logo

ప్రజాహితం సంతకాలు.. జనమంతా సంబరాలు..!

తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో చరిత్రాత్మక విజయాన్ని అందుకున్న తెదేపా అధినేత నారా చంద్రబాబునాయుడు ఎన్నికల ప్రచారంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటూ ముఖ్యమంత్రి హోదాలో గురువారం అయిదు కీలక అంశాలపై సంతకాలు చేశారు.

Updated : 14 Jun 2024 05:21 IST

మెగా డీఎస్సీపై  మాట నిలుపుకొన్న  సీఎం చంద్రబాబు
ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్టు రద్దు, పింఛన్ల పెంపుపై నిర్ణయం
అన్నక్యాంటీన్ల పునరుద్ధరణ, నైపుణ్య గణనకు ఆమోదం
ముఖ్యమంత్రి నిర్ణయంపై జిల్లా ప్రజల్లో హర్షాతిరేకాలు  
ఈనాడు, కడప, న్యూస్‌టుడే  జిల్లా బృందం

తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో చరిత్రాత్మక విజయాన్ని అందుకున్న తెదేపా అధినేత నారా చంద్రబాబునాయుడు ఎన్నికల ప్రచారంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటూ ముఖ్యమంత్రి హోదాలో గురువారం అయిదు కీలక అంశాలపై సంతకాలు చేశారు. యువతకు పెద్దపీట వేస్తూ మెగా డీఎస్సీ ప్రకటనపై తొలి సంతకం చేశారు. ప్రజల్లో ఆందోళన తీర్చేవిధంగా ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్టు రద్దుపై రెండో సంతకం పెట్టారు. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలకు అండగా నిలిచేవిధంగా పింఛన్ల పెంపుపై మూడోది, నైపుణ్య గణన దస్త్రాలపై  నాలుగోది, అన్న క్యాంటీన్ల పునరుద్ధరణపై  ఐదో సంతకం చేశారు. సీఎం చంద్రబాబు నిర్ణయంపై జిల్లా ప్రజలు సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. ఊరువాడా సంబరాలు చేసుకున్నారు.

నిరుద్యోగులకు వరం 

జిల్లాలోని నిరుద్యోగులకు సీఎం చంద్రబాబు వరమిచ్చారు. ఎన్నికల ప్రచారంలో నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తూనే తొలి సంతకం మెగా డీఎస్సీ ప్రకటన దస్త్రంపై చేశారు. ఇందులో భాగంగా ఎస్జీటీలు, స్కూల్‌ అసిస్టెంట్లు, టీజీటీలు, పీజీటీలు, వ్యాయామోపాధ్యాయులు, ప్రిన్సిపల్స్‌ పోస్టులు భర్తీ చేయనున్నారు. జిల్లాలో 303 పోస్టులు ఖాళీ ఉన్నట్లు చూపించారు. విద్యాశాఖ లెక్క ప్రకారం ఖాళీలు తక్కువగా కనిపిస్తున్నాయి. గత వైకాపా ప్రభుత్వం తీసుకున్న తప్పుడు నిర్ణయాలతో పోస్టులు తగ్గిపోయాయి. జీవో 117 రద్దు చేసే పక్షంలో మరిన్ని పోస్టులు భర్తీ అయ్యే అవకాశం ఉందని నిరుద్యోగులు చెబుతున్నారు. 


2 రాకాసి చట్టానికి చెల్లుచీటీ

ప్రజలను అత్యంత భయకంపితులను చేసిన ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్టు రద్దుపై సీఎం చంద్రబాబు రెండో సంతకం చేశారు. ప్రజల స్థిరాస్తులను కొట్టేయడానికి జగన్‌ ప్రభుత్వం అత్యంత దుర్మార్గమైన ఈ చట్టాన్ని 2023, అక్టోబరు 31న తీసుకొచ్చింది. చట్టం ముసుగులో కొందరు ప్రభుత్వ, ప్రైవేటు వ్యక్తుల భూ భక్షణకు ఆస్కారం ఇచ్చేవిధంగా వివిధ సెక్షన్లను రూపొందించారు. కబ్జా చేసిన ఆస్తులను చట్టబద్ధత తెచ్చుకునేందుకు వైకాపా పెద్దలు పావులు కదిపారు. చట్టాన్ని చూసిన న్యాయాధికారులు, న్యాయమూర్తులు సైతం ముక్కున వేలేసుకున్నారు. సామాన్యుల ఆస్తులకు ఈ చట్టంతో రక్షణ లేకుండా పోతుందని న్యాయవాదులు, మేధావులు, నిపుణులు ఆందోళనలు చేసినా వైకాపా ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. పైగా దీన్నే అమలు చేస్తామంటూ స్పష్టం చేసింది. తాము అధికారంలోకి రాగానే చట్టాన్ని రద్దు చేసి ప్రజల ఆస్తులకు రక్షణగా ఉంటామని ప్రతిపక్షనేత హోదాలో చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు. ఈ మేరకు మేనిఫోస్టోలోనూ ప్రకటించారు. జగన్‌ ఫొటో ముద్రించిన పట్టాదారు పాసుపుస్తకాన్ని తన ఎన్నికల ప్రచారంలో చించేసి కొత్తవి ఇస్తామంటూ ప్రజలకు భరోసా ఇచ్చారు. యాక్టు రద్దుతో పాటు భవిష్యత్తులో 6 లక్షల ఎకరాలకుపైగా సాగుభూములకు రక్షణ కలగడంతోపాటు రైతులకు కొత్త పట్టాదారు పాసుపుస్తకాల జారీ చేయనుంది. 


3 పింఛనుదారులకు పండగ

2014 ఎన్నికల్లో అధికారంలోకి రాగానే సీఎం చంద్రబాబు అప్పటికి రూ.200 ఉన్న పింఛనును 5 రెట్లు పెంచి రూ.వెయ్యి చేశారు. అనంతరం దానిని రూ.2 వేలకు పెంచారు. 2024 ఎన్నికల ప్రచారంలో రూ.4 వేలకు పెంచుతామని పింఛనుదారులకు హామీ ఇచ్చారు. అంతేకాకుండా గత ఏప్రిల్‌ నుంచి పెంచిన పింఛనును అమలు చేసి మూడు నెలలకు నెలకు రూ.వెయ్యి వంతున కలిపి వచ్చే జులై 1న రూ.4 వేలతో పాటు కలిపి మరో రూ.3 వేలు జమ చేసి మొత్తం రూ.7 వేలు చెల్లిస్తామని హామీ ఇచ్చారు. ఆ తర్వాత నెల నుంచి రూ.4 వేలు చెల్లిస్తారు. పింఛన్ల సొమ్ము పెంపుపై ఆయన మూడో సంతకం చేశారు. ఫలితంగా జిల్లాలో మొత్తం 2,66,385 మంది పింఛనుదారుల్లో 40,160 మంది దివ్యాంగులు నెలకు రూ.6 వేలు చొప్పున, మిగిలినవారు రూ.4 వేల చొప్పున లబ్ధి పొందనున్నారు.


4 యువతలో నైపుణ్య గణన  

యువత ఉన్నతస్థాయి విద్యను అభ్యసించినా దానికి తగ్గట్టు ఉద్యోగాలు రాకపోవడానికి ప్రధాన కారణం తగిన నైపుణ్యం లేకపోవడమే. ఈ సమస్య పరిష్కారానికి కూటమి నేతలు ఎన్నికల్లో నైపుణ్య గణన హామీనిచ్చారు. దీనిపైనే సీఎం చంద్రబాబు ఐదో సంతకం చేశారు. ఇలా నైపుణ్య గణన చేయడం దేశంలోనే తొలిసారిగా చెబుతున్నారు. దీని ద్వారా ఎవరిలో ఎలాంటి నైపుణ్యాలున్నాయనేది తేల్చనున్నారు. ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న అభివృద్ధి.. ఏ రంగానికి ప్రాధాన్యముంది.. ఆ తరహా ఉద్యోగాలు పొందేందుకు ఎలాంటి నైపుణ్యాలు అవసరమో వాటిని గుర్తించి యువతకు అందించి జిల్లాలో నిరుద్యోగం తగ్గించేందుకు గణన ఉపయోగపడనుంది. కార్యక్రమం ద్వారా జిల్లాలో 3 లక్షల మందికిపైగా యువత లబ్ధి పొందనున్నారు.


5 పేదల ఆకలి తీర్చనున్న చంద్రన్న

 

త తెదేపా ప్రభుత్వ హయాంలో జిల్లావ్యాప్తంగా 6 అన్న క్యాంటీన్లను ప్రారంభించారు. ఆయా చోట్ల పేదలకు రూ.5 చొప్పున అల్పాహారం, భోజనం అందించారు. సగటున రోజుకు 3 వేల మందికిపైగా  అల్పాహారం, భోజనం చేశారు. ఇందుకుగాను అప్పటి తెదేపా ప్రభుత్వం సుమారు రూ.4 కోట్లు ఖర్చు చేసింది. పేదలకు అన్నం పెట్టే అన్న క్యాంటీన్లను కేవలం తెదేపా ప్రభుత్వం ప్రారంభించిందన్న కక్షతో వైకాపా ప్రభుత్వం మూసివేయించింది. అయినప్పటికీ తెదేపా నేతలు పలుచోట్ల సొంత నిధులతో అన్న క్యాంటీన్లను నిర్వహించారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు ఆ మాటకు కట్టుబడి నాలుగో సంతకం పెట్టారు. త్వరలో ఏర్పాటయ్యే అన్న క్యాంటీన్ల ద్వారా వేలాది మంది పేదలు ఆకలి తీరనుంది.


మాలో ఆశలు నింపింది
- ఎం.సి.రాజకుళ్లాయిరెడ్డి, బొల్లవరం, ప్రొద్దుటూరు

మెగా డీఎస్సీతో 16,347 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసేందుకు తొలి సంతకం చేసిన సీఎం చంద్రబాబుకు అభినందనలు. ఇది నిరుద్యోగులందరికీ పండగ. ఎన్డీయే అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీపైనే తొలి సంతకం చేస్తానని చంద్రబాబు ప్రకటనతో నిరుద్యోగుల్లో ఆశలు నింపింది. నేను కొన్నేళ్లుగా డీఎస్సీ కోసం ఎదురు చూస్తున్నాను. 


ప్రజల్లో ఆందోళన తొలగింది
- గుర్రప్ప, కడప న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు 

ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టం రద్దు చేస్తానని చెప్పిన చంద్రబాబునాయుడు మాట నిలబెట్టుకున్నారు.  ఈ చట్టం పేద ప్రజల పాలిట శాపంగా మారింది. చంద్రబాబు సీఎంగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే యాక్టు రద్దు చేయడం సంతోషం. ప్రజల తరఫున ఆయనకు కృతజ్ఞతలు. రద్దు నిర్ణయంతో అందరిలో ఆందోళన తొలగింది.


వృద్ధులకు ఆసరా
- గుర్రం రాములమ్మ, వృద్ధురాలు, పోరుమామిళ్ల

సీఎం చంద్రబాబునాయుడు ఎన్నికల్లో ఇచ్చిన హామీని అమలు చేయడం హర్షణీయం. పింఛను మొత్తాన్ని రూ.4 వేలకు పెంచారు. జులై నుంచి పెంచిన మొత్తాన్ని అందించనున్నారు. ప్రభుత్వ  నిర్ణయంతో లక్షలాది కుటుంబాలకు ఆసరాగా ఉంటుంది. హామీని అమలు చేసినందుకు చంద్రబాబునాయుడికి రుణపడి ఉంటాం. 


రూ.5కే భోజనం దొరుకుతుంది
- రాజశేఖర్, డప్పు కళాకారుడు, జమ్మలమడుగు 

అన్న క్యాంటీన్‌ ఉన్న సమయంలో మధ్యాహ్నం, రాత్రి ఇక్కడే భోజనం చేసేవాడిని. రూ.5కే భోజనం, అల్పాహారం అందించేవారు. జగన్‌ సీఎం కాగానే అన్న క్యాంటీన్‌ను మూసేసి మాలాంటివారికి ఇబ్బందులు పెట్టారు. తాజాగా సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు అన్న క్యాంటీన్లను పునరుద్ధరించనుండడం ఆనందంగా ఉంది. 


నైపుణ్య గణనతో ఉద్యోగావకాశాలు 
 - ఆర్‌.వెంకట్‌ శ్రీసుభాష్, బీటెక్, కడప  

నైపుణ్య గణనతో యువతలోని నైపుణ్యాన్ని గుర్తించి వారికి ఉన్నతమైన ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనకు అవకాశం కలుగుతుంది. తద్వారా యువతకు ఎలాంటి నైపుణ్యాలు అందించాలి?, యువత ఎలాంటి ఉద్యోగాలు కోరుకుంటున్నారో? తదితర వివరాలు తెలుసుకోవచ్చు. సీఎం చంద్రబాబునాయుడి నిర్ణయం శుభపరిణామం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని