logo

ప్రహరీని పడగొట్టారు... భూమిని కాపాడుకున్నారు

అధికారంలో ఉండగా వైకాపా నాయకులు, వారి బంధువులు, అనుచరులు సాగించిన అరాచకాలు భూకబ్జాలు అక్రమాలపై కడప నగరవాసులు దండెత్తారు.

Published : 14 Jun 2024 04:24 IST

కడప నగరపాలక, న్యూస్‌టుడే: అధికారంలో ఉండగా వైకాపా నాయకులు, వారి బంధువులు, అనుచరులు సాగించిన అరాచకాలు భూకబ్జాలు అక్రమాలపై కడప నగరవాసులు దండెత్తారు. సామాన్యులు ఎదురుతిరిగితే ఎలా ఉంటుందో వైకాపా పెద్దలకు, బడా రాజకీయనాయకులకు రుచి చూపించారు. కడప నగరం చిన్నచౌకుపరిధిలోని సర్వే నెంబర్‌ 363-1లో కొండాయపల్లికి చెందిన ఒక వ్యక్తికి 73 సెంట్ల స్థలం ఉంది. కడప - తిరుపతి ప్రధాన రహదారి పక్కనే ఉండడంతో దీని విలువ రూ.కోట్లకు చేరింది. 2019లో అధికారంలోకి వచ్చీ రాగానే వైకాపా నాయకుల కన్ను ఈ స్థలంపై పడింది. కడప నగరానికి చెందిన కీలక నేత, కమలాపురం ప్రాంతాలకు చెందిన కొందరునాయకులు నకిలీపత్రాలు సృష్టించి ఈ భూమిని స్వాధీనం చేసుకుని, స్థలంలోకి ఎవరూ ప్రవేశించకుండా ప్రహరీ కట్టి, కబ్జా చేశారు. దీనిపై బాధితులు న్యాయస్థానాన్ని ఆశ్రయించగా పర్మినెంటు ఇంజక్షన్‌ ఆర్డర్‌ వచ్చింది. కబ్జాదారుల వద్ద ఉన్న ధ్రువపత్రాలు నకిలీవని రెవెన్యూ అధికారులు తేల్చారు. ఆక్రమిత స్థలంలో పబ్లిక్‌ రోడ్డు ఉంది. అయినా ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకోవడానికి పోలీసులు సహకరించలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో మళ్లీ ఎన్నికలు వచ్చేంతవరకు బాధితులు ఐదేళ్లు వేచి చూశారు. ఎన్నికల్లో ఎన్డీయే ఘనవిజయం సాధించడంతో వారికి భరోసా ఏర్పడింది. తమ భూమిని తాము స్వాధీనం చేసుకోవడానికి ఒకరికిఎందుకు భయపడాలి అని భావించి గురువారం వైకాపా నాయకులు కట్టిన ప్రహరీని కూల్చేశారు. దీనిని అడ్డుకోవడానికి అక్కడికి తరలివచ్చిన వారిని వారు ఖాతరు చేయలేదు. నాయకుల కబంధహస్తాల్లో చిక్కుకున్న భూములను విడిపించుకోవడానికి సామాన్యులు ముందుకు కదిలారు. బాధితులకు స్ధానిక తెదేపా నాయకులు అండగా నిలిచారు. ప్రహరీకూల్చివేతను నిలిపివేయాలని పలువురు నాయకులు ఫోన్‌లో హెచ్చరించినా వెనక్కు వెళ్లబోమని వారు స్పష్టం చేశారు. మొన్న కడపలోని పోలీస్‌ పెట్రోల్‌బంకు పక్కన గల స్థలం లీజు - ప్లాన్‌ అప్రూవల్‌ వ్యవహారం రచ్చకెక్కింది. అక్కడ నిర్మించిన షాపింగ్‌ గదుల ప్రారంభోత్సవం ఆగిపోయింది.  నిన్న వైకాపా శ్రేణులు ఆ పార్టీ నాయకులు సాగించిన కమీషన్ల వ్యవహారాన్ని ఎంపీ ముందు కుండబద్దలుకొట్టారు. మురళీ థియేటర్‌ సమీపంలో జిల్లా పరిషత్‌ స్థలాన్ని ఒక కార్పొరేటర్‌ ఆక్రమించుకున్న వైనం బయటపడింది. నేడు చిన్నచౌకులో భూకబ్జా బాధితులు ఎదురు తిరిగి స్థలాలను స్వాధీనం చేసుకున్నారు. ఇంకా వైకాపా హయాంలో సాగిన ఎలాంటి కుంభకోణాలు,  అక్రమాలు వెలుగులోకి వస్తాయో అని పలువురు చర్చించుకుంటున్నారు. స్థలం వద్ద గొడవ నేపథ్యంలో ఇరువర్గాల వారిని సీఐ రామచంద్ర ఠాణాకు పిలిపించి విచారించారు. పత్రాలను పరిశీలించి,  వివరాలు కావాలని తహసీల్దారుకు పంపారు.

నకిలీపత్రాలని తహసీల్దారు ధ్రువీకరించారు 

సర్వే నెంబర్‌ 363-1లోని 73 సెంట్ల భూమికి  నకిలీపత్రాలు సృష్టించారని కడప తహసీల్దారు ధ్రువీకరణపత్రాన్ని ఇచ్చారు. దీనికి సంబంధించి న్యాయస్థానం మాకు పర్మినెంటు ఇంజక్షన్‌ ఆర్డర్‌ ఇచ్చింది.  అయినా కబ్జాదారులు పట్టించుకోలేదు. అడ్డుగోడ కట్టారు. ఆ స్థలం మాదేనని చెప్పడానికి అన్ని డాక్యుమెంట్లు మా వద్ద ఉన్నాయి. మాకు హక్కులున్నందున ప్రహరీ కూల్చాం. - బ్రహ్మనాయుడు, కడప  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని