం విలేకర్లతో మాట్లాడారు.  జిల్లా ఉపాధ్యక్షుడు రవి, దుగ్గిరెడ్డి, రాజశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని