logo

పెళ్లికి నిరాకరించిందని ప్రియుడు సజీవ దహనం

ప్రియురాలు పెళ్లికి నిరాకరించిందని ఆమెపై పెట్రోలు పోసి తానూ పోసుకుని ఇద్దరూ సజీవ దహనమయ్యేందుకు ప్రియుడు వేసిన పథకం బెడిసికొట్టడంతో తనే సజీవదహనమైన ఘటన బద్వేలు పట్టణంలో గురువారం చోటుచేసుకుంది.

Published : 14 Jun 2024 04:30 IST

ప్రియురాలినీ మట్టుబెట్టే యత్నం 
సహ ఉద్యోగిని చొరవతో విఫలం

బద్వేలు, అట్లూరు న్యూస్‌టుడే: ప్రియురాలు పెళ్లికి నిరాకరించిందని ఆమెపై పెట్రోలు పోసి తానూ పోసుకుని ఇద్దరూ సజీవ దహనమయ్యేందుకు ప్రియుడు వేసిన పథకం బెడిసికొట్టడంతో తనే సజీవదహనమైన ఘటన బద్వేలు పట్టణంలో గురువారం చోటుచేసుకుంది. సీఐ యుగంధర్‌ వివరాల మేరకు.. కలసపాడుకు చెందిన సాయికుమార్‌రెడ్డి (27) గోపవరంలో ‘108’ వాహనం డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. కలసపాడు మండలం సిద్దమూర్తిపల్లెకు చెందిన ఓ యువతి అట్లూరు మండలంలో ఉద్యానశాఖ పర్యవేక్షకురాలిగా పనిచేస్తున్నారు. వీరిద్దరూ మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వీరి పెళ్లికి యువతి తల్లిదండ్రులు అంగీకరించకపోవడంతో వీరి మధ్య రెండు నెలలుగా మాటల్లేవు. ఈ నేపథ్యంలో ప్రియురాలిపై పెట్రోలు పోసి తానూ పోసుకుని ఇద్దరూ సజీవదహనమవ్వాలని సాయికుమార్‌రెడ్డి పథకం వేశాడు. గురువారం ఉదయం పెట్రోలు క్యానుతో ఆమె పనిచేస్తున్న కార్యాలయానికి వెళ్లి తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేశాడు. ఆమె నిరాకరించడంతో కార్యాలయం తలుపులు మూసి ఆమెపై పెట్రోలు పోసి తానూ పోసుకున్నాడు. లైటర్‌తీసి వెలిగించేలోపు ఆమె తప్పించుకుని పక్క భవనంలోకి పరుగులు తీశారు. ఆమె సహచర ఉద్యోగిని గమనించి వెనుకే వస్తున్న సాయికుమార్‌రెడ్డి నుంచి పెట్రోలు క్యాను లాక్కుని ఇద్దరూ రోడ్డుపైకి పరుగులు తీశారు. దీంతో సాయికుమార్‌రెడ్డి వెంటనే బద్వేలులోని తన అక్క ఇంటికి వెళ్లి పెట్రోలు పోసుకుని సజీవదహనమయ్యారు. ఇంట్లో నుంచి భారీగా మంటలు రావడంతో స్థానికుల అగ్నిమాపకశాఖ అధికారులకు సమాచారమిచ్చారు. వెంటనే వారు ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. సాయికుమార్‌రెడ్డి మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రియురాలి ఫిర్యాదు మేరకు పట్టణ సీఐ యుగంధర్, గ్రామీణ సీఐ విక్రమసింహ కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని