logo

అంగన్‌వాడీ.. అసౌకర్యాల బడి!

చిరుప్రాయంలో శారీరక, మానసిక ఎదుగుదలకు దోహదపడాల్సిన అంగన్‌వాడీ కేంద్రాలు సమస్యలతో సతమతమవుతున్నాయి.

Published : 14 Jun 2024 04:28 IST

వెంటాడుతున్న మౌలిక వసతుల కొరత 
-న్యూస్‌టుడే, కడప, సుండుపల్లి

ఒంటిమిట్ట మండలం కోనరాజుపల్లెలో నాలుగేళ్ల కిందట రూ.7 లక్షలు వెచ్చించి అంగన్‌వాడీ భవనాన్ని నిర్మించారు. విద్యుత్తు, తాగునీరు, మరుగుదొడ్లు తదితర మౌలిక వసతులు  కల్పించాలని అయిదు నెలల కిందట నిధులొచ్చినా నేటికీ పనులు  చేపట్టలేదు. కనీసం రక్షణ గోడ నిర్మించాలన్న మాటే మరిచారు. 


ఒంటిమిట్ట మండలం కొటికెవారిపల్లె మినీ అంగన్‌వాడీ కేంద్రం నిర్వహణకు నూతన భవన నిర్మాణానికి అయిదేళ్ల కిందట రూ.7 లక్షలకు అనుమతిచ్చి భవనం నిర్మించారు. పిల్లలకు మౌలిక సదుపాయలు కల్పించాలనే మాటను  అధికారులు, ప్రజాప్రతినిధులు గాలికొదిలేశారు. తాగేందుకు గుక్కెడు నీరు లేకపోవడంతో సమీపంలోని పంట పొలాలకు వెళ్లి తెచ్చుకోవాల్సిన దుస్థితి నెలకొంది. 

చిరుప్రాయంలో శారీరక, మానసిక ఎదుగుదలకు దోహదపడాల్సిన అంగన్‌వాడీ కేంద్రాలు సమస్యలతో సతమతమవుతున్నాయి. గత వైకాపా ప్రభుత్వం నిర్లక్ష్యంతో కనీసం మౌలిక వసతులు కల్పించక పోవడంతో చిన్నారులు, గర్భిణులు, బాలింతలు, కార్యకర్తలు, ఆయాలు అవస్థలు పడుతున్నారు. కార్పొరేట్‌ స్థాయిలో తీర్చిదిద్దుతామని ఆర్భాటాలు చేసినా క్షేత్రస్థాయిలో వాటి పనితీరుపై ఆరా తీసిన పాపాన పోలేదు. చాలాచోట్ల కేంద్రాలకు సొంత గూడు లేకపోవడంతోపాటు అసౌకర్యాలు వెంటాడుతున్నాయి. 

  • వైఎస్‌ఆర్‌ జిల్లాలో వివిధ పథకాల కింద 131 చోట్ల అంగన్‌వాడీ కేంద్రాలకు సొంత భవనాలు, మౌలిక వసతుల కల్పనకు రూ.6.69 కోట్లతో అనుమతులిచ్చినా ఇంతవరకు పూర్తవ్వలేదు. నాడు-నేడు రెండో విడతలో ప్రభుత్వ పాఠశాలల ప్రాంగణాల్లో 87 గదులు నిర్మించాలని ఉత్తర్వులిచ్చినా పనులు కొనసాగుతూనే ఉన్నాయి. బడియేతర ప్రాంతాల్లో నిర్వహిస్తున్న 632 కేంద్రాలకు మరమ్మతులు చేయించాలని, మౌలిక సదుపాయలు కల్పించాలని అయిదు నెలల కిందట ఆమోదం తెలిపారు. ఈ పనుల్లో చాలాచోట్ల ఎలాంటి కదలిక లేదు. కొన్ని అంగన్‌వాడీ కేంద్రాల్లో మొదలు పెట్టినా బిల్లుల భయంతో గుత్తేదారులు మధ్యలోనే నిలిపేసి చేతులెత్తేశారు. ఒంటిమిట్ట మండలం పెన్నపేరూరులో అంగన్‌వాడీ కేంద్రం భవనం పైకప్పు పెచ్చులూడి ఇనుప చువ్వలు భయపెడుతున్నాయి. విద్యానగర్, మల్లంపేట మృకుండాశ్రమంలో గతంలో చేపట్టిన పనులు మధ్యలో నిలిచిపోయాయి. గొల్లపల్లిలో భవనం పైకప్పు దెబ్బతినడంతో ప్రాథమిక పాఠశాలలో నిర్వహిస్తున్నారు. ఒంటిమిట్ట 1, 3, చెంచుగారిపల్లె, కొత్తమాధవరం, పట్రపల్లి, పెద్ద కొత్తపల్లిలో అంగన్‌వాడీ కేంద్రాలు అద్దె భవనాల్లో నడుస్తున్నాయి. ఒంటిమిట్ట-2లోని కేంద్రం పెంకిటిల్లులో నడుస్తోంది. 
  • అన్నమయ్య జిల్లాలో 40 శాతం అంగన్‌వాడీ కేంద్రాలకు సొంత భవనాల్లేవు. కొన్నిచోట్ల ఉన్నా మౌలిక సదుపాయాల్లేవు. సుండుపల్లి మండలంలో 115 అంగన్‌వాడీ కేంద్రాలకుగానూ 58 చోట్ల అద్దె గదుల్లో నడుస్తున్నాయి. వీరబల్లి మండలంలో 18 కేంద్రాలు ప్రైవేటు భవనాల్లో నిర్వహిస్తున్నారు. నాడు-నేడు రెండో దశలో చేపట్టిన పనులు కూడా నత్తనడకన సాగుతున్నా పట్టించుకునేవారు కరవయ్యారు. పిల్లల  ఆటపాటలకు సరిపడా అనువైన గదుల్లేవు. అద్దె భవనాల్లో బాలింతలు, గర్భిణులు, పిల్లలు తాగేందుకు కనీసం గుక్కెడు నీరు కూడా ఉండడం లేదు. కుళాయిల్లేవు. విద్యుత్తు సౌకర్యం, మరుగుదొడ్ల కల్పించ లేదు. మెరుగైన సౌకర్యాలు కల్పించాలన్న మాటనే వైకాపా ప్రభుత్వం విస్మరించింది. 

చంద్రబాబుపైనే ఆశలు

గత తెదేపా ప్రభుత్వ హయాంలో కొన్ని ప్రాంతాల్లో అంగన్‌వాడీ కేంద్రాలకు సొంత భవనాలను నిర్మించాలని ముందుకొచ్చారు. వైకాపా ప్రభుత్వంలో నిధులేమితో సదుపాయలు కల్పించలేదు. ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో మరమ్మతులు చేపట్టాలని హడావుడి చేసినా ఎన్నికల కోడ్‌ రావడంతో నిలిపేశారు. ప్రస్తుతం ఈ నెల 13న సీఎంగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించండంతో అంగన్‌వాడీ కేంద్రాల్లో నెలకొన్న సమస్యలపై దృష్టి సారించి మౌలిక వసతులు కల్పించాలని కార్యకర్తలు, ఆయాలు, లబ్ధిదారులు కోరుతున్నారు. 


చర్యలు తీసుకుంటాం 

- శ్రీలక్ష్మి, పీడీ, ఐసీడీఎస్, కడప 

కొన్ని ప్రాంతాల్లో అంగన్‌వాడీ కేంద్రాలు అద్దె భవనాల్లో నడుస్తున్నాయి. ఎక్కడైతే గదులకు మరమ్మతులు చేయాల్సిన అవసరం ఉందో వాటిని గుర్తించాం. తాగునీరు, విద్యుత్తు, మరుగుదొడ్లు సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకుంటాం. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని