logo

మొదటిసారి గెలిచి.. మంత్రిగా మెరిసి!

మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి... ఆయనకు ఆమాత్యపదవంటూ మంగళవారం అర్ధరాత్రి దాటాక అధికారిక ప్రకటన... చక్కర్లు కొడుతున్న వార్తతో అందరిలో అనుమానాలు... అవునా? అంటూ ఆరాలు... నిజమంటూ నిర్ధారించుకున్న తర్వాత సంబరాలు... అనూహ్యమైన పరిణామాలతో ఆమాత్య పదవి కైవసం చేసుకున్న మండిపల్లికి అదృష్టం తలుపు తట్టింది.

Updated : 13 Jun 2024 05:00 IST

రాయచోటి ఎమ్మెల్యే మండిపల్లిని వరించిన అమాత్య పదవి
విధేయత. నమ్మకం, దూసుకుపోయేతత్వమే ప్రామాణికాలు... 

మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి... ఆయనకు ఆమాత్యపదవంటూ మంగళవారం అర్ధరాత్రి దాటాక అధికారిక ప్రకటన... చక్కర్లు కొడుతున్న వార్తతో అందరిలో అనుమానాలు... అవునా? అంటూ ఆరాలు... నిజమంటూ నిర్ధారించుకున్న తర్వాత సంబరాలు... అనూహ్యమైన పరిణామాలతో ఆమాత్య పదవి కైవసం చేసుకున్న మండిపల్లికి అదృష్టం తలుపు తట్టింది. రాయచోటి నియోజకవర్గం నుంచి తెదేపా టిక్కెట్‌ దక్కడం....ఉత్కంఠభరితంగా సాగిన ఓట్ల లెక్కింపులో అనూహ్య విజయం సాధించడం...ఆపై మంత్రి పదవి దక్కించుకోవడం సర్వత్రా చర్చనీయాంశమైంది. 

 

మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న రాయచోటి ఎమ్మెల్యే మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి... అనంతరం సంతకం చేస్తూ...

ఈనాడు, కడప, న్యూస్‌టుడే, రాయచోటి: ఉమ్మడి కడప జిల్లా ప్రాతిపదికన మంత్రివర్గ నియామకం ప్రక్రియ జరిగినట్లు పరిణామాల బట్టి తెలుస్తోంది. కొత్త జిల్లాల ప్రాతిపదికన మంత్రి పదవి కోసం పలువురు ఎమ్మెల్యేలు పోటీపడ్డారు. కడప నుంచి మహిళా కోటాలో రెడ్డప్పగారి మాధవి, యువత నుంచి కమలాపురం ఎమ్మెల్యే పుత్తా చైతన్యరెడ్డి, సీనియర్లుగా ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, మైదుకూరు ఎమ్మెల్యేలు వరదరాజులరెడ్డి, ఆదినారాయణరెడ్డి, పుట్టా సుధాకర్‌యాదవ్‌ తమ వంతు ప్రయత్నాలు సాగించారు. వీరిలో ఎవరికీ అవకాశం దక్కలేదు. అన్నమయ్య జిల్లాలో ఎన్డీఏ నుంచి నలుగురు ఎన్నిక కాగా, సీనియారిటీతో పాటు కుటుంబ నేపథ్యంలో భాగంగా పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్‌కుమార్‌రెడ్డి ముందు వరుసలో ఉన్నట్లు ప్రచారం జరిగింది. వీటన్నింటికీ తెర దించుతూ రాయచోటి ఎమ్మెల్యే మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి పేరు అధికారికంగా మంగళవారం అర్ధరాత్రి దాటాక ప్రకటించారు. 

అట్లూరు : అబ్బిరెడ్డిమఠం వద్ద 100 కిలోల భారీ కేకును కోస్తున్న ఎంపీపీ రమాదేవి, తెదేపా నాయకులు

వైకాపాలో ఉన్న రాంప్రసాద్‌రెడ్డి అధికార పార్టీని వదులుకుని మూడేళ్ల కిందట తెదేపాలో చేరారు. పార్టీలో పని చేస్తూ అగ్రనేతల మన్ననలను పొందే ప్రయత్నం చేశారు. తెదేపా అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పుంగనూరు, అంగళ్లు పర్యటించిన సమయంలో తన అనుచరులతో పాల్గొని వైకాపా శ్రేణుల దాడులను ప్రతిఘటించారు. దీంతో కీలక నిందితుడిగా చేర్చుతూ పోలీసులు కేసులు పెట్టి ఇబ్బందులకు గురిచేశారు. వైకాపాపై ముక్కుసూటిగా పోరాడడంతోపాటు అగ్రనేతల మన్ననలతో టిక్కెట్‌ సైతం మొదటి జాబితాలోనే తెప్పించుకోగలిగారు. రాయచోటి నియోజకవర్గం కాలక్రమేణా మారిన పరిస్థితులకనుగుణంగా కాంగ్రెస్‌/ వైకాపాకు కంచుకోటగా మారింది. వరుసగా మూడు దఫాలుగా తెదేపా ఇక్కడ గెలవలేకపోయింది. తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లోనూ అనుమానమనేలా ప్రచారం జరిగింది. తెదేపాకు వీచిన అనుకూల గాలులతోపాటు మండిపల్లి ప్రజల్లోకి అనతికాలంలో చొచ్చుకెళ్లి పట్టు సాధించి ఆటుపోట్లు మధ్య విజయం సాధించారు. ఈ తరుణంలోనే అమాత్య పదవి సైతం వరించడంతో నియోజకవర్గంలో తెదేపా శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. ఉమ్మడి కడప జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తూ అన్నమయ్య జిల్లా పీలేరు, మదనపల్లె, తంబళ్లపల్లె నియోజకవర్గాల బాధ్యతలు మంత్రి హోదాలో చూడాల్సి ఉంటుంది. ఇన్‌ఛార్జి మంత్రులను కొత్త జిల్లాల ప్రాతిపదికన నియామకం జరగనుంది. పార్టీ పట్ల విధేయత, నమ్మకం, దూసుకుపోయేతత్వంతోనే అనతికాలంలోనే హేమాహేమీలను కాదని అమాత్య పదవిని చేజిక్కించుకున్నారు. 

 కడపలో భారీ తెరపై చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని తిలకిస్తున్న ప్రజలు  

ప్రత్యర్థికి వెరువకుండా...

తెదేపా టిక్కెట్‌ మండిపల్లికి దక్కడంతో నియోజకవర్గంలోని ఆ పార్టీ నేతలు కినుక వహించారు. అధిష్టానం ఇచ్చిన అవకాశాన్ని చేజార్చుకోకూడదన్న పట్టుదలతో నియోజకవర్గంలోని పార్టీ నేతల మద్దతు కోరారు. మాజీ ఎమ్మెల్యే ఆర్‌.రమేష్‌కుమార్‌రెడ్డి పార్టీని వీడి వైకాపాలో చేరగా, లక్కిరెడ్డిపల్లి, రామాపురం మండలాల్లో నాయకత్వం వహించే బలమైన నాయకులు లేకుండాపోయారు. ఎన్నికల ప్రచార సమయంలో మాజీ ఎమ్మెల్యే గడికోట ద్వారకనాధరెడ్డిని ఒప్పించగలిగినా రెండు మండలాల బాధ్యతను మండిపల్లే చూసుకోవాల్సి వచ్చింది. ఎక్కడా వెరవకుండా పోలింగ్‌ సమయానికి అన్ని మండలాల్లో అన్ని పోలింగ్‌ కేంద్రాలకు ఏజెంట్లను పెట్టుకుని వారికి భరోసా కల్పించారు. దీంతో ఎన్నికల సరళి సజావుగా సాగడంతో నిశబ్ధ ఓటింగ్‌ రాముడి విజయానికి తోడ్పడి ప్రత్యర్థిని మట్టికరిపించింది. 

రాజకీయ కుటుంబం నుంచి వచ్చి... 

చిన్నమండెం మండలం పడమటికోనకు చెందిన మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి రాయచోటి పట్టణంలో స్థిరపడ్డారు. తండ్రి మండిపల్లి నాగిరెడ్డి రాయచోటి నుంచి వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయన మరణానంతరం సోదరుడు జయరామిరెడ్డి కుమారుడు నారాయణరెడ్డి రెండుసార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. మండిపల్లి తల్లి సుశీలమ్మ చిన్నమండెం ఎంపీపీగా పనిచేశారు.

62 ఏళ్ల కల... సాకారమైన వేళ...

రాయచోటి నియోజకవర్గం నుంచి  ఇప్పటి వరకు ఏ ఒక్కరికి మంత్రి పదవి దక్కలేదు. రాజకీయ నేపధ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చిన మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అనూహ్య ఆధిక్యతతో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ ఆయనకు మంత్రి పదవిని కట్టబెట్టింది. మంత్రి పదవి వరించడంతో రాయచోటిలో భారీ ఎత్తున భాణసంచా కాల్చి, కేకులు కోసి సంబరాలు జరుపుకొన్నారు. 

మాస్‌ లీడర్‌గా ఎదిగి... 

రాంప్రసాద్‌రెడ్డిది రాజకీయ కుటుంబం. ఇంటికొచ్చినవారి  కష్టాలు తెలుసుకుని వారికి అన్నం పెట్టి పంపడం వారికి ఆనవాయితీ. తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లోనూ ఆయన అనేక సందర్భాల్లో వేలాది మందికి భోజనాలు ఏర్పాటు చేశారు. మాట తీరు, ఎదుటి వారికి నమ్మకం కలిగించి అండగా నిలవడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. తాజాగా జరిగిన ఎన్నికల ప్రచారంలోనూ అందరినీ ఆకట్టుకున్నారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని