logo

విద్యుదాఘాతంతో మహిళా కూలీ మృతి

బొప్పాయి కాయల లోడుతో వెళ్తున్న లారీకి విద్యుత్తు హైటెన్షన్‌ తీగలు తగలడంతో ఓ మహిళా కూలీ మృతిచెందగా, నలుగురు కూలీలు తీవ్రంగా గాయపడిన ఘటన రైల్వేకోడూరు మండలం అనంతరాజుపేటలో సోమవారం చోటుచేసుకుంది.

Published : 18 Jun 2024 03:08 IST

మరో నలుగురికి తీవ్ర గాయాలు... ఆసుపత్రికి తరలింపు
బొప్పాయి లారీకి హెచ్‌టీ తీగలు తగలడంతో ప్రమాదం

రైల్వేకోడూరు గ్రామీణ, న్యూస్‌టుడే, ఈనాడు, బాపట్ల : బొప్పాయి కాయల లోడుతో వెళ్తున్న లారీకి విద్యుత్తు హైటెన్షన్‌ తీగలు తగలడంతో ఓ మహిళా కూలీ మృతిచెందగా, నలుగురు కూలీలు తీవ్రంగా గాయపడిన ఘటన రైల్వేకోడూరు మండలం అనంతరాజుపేటలో సోమవారం చోటుచేసుకుంది. కర్నూలు జిల్లా తుగ్గలి మండలం సూర్యతాండకు చెందిన శంకర్‌నాయక్, రమావత్‌ మంజులబాయి (34) దంపతులు కూలి పనుల నిమిత్తం వలస వచ్చి రైల్వేకోడూరులోని కొత్తకృష్ణానగర్‌లో నివాసముంటున్నారు. అనంతరాజుపేటలోని ఓ పొలంలో బొప్పాయి కాయల కోత పనులకు 20 మంది కూలీలతో కలిసి మంజులబాయి ఓ లారీలో వెళ్లారు.

ఓ తోట వద్ద సగం లోడు చేసుకుని మరో తోటకు వెళ్తుండగా స్టీలు ఫ్యాక్టరీ సమీపంలో తక్కువ ఎత్తులో ఉన్న విద్యుత్తు హైటెన్షన్‌ తీగలు లారీ పైభాగాన్ని తగిలాయి. వెంటనే మంటలు వ్యాపించడంతో డ్రైవర్, క్లీనర్‌తో పాటు కూలీలు కిందకు దూకేశారు. అప్పటికే క్యాబిన్‌లో ఉన్న మంజులాబాయి ఇనుప కడ్డీని పట్టుకుని కిందకు దిగే క్రమంలో విద్యుదాఘాతానికి గురై మృతిచెందారు. మరో  నలుగురు కూలీలు సిద్ధేశ్వరమ్మ, నరసింహులు, జయమ్మ, వెంకటసుబ్బమ్మలకు తీవ్ర గాయాలవ్వడంతో ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ బాబు తెలిపారు.

మెరుగైన వైద్యానికి మంత్రి ఆదేశాలు : ప్రమాదంపై సమాచారం తెలుసుకున్న విద్యుత్తుశాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ జిల్లా అధికారులతో ఫోన్‌లో మాట్లాడి, ప్రమాద ఘటనకు గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. మృతురాలి కుటుంబానికి ప్రభుత్వ పరంగా అందించాల్సిన సాయంపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఎస్‌ఈని ఆదేశించారు. ప్రమాదంలో గాయపడినవారికి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. ఘటనపై నివేదిక ఇవ్వాలని, వెంటనే విద్యుత్తు తీగలను సరిచేయాలని ఆదేశించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని