logo

జలాశయం... మహర్దశకు సమయం!

గత వైకాపా ప్రభుత్వ హయాంలో కనీసం నిర్వహణకు నిధులు ఇవ్వకపోవడంతో ప్రస్తుతం జలాశయాల భద్రత ప్రశ్నార్థకరంగా మారింది.  ఆయా చోట్ల పరిస్థితి ప్రమాదకరంగా ఉంది. సాంకేతిక లోపాలతో గేట్లు సులువుగా కదలడం లేదు.

Published : 14 Jun 2024 04:33 IST

సాంకేతిక లోపాలతో ప్రాజెక్టుల గేట్లు తరచూ మొరాయింపువై
కాపా ప్రభుత్వ హయాంలో మరమ్మతులకు అందని నిధులు
కొత్త సర్కారుపై అన్నమయ్య, వైఎస్‌ఆర్‌ జిల్లాల ప్రజల ఆశలు
న్యూస్‌టుడే, కడప, లింగాల, కొండాపురం 

గత వైకాపా ప్రభుత్వ హయాంలో కనీసం నిర్వహణకు నిధులు ఇవ్వకపోవడంతో ప్రస్తుతం జలాశయాల భద్రత ప్రశ్నార్థకరంగా మారింది.  ఆయా చోట్ల పరిస్థితి ప్రమాదకరంగా ఉంది. సాంకేతిక లోపాలతో గేట్లు సులువుగా కదలడం లేదు. ఆయకట్టుకు సాగునీరు చేరాలంటే కాలువల్లో అడుగడుగునా అడ్డంకులు నెలకొన్నాయి. వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో మరమ్మతులు చేయాల్సిన తరుణమిదే. ఉమ్మడి కడప జిల్లాలోని కీలకమైన జలవనరులను బాగు చేయడానికి కొత్త ప్రభుత్వం చొరవ తీసుకోవాలని సాగునీటి రంగ నిపుణులు, రైతులు కోరుతున్నారు.

మ్మడి కడప జిల్లాలో 15 చిన్న, మధ్యతరహా, పెద్ద జలాశయాలున్నాయి. వీటి నిల్వ సామర్ధ్యం 84.984 టీఎంసీలు కాగా, ఆయకట్టు 5,03,248 ఎకరాలు. గతేడాది తీవ్ర వర్షాభావంతో జలవనరుల్లో ప్రస్తుతం 16.50 టీఎంసీల నీరుంది. 


కడప నగర శివారులో ఉన్న బుగ్గవంక ప్రాజెక్టు నిర్వహణపై అంతులేని నిర్లక్ష్యం అలముకుంది. కట్ట చివరి వైపున కంప చెట్లు అడవిలా పెరిగాయి. కాలువలన్నీ అధ్వానంగా ఉన్నాయి. నీటి ప్రవాహానికి అడ్డంకులు నెలకొన్నాయి. 


  • పెంచికల బసిరెడ్డి జలాశయంలో నీరు నిల్వ ఉన్న అంతర్గత భాగంలో రాతి కట్టడం దెబ్బతింది. స్పిల్‌వేలోని అత్యవసర గేట్లు (రివర్స్‌ స్లూయిస్‌) నుంచి నీరు వృథాగా పోతోంది. రబ్బరు సీళ్లు దెబ్బతిని లీకులేర్పడ్డాయి. లింగాల కుడి కాలువకు జలాలను విడుదల చేసే నీటి నియంత్రణ కేంద్రం తూము సులువుగా కదలడం లేదు. రెండున్నరేళ్ల కిందట వరదలకు కుడి వైపున 35 మీటర్లు, ఎడమ వైపు 300 మీటర్ల మేర కోతకు గురైంది. 
  • మైలవరం జలాశయంలో నీటిని విడుదల చేసే అత్యవసర గేట్లు రెండు మొరాయిస్తున్నాయి. స్పిల్‌ వే రక్షణ గోడ దెబ్బతిని ప్రమాదకరంగా మారింది.  హెడ్‌ రెగ్యులేటరు గేటు తలుపులు పూర్తి స్థాయిలో పనిచేయడం లేదు. కట్టపై ఉన్న రహదారి దెబ్బతింది.
  • బ్రహ్మంసాగర్‌ ఎడమ కాలువ తూము పాడైంది. నవీకరణ చేయాలని 2021, జూన్‌లో గుత్తేదారుతో రూ.95.89 లక్షలతో ఒప్పందం జరిగింది. సుమారు రూ.25 లక్షల విలువైన పనులు చేపట్టారు. బిల్లులు చెల్లింపుల్లో జాప్యం జరగడంతో గుత్తేదారు నిర్మాణ పనులు నిలిపేశారు. 
  • తెలుగుగంగ పథకంలో అంతర్భాగమైన ఉప జలాశయం-1లో పూర్తి స్థాయిలో జలాలను నిల్వ చేస్తే స్పిల్‌వే నుంచి లోతట్టు ప్రాంతానికి నీటిని విడుదల చేయాలంటే ఇబ్బందులు ఎదురవుతున్నాయి. 
  • శ్రీకృష్ణదేవరాయ గాలేరు-నగరి సుజల స్రవంతి పథకంలో భాగంగా పెన్నానదిపై నిర్మించిన గండికోట ప్రాజెక్టు వద్ద రాత్రి పూట వెలుగుల కోసం ఏర్పాటు చేసిన విద్యుద్దీపాలు నాలుగో వంతు కూడా పనిచేయకపోవండతో అంధకారం నెలకొంది. జలనిధిలో నీరున్నా ఇక్కడ సిబ్బంది, సందర్శకులు తాగేందుకు రక్షిత జలాలు అందుబాటులో లేవు.  ముద్దనూరు మండలం శెట్టివారిపల్లె నుంచి గండికోట సొరంగం వరకు రహదారి అధ్వానంగా ఉంది. 
  • వెలిగల్లు జలాశయం ద్వారా 24 వేల ఎకరాలకు నీరివ్వాలి. ఇంతవరకు నిర్దేశిత ఆయకట్టులో సగం భూములకు కూడా నేరుగా నీరివ్వలేదు. పొలాలకు జలాలు వెళ్లడానికి కాలువలు గతంలో ఏర్పాటు చేసినా అధ్వానంగా ఉన్నాయి. బాగు చేయాలనే మాటను మరిచారు. అదే రైతుల పాలిట శాపంగా మారింది. 
  • 2021, నవంబరు 19న జల ప్రళయంతో అన్నమయ్య ప్రాజెక్టు ప్రధాన మట్టి కట్ట పూర్తిగా కొట్టుకుపోయింది. పునర్నిర్మాణానికి రూ.787.77 కోట్లకు అనుమతిచ్చారు. ఇంతవరకు ఎలాంటి పురోగతి లేదు.  

మరమ్మతులు చేయిస్తాం

- మల్లికార్జునరెడ్డి, సీఈ, నీటిపారుదలశాఖ, కడప  

జలాశయాల నిర్వహణపై ప్రత్యేకంగా దృష్టి సారించాం. స్పిల్‌ వే, నీటి నియంత్రణ కేంద్రం గేట్ల పనితీరుపై నిపుణులతో పరిశీలన చేయించాం. కాలువల్లో పూడిక చేరింది. కొన్నిచోట్ల కట్టలు కుంగిపోయాయి. ఎక్కడెక్కడ ఎలాంటి పనులు చేయాలో ఇప్పటికే గుర్తించాం. నిధులు విడుదల చేయాలని ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపించాం. అనుమతి రాగానే ప్రాధాన్య క్రమంలో అత్యవసరమైన పనులు చేయిస్తాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని