logo

మోగనున్న బడి గంట!

వేసవి సెలవుల అనంతరం గురువారం పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. కొత్త విద్యాసంవత్సరంలో జిల్లావ్యాప్తంగా 1,642 ప్రాథమిక, 142 ప్రాథమికోన్నత, 310 ఉన్నత పాఠశాలలు తెరుచుకోనున్నాయి.

Published : 13 Jun 2024 03:03 IST

నేడు పాఠశాలల పునఃప్రారంభం
విద్యాలయాలకు పాఠ్య సామగ్రి

న్యూస్‌టుడే, కడప విద్య : వేసవి సెలవుల అనంతరం గురువారం పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. కొత్త విద్యాసంవత్సరంలో జిల్లావ్యాప్తంగా 1,642 ప్రాథమిక, 142 ప్రాథమికోన్నత, 310 ఉన్నత పాఠశాలలు తెరుచుకోనున్నాయి. గతేడాది సుమారు 1,60,000 మంది విద్యార్థులు ఉండగా, ఈ ఏడాది ప్రవేశాల తర్వాత సంఖ్యపై స్పష్టత రానుంది. ప్రస్తుతం అసంపూర్తిగా ఉన్న నాడు-నేడు రెండోవిడత పనులు, రెండేళ్లుగా విడుదల కాని పాఠశాలల నిర్వహణ నిధులు, ఏకోపాధ్యాయ సేవలు తదితర సమస్యలు విద్యార్థులకు స్వాగతం పలుకుతున్నాయి. విద్యార్థి కిట్‌ పేరుతో పాఠ్య, రాత పుస్తకాలు, ఏకరూప దుస్తులు వంటి వాటితో విద్యా సామగ్రిని పంపిణీ చేసేందుకు విద్యాశాఖ చర్యలు తీసుకుంటోంది. పదోతరగతి విద్యార్థులకు ఈ విద్యాసంవత్సరం నూతన సిలబస్‌ ప్రవేశపెట్టారు.

ఉపాధ్యాయులపై ఒత్తిడి

ఒకప్పుడు ఉపాధ్యాయ వృత్తి ఎంతో ఉల్లాసంగా నిర్వర్తించేవారు. గత ప్రభుత్వ హయాంలో వారి పరిస్థితి పూర్తి భిన్నంగా మారిపోయింది. ఉదయం పాఠశాలకు వచ్చిన దగ్గర నుంచి ప్రభుత్వం అడిగే ప్రతి సమాచారం యాప్‌ల్లో పంపడం, ఏకరూప దుస్తులు, మధ్యాహ్న భోజనం, గుడ్డు, చిక్కీ నాణ్యత పరిశీలించడం... ఇలా సగం మంది ఈ పనులే చేయాల్సి వచ్చేది. నాడు-నేడు రెండో విడత పనులకు ఇంతవరకు పలు పాఠశాలలకు నిధులు విడుదల కాలేదు.  2023-24 విద్యాసంవత్సరానికి సంబంధించి గత ప్రభుత్వం ఒక్క రూపాయి నిర్వహణ నిధులను విడుదల చేయలేదు.ఆయా పనుల్లో ఎక్కడైనా తేడా వస్తే సంజాయిషీ తాఖీదులతోపాటు  సస్పెన్షన్ల భయంతో ఉపాధ్యాయులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతూ విధులు నిర్వర్తించాల్సి వచ్చిందని గుర్తుచేసుకుంటున్నారు.  నూతన ప్రభుత్వం ఇలాంటి ధోరణులకు భిన్నంగా ఉపాధ్యాయులు, విద్యార్థులు  విద్య ప్రధాన అంశంగా  విద్యాలయాలను తీర్చిదిద్దాలని కోరుకుంటున్నారు. 

గతంలో ఉమ్మడి కడప జిల్లాలో 485 ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉండగా, గత ప్రభుత్వ హయాంలో నూతన విద్యావిధానం పేరుతో తీసుకున్న చర్యలు, పాఠశాలల విలీనం తదితరాలతో ఆ సంఖ్య 770కు చేరింది. ఈ పరిస్థితికి కారణమైన జీవో 117 ను రద్దుచేయాలని ఉపాధ్యాయ సంఘాలు కోరుతున్నాయి.

పాఠశాలలకు పంపించాలి 

తల్లిదండ్రులు తమ పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలలకు పంపించాలి. అర్హత, అనుభవం గల ఉపాధ్యాయులతో బోధన, అన్ని సౌకర్యాలతో పాఠశాలలు సిద్ధంగా ఉన్నాయి. ఆయాలను పిలిపించి పాఠశాలల ఆవరణను శుభ్రం చేయించాలని, చిన్న చిన్న మరమ్మతులు చేయించాలని ఇప్పటికే ప్రధానోపాధ్యాయులకు ఆదేశాలిచ్చాం. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం విద్యార్థులందరికీ కిట్లు పంపిణీ చేసేవిధంగా పూర్తిస్థాయిలో చర్యలు తీసుకుంటున్నాం.

అనురాధ, డీఈఓ 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని