logo

ఇంత బరితెగింపా!

గత ఐదేళ్లుగా ఆక్రమణల దందా సాగించిన వైకాపా నేతలు తెదేపా అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కొనసాగిస్తున్నారు. కడప నగర నడిబొడ్డున జిల్లా పరిషత్తుకు చెందిన స్థలాన్ని ఆక్రమించుకుని ఏకంగా హోటల్‌ నిర్మాణమే చేపట్టారు.

Updated : 13 Jun 2024 05:05 IST

కడప నడిబొడ్డున జడ్పీ స్థలం ఆక్రమణ
వైకాపా కార్పొరేటర్‌ భర్త హోటల్‌ నిర్మాణం
చోద్యం చూస్తున్న అధికార యంత్రాంగం

కడప నగరంలోని జడ్పీ స్థలంలో వెలిసిన హోటల్‌

ఈనాడు, కడప : గత ఐదేళ్లుగా ఆక్రమణల దందా సాగించిన వైకాపా నేతలు తెదేపా అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కొనసాగిస్తున్నారు. కడప నగర నడిబొడ్డున జిల్లా పరిషత్తుకు చెందిన స్థలాన్ని ఆక్రమించుకుని ఏకంగా హోటల్‌ నిర్మాణమే చేపట్టారు. జడ్పీ కార్యాలయానికి కంటిచూపు దూరంలో ఉన్న ఈ స్థలం ఆక్రమణకు గురవ్వడమే కాకుండా నిర్మాణపనులు శరవేగంగా జరిగినా జడ్పీ అధికారులు వైకాపా నేతలకు వత్తాసు పలుకుతూ కనీసం పట్టించుకోలేదు. సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ నాటికే రూ.కోట్ల విలువ చేసే స్థలం ఆక్రమణకు గురికాగా, అనంతరం క్రమంగా హోటల్‌ నిర్మాణపనులు చేపట్టారు. ఓట్ల లెక్కింపు నాటికి కొంతవరకు పనులు పూర్తి కాగా, ఆ తరువాత పనుల్లో వేగం పెంచారు. అటు ఎన్డీయే ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేస్తుండగా.. ఇటు హోటల్‌ను బుధవారం అట్ట హాసంగా ప్రారంభించడం నగరవాసులను విస్మయపరిచింది. నగరపాలక సంస్థ కార్పొరేటర్‌ భర్త సాగించిన అక్రమ దందాతో రూ.కోట్ల విలువైన స్థలం అన్యాక్రాంతమైనా జడ్పీ అధికారులు పట్టించుకోకపోవడం, ఎలాంటి అనుమతుల్లేకుండా నిర్మాణాలు సాగుతున్నా నగరపాలక సంస్థ సైతం మిన్నకుండిపోవడం గమనార్హం. గతంలో జడ్పీ కార్యాలయానికి ఆనుకుని ఉన్న ‘అన్న క్యాంటీన్‌’ను హోటల్‌గా మార్చుకునేందుకు అనుమతులిచ్చి అధికారులు విమర్శల పాలయ్యారు. దీనిపై జిల్లా ఉన్నతాధికారులు అక్షింతలు వేశాక ప్రైవేటు వారి నుంచి స్వాధీనం చేసుకున్నారు. జడ్పీ కార్యాలయ ఆవరణలో త్వరలో ఓ ప్రైవేటు కళాశాల  ప్రారంభానికి సన్నాహాలు జరుగుతున్నాయి. 

వెంటనే తొలగిస్తాం: జడ్పీ స్థలం ఆక్రమణ వ్యవహారం మా దృష్టికి వచ్చింది. హోటల్‌ నిర్మాణదారులకు నోటీసులిచ్చాం. వెంటనే తొలగించేందుకు చర్యలు తీసుకుంటాం. ఓ సంఘానికి కార్యాలయ అవసరాలకు స్థలం ఇవ్వగా హోటల్‌ నిర్మించారు. దీనిపై కఠిన చర్యలు తీసుకుంటాం.

సుధాకర్‌రెడ్డి, సీఈవో, జిల్లా పరిషత్తు  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని