logo

ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడి దారుణహత్య

అల్లారు ముద్దుగా పెంచుకున్న కన్నబిడ్డే తండ్రిని హతమార్చిన అమానవీయ ఘటన మదనపల్ల్లె పట్టణంలో గురువారం తెల్లవారుజాములన చోటుచేసుకుంది.

Published : 14 Jun 2024 04:21 IST

కుమార్తె నిందితురాలు 
మదనపల్లెలో దారుణ ఘటన

మదనపల్లె నేరవార్తలు, న్యూస్‌టుడే: అల్లారు ముద్దుగా పెంచుకున్న కన్నబిడ్డే తండ్రిని హతమార్చిన అమానవీయ ఘటన మదనపల్ల్లె పట్టణంలో గురువారం తెల్లవారుజాములన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చిత్తూరు జిల్లా సదుం మండలం చెరుకువారిపల్లెకు చెందిన దొరస్వామి (62) చాలా ఏళ్ల కిందట మదనపల్లె ఎగువకురవంక ప్రాంతంలో సొంత ఇంటిని నిర్మించుకుని జీవనం సాగిస్తున్నారు. ఈయన భార్య ఏడాదిన్నర కిందట అనారోగ్యంతో మృతిచెందారు. అప్పటి నుంచి కుమార్తె హరితతో కలిసి ఉంటున్నారు. ప్రస్తుతం దిగువ కురవంకలోని ప్రాథమికోన్నత పాఠశాలలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. ఈ నెల 30న ఆయన ఉద్యోగ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల కుమార్తెకు వివాహం చేసేందుకు సంబంధాలు చూడగా, ఇష్టం లేదని  కుమార్తె హరిత చెబుతూ వస్తోంది. ఈ విషయమై ఇరువురి మధ్య గొడవ జరుగుతోంది. ఈ క్రమంలో గురువారం తెల్లవారుజామున దొరస్వామి నిద్రిస్తుండగా, చపాతి కర్ర, ఇనుప అట్టతో తలపై కొట్టింది. ఇంట్లో నుంచి అరుపులు రావడంతో చుట్టుపక్కల వారు వచ్చి చూడగా రక్తపు మడుగులో పడిఉన్న దొరస్వామిని గుర్తించి 108కు సమాచారం ఇచ్చారు. అయితే అప్పటికే ఆయన మృతి చెంది ఉండటంతో పోలీసులకు సమాచారమిచ్చారు. మదనపల్లె డీఎస్పీ ప్రసాద్‌రెడ్డి, సీఐలు వల్లిబసు, యువరాజ్, శేఖర్, సద్గురుడుతో పాటు ఎస్‌.ఐ.లు సంఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. తన తండ్రి జారి కింద పడటంతో మృతిచెందారని నమ్మించేందుకు హరిత ప్రయత్నించింది. తర్వాత గాయాలు చూసి హత్య జరిగినట్లు గుర్తించి ఆమెను అదుపులోకి తీసుకున్నారు. హత్యకు వినియోగించిన చపాతి కర్ర, ఇనుప అట్టను స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. యువతిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి బావ డాక్టర్‌ నారాయణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని డీఎస్పీ తెలిపారు. 

ప్రేమ వ్యవహారమే కారణమా?

హత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని స్థానికులు చెబుతున్నారు. వారి వివరాల ప్రకారం.. హరిత ఓ యువకుడిని ప్రేమిస్తూ అతనికి పెద్ద మొత్తంలో డబ్బు ఇచ్చింది. దొరస్వామి తన రెండు అంతస్తుల భవనంలో కింద తాను ఉండగా పైభాగంలో కుమార్తె ఉంటోంది. ఇటీవల హరిత తన ప్రియుడితో కలిసి ఉండటాన్ని దొరస్వామి గుర్తించి అతన్ని ఒకటోపట్టణ పోలీసుస్టేషన్‌ల్లో అప్పగించగా మందలించి పంపేశారు. అప్పటి నుంచి తన కుమార్తెకు వివాహం చేయాలని నిర్ణయించి పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. పెళ్లి తనకు ఇష్టం లేదని కొంత కాలంగా తండ్రితో గొడవ పడుతోంది. ఈ నేపథ్యంలోనే ప్రియుడితో కలిసి చంపేసి ఉంటుందని స్థానికులు ఆరోపిస్తున్నారు. రెండు నెలల కిందట దొరస్వామి తన ఇంటిని కుమార్తె పేరుతో రాసినట్లు బంధువులు చెబుతున్నారు. ఈ విషయమై ఒకటో పట్టణ సీఐ వల్లిబసు మాట్లాడుతూ.. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. క్లూస్‌టీం, డాగ్‌ స్క్వాడ్‌తో పాటు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి విచారణ చేస్తున్నామన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని