logo

ఇసుక డిపోల మూసివేత!

వైకాపా ప్రభుత్వంలో పెద్దఎత్తున అక్రమాలకు వేదికగా నిలిచిన ఇసుక వ్యవహారంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన నేపథ్యంలో సమూల మార్పులు చోటుచేసుకున్నాయి.

Published : 13 Jun 2024 03:00 IST

రేవుల్లో తవ్వకాల నిలుపుదల
త్వరలో కొత్త విధానం అమలు
వివరాల సేకరణలో గనులశాఖ

సిద్దవటం వద్ద డిపోలో ఇసుక నిల్వ

ఈనాడు, కడప: వైకాపా ప్రభుత్వంలో పెద్దఎత్తున అక్రమాలకు వేదికగా నిలిచిన ఇసుక వ్యవహారంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన నేపథ్యంలో సమూల మార్పులు చోటుచేసుకున్నాయి. ఉమ్మడి కడప జిల్లాలోని నదీతీరాల్లోని ఇసుక రేవుల్లో తవ్వకాలు నిలిచిపోగా,  డిపోలు సైతం లావాదేవీలు నిలిపేస్తూ మూతపడ్డాయి. ఇసుకపై ఎన్డీఏ ప్రభుత్వం త్వరలో కొత్త విధానం తీసుకురానుంది. ఈ తరుణంలో కొన్నాళ్ల పాటు తవ్వకాలు, రవాణా, అమ్మకాలు నిలిచిపోనున్నాయి.  కొత్త విధానానికి అనుగుణంగా గనులశాఖ సమాచార సేకరణలో నిమగ్నమైంది. 

  • గత తెదేపా ప్రభుత్వం పేదలకు ఉచితంగా ఇసుకను అందించింది. అనంతరం వైకాపా ప్రభుత్వం అధికారంలోకి రాగానే అక్రమాలకు తెరతీసింది. కొందరి నేతల గుప్పిట్లోకి నదులతోపాటు వాటిల్లోని రేవులు వెళ్లిపోయాయి. వీరి ద్వారా తవ్వకాలు, రవాణా, అమ్మకాలు చేపట్టి ఇసుక బంగారాన్ని తలపించేవిధంగా అక్రమ వ్యవహారం నడిపింది. వైకాపా నేతలకు గత ఐదేళ్లుగా రూ.వేల కోట్లు ఇసుక ద్వారా దోచి పెట్టింది. పేదలు ఉచితంగా ఇసుక పొందే పరిస్థితి లేకుండా పోయింది. ఐదేళ్లపాటు ఇసుక దందా పెను తుపానుగా మారింది. ఇసుక తవ్వకాలు, ప్రత్యేకంగా డిపోలు ఏర్పాటు చేసి నిల్వ చేయడం, ఇక్కడ నుంచి అమ్మకాలు, ఇతర రాష్ట్రాలకు అక్రమంగా లారీలు, టిప్పర్లతో అక్రమ రవాణా సాగింది. పేరుకు జేపీ వెంచర్స్‌ ముసుగులో భారీఎత్తున దందా సాగించారు. 
  • తెదేపా ప్రభుత్వ హయాంలో ట్రాక్టరు ఇసుక రూ.2 వేలు, టిప్పరు రూ.10 వేలు నుంచి రూ.12 వేలు లోపు లభించించేది. వైకాపా అధికారంలోకి రాగానే పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ట్రాక్టరు ఇసుక రూ.10 వేలు, టిప్పరు రూ.40 వేలుకుపైగా  వెచ్చించి కొనుగోలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. 
  • నదుల్లో అనుమతులు ఉన్నా.. లేకున్నా తవ్వకాలు ఇష్టారాజ్యంగా జరిపారు. నిబంధనలు అతిక్రమించి 20 అడుగుల లోతు మేర భారీ యంత్రాల ద్వారా తవ్వకాలు చేపట్టి నదీ గర్భాన్ని చిదిమేసి పర్యావరణాన్ని దెబ్బతీశారు. హైకోర్టు, ఎన్జీటీ పలుమార్లు అక్షింతలు వేసినా తప్పుడు నివేదికలతో కప్పిపుచ్చే చర్యలు తీసుకున్నారు. తవ్వకాలతో నదుల స్వరూపాన్నే మార్చేశారు. ఎన్నికలు జరిగిన తరుణంలో మరోమారు హైకోర్టు, ఎన్జీటీ గట్టి హెచ్చరికలతో అన్ని ఇసుక రేవుల్లో తవ్వకాలు నిలిపేశారు. డిపోల్లోని ఇసుకను హడావుడిగా అమ్మేసుకున్నారు. పర్యవేక్షించాల్సిన గనులశాఖ మామూళ్ల మత్తులో ప్రేక్షకపాత్ర వహించింది. కళ్ల ముందే ఇసుక దందా అక్రమంగా సాగుతున్నా జిల్లా ఉన్నతాధికారులు సైతం పట్టించుకోలేదు. ఈ మేరకు ప్రభుత్వ స్థాయిలో వచ్చిన అనధికార సూచనలతో ప్రేక్షకపాత్ర వహించారు. 
  • ప్రస్తుతం ఎన్డీయే ప్రభుత్వం ద్వారా నూతన విధానం త్వరలో అమల్లోకి రానుంది. ప్రజలకు అందుబాటులో ఉండే విధానాన్ని తీసుకొచ్చి అక్రమాలకు ఆస్కారం లేకుండా చర్యలు చేపట్టనున్నారు. అంతవరకు ఇసుక తవ్వకాల నిలిపివేత, డిపోల మూసివేత కొనసాగనుంది. ముందు జాగ్రత్తగా రేవుల గుర్తింపు, ఎన్డీఏ ప్రభుత్వం ఆలోచనల మేరకు అవసరమైన సమాచారాన్ని క్షేత్ర స్థాయిలో గనులశాఖ చేపట్టింది. వైఎస్‌ఆర్‌ జిల్లా గనులశాఖ డీడీ వెంకటేశ్వరరెడ్డి ఉద్యోగ విరమణతో ఈయన స్థానంలో అన్నమయ్య జిల్లా ఏడీ రవిప్రసాద్‌ను ఇన్‌ఛార్జిగా నియమించారు.  

ఇసుక డిపోలు

రైల్వేకోడూరు,  నారాయణనెల్లూరు  (పెనగలూరు మండలం), రాయచోటి, కొత్తపల్లి మందరం (రాజంపేట మండలం), సిద్ధవటం, బద్వేలు 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని