logo

కలిసికట్టుగా భరతం పడదాం!

రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు అనంతరం కడపలో సోమవారం తొలిసారిగా కూటమి ఎమ్మెల్యేల సమావేశం జరిగింది. పలు కీలక నిర్ణయాలు తీసుకోవడంతో పాటు కలిసికట్టుగా రాజకీయ ప్రయాణం సాగిస్తూ అక్రమార్కుల భరతం పట్టాలని ఏకగ్రీవ తీర్మానం చేశారు.

Updated : 18 Jun 2024 03:16 IST

కూటమి ఎమ్మెల్యేల తీర్మానం
ఈనాడు, కడప

రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు అనంతరం కడపలో సోమవారం తొలిసారిగా కూటమి ఎమ్మెల్యేల సమావేశం జరిగింది. పలు కీలక నిర్ణయాలు తీసుకోవడంతో పాటు కలిసికట్టుగా రాజకీయ ప్రయాణం సాగిస్తూ అక్రమార్కుల భరతం పట్టాలని ఏకగ్రీవ తీర్మానం చేశారు. వైకాపాతో అంటకాగిన అధికారుల భరతం పట్టాలని, ఈ విషయంలో ఎలాంటి మినహాయింపులు ఇవ్వడానికి వీల్లేదనే అభిప్రాయానికి వచ్చారు. తెదేపా జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన స్థానిక రహదారులు, భవనాలశాఖ అతిథి గృహంలో జరిగిన సమావేశానికి ప్రొద్దుటూరు, కడప, మైదుకూరు ఎమ్మెల్యేలు నంద్యాల వరదరాజుల రెడ్డి, రెడ్డప్పగారి మాధవి, పుట్టా సుధాకర్‌యాదవ్, పులివెందుల, బద్వేలు, జమ్మలమడుగు నియోజకవర్గాల నుంచి తెదేపా నేతలు బీటెక్‌ రవి, రితీష్‌రెడ్డి, భూపేష్‌రెడ్డి హాజరయ్యారు. కమలాపురం ఎమ్మెల్యే పుత్తా కృష్ణచైతన్యరెడ్డి అందుబాటులో లేకపోవడంతో సమావేశానికి హాజరుకాలేదు. గత అయిదేళ్లుగా తెదేపా నేతలు, కార్యకర్తలను వేధించిన వారిని గుర్తించాలని, ప్రత్యేకించి అధికారులను ఎంపిక చేసి తీవ్రతను బట్టి సస్పెండ్‌ చేయించాలనే అభిప్రాయానికి వచ్చారు. ఎన్నికలను ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించడంలో ఎస్పీ సిద్దార్ధ కౌశల్‌ చక్కగా పనిచేశారంటూ నేతలందరూ ప్రశంసించారు. ఎలాంటి హింసకు ఆస్కారం లేకుండా, అక్రమాలకు చోటులేకుండా కట్టడి చేశారంటూ కితాబునిచ్చారు. వైకాపాతో అంటకాగిన అధికారులను బదిలీ చేసే పక్షంలో మరో నియోజకవర్గంలో చేర్చుకోవడానికి ఆస్కారం ఇవ్వరాదని, ఈ మేరకు సంబంధిత నియోజకవర్గ ఎమ్మెల్యే అనుమతి తీసుకున్న తర్వాతే ఓ నిర్ణయానికి రావాలని పుట్టా సుధాకర్‌యాదవ్‌ సూచించారు. కార్యకర్తలను వేధించిన వారి విషయంలో ఏకతాటిపై ఉండాలని, అక్రమాలకు పాల్పడిన అధికారులను, భూదందాలకు పాల్పడిన వైకాపా నేతల్ని పార్టీలో చేర్చుకోరాదని తీర్మానించారు. అక్రమాలను సరిచేసుకోవడానికి కొందరు పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారని, వారిని చేర్చుకుని పార్టీ కార్యకర్తల మనోభావాలను దెబ్బతీయరాదనే అభిప్రాయపడ్డారు. ఎవరూ బేషజాలకు పోకుండా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేశ్‌ లక్ష్యాలను, ఆశయాలను నెరవేర్చడానికి కృషి చేద్దామనే నిర్ణయం తీసుకున్నారు. కూటమి ప్రభుత్వానికి ప్రజల మన్ననలు మరింతగా నిలిచేవిధంగా ఇటీవల చంద్రబాబునాయుడు చేసిన ఐదు సంతకాల పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించారు. ఎన్నికల్లో జిల్లాలోని ఏడు సీట్లలో ఐదింటిలో కూటమి అభ్యర్థుల గెలుపుపై సంతోషం వ్యక్తం చేసిన నేతలు బద్వేలు ఓటమిపై సమీక్షించారు. ఎంపీ సీటు ఓటమిపై మథనం జరిగింది. వైకాపా నుంచి క్రాస్‌ ఓటింగ్‌ జరగలేదని, తెదేపా నుంచి జరగడంతోనే తెదేపా అభ్యర్థి ఓటమి పాలయ్యారనే అభిప్రాయానికి వచ్చారు. కాంగ్రెస్‌ అభ్యర్థి వైకాపా ఓట్లను ఆశించినంతగా చీల్చు కోలేదని, కూటమి ఎమ్మెల్యేలకు మెజార్టీ రాగా... ఎంపీ అభ్యర్థికి తగ్గిపోయాయంటూ బేరీజు వేశారు. పులివెందులలో జగన్‌ మెజార్టీ తగ్గించగలిగినా.. మరింత ప్రభావితం చేయాల్సిన అవసరం ఉందని నేతలు అభిప్రాయపడ్డారు. ప్రజాధనాన్ని వైకాపా నేతలకు పులివెందులలో దోచిపెట్టడంతోనే వైకాపా నెగ్గగలిగిందనే అంచనాకు వేశారు. తరచూ సమావేశాలు నిర్వహించి జిల్లాలో కూటమికి బలాన్ని మరింతగా పెంచుకోవాలనే అభిప్రాయానికి నేతలు వచ్చారు. 


వెన్నుపోటుదారులపై త్వరలో వేటు: ఎన్నికల్లో పార్టీకి వెన్నుపోటు పొడిచిన నేతలపై వేటు వేయాలని సమావేశం తీర్మానించింది. తద్వారా భవిష్యత్తుకు మంచి సంకేతాలు పంపినట్లవుతుందనే అభిప్రాయానికి వచ్చారు. ఈ మేరకు నియోజకవర్గాల వారీగా నేతలను గుర్తించాలని నిర్ణయించారు. తన నియోజకవర్గంలో కీలక నేత ప్రత్యర్థి పార్టీలోకి తన అనుచరులను పంపి.. తద్వారా వైకాపా అభ్యర్థి నుంచి ప్రయోజనాలు పొందారని ఓ ఎమ్మెల్యే ప్రస్తావించారు. మరో నియోజకవర్గంలో చివరి వరకు పార్టీలోనే ఇద్దరు నేతలు ఉంటూ పోలింగ్‌ రోజు వైకాపాకు పనిచేశారని మరో ఎమ్మెల్యే ప్రస్తావించారు. ఇలాంటి వారిని పార్టీ అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లి వేటు వేయించాలని తీర్మానించారు. దీనిపై త్వరలో ఓ నిర్ణయానికి వద్దామని వారంతా నిర్ణయించారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని