logo

విస్తరణ... నత్తనడకన!

ఉమ్మడి కడప జిల్లాలోని రాయచోటి-చాగలమర్రి రహదారి విస్తరణ పనులు గత రెండేళ్లుగా నత్తనడకన సాగుతుండడంతో వాహనచోదకులు, ప్రయాణికులు నిత్యం అవస్థలు పడుతున్నారు.

Published : 18 Jun 2024 03:21 IST

రెండేళ్లుగా అసంపూర్తిగా పనులు 
ప్రయాణికులకు తప్పని రవాణా కష్టాలు
రాయచోటి- చాగలమర్రి రహదారి దుస్థితి 
న్యూస్‌టుడే, రాయచోటి, రామాపురం 

ఉమ్మడి కడప జిల్లాలోని రాయచోటి-చాగలమర్రి రహదారి విస్తరణ పనులు గత రెండేళ్లుగా నత్తనడకన సాగుతుండడంతో వాహనచోదకులు, ప్రయాణికులు నిత్యం అవస్థలు పడుతున్నారు. కంకర తేలిన రహదారిపై దుమ్ము, ధూళితో వాహనాల రాకపోకలకు నిత్యం ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కేంద్రం ఇచ్చిన నిధులతో గత వైకాపా ప్రభుత్వం సకాలంలో పనులు పూర్తి చేయించలేకపోవడమే ఈ దుస్థితి కారణం.

హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నగరాల మధ్య ప్రయాణ దూరం తగ్గడంతోపాటు సమయం కలిసొస్తుందని రాయచోటి-చాగలమర్రి రహదారి రూపురేఖలు మార్చేందుకు రెండేళ్ల కిందట అధికారులు రూ.450 కోట్లతో 55 కిలోమీటర్ల మేర విస్తరణ పనులు చేపట్టారు. టెండరు ద్వారా పనులు దక్కించుకున్న గుత్తేదారు పాత రహదారిని తవ్వేసి తారు రోడ్డు నిర్మాణానికి అవసరమైన కంకర, మట్టి పరిచారు. అనంతరం గుత్తేదారు మరణించడంతో ఆరు నెలలపాటు పనులు నిలిచిపోయాయి. అప్పటికే పూర్తయిన పనులకు సకాలంలో బిల్లులందకపోవడంతో నిర్మాణం చేసేందుకు గుత్తేదారు సంస్థ ముందుకు రాలేదు. దీంతో అధికారులు మరో గుత్తేదారుకు పనులు అప్పగించారు. రహదారి రాయచోటిలోని చిత్తూరు రింగ్‌రోడ్డు నుంచి లక్కిరెడ్డిపల్లి, చక్రాయపేట, వేంపల్లె, ఎర్రగుంట్ల, ప్రొద్దుటూరు మీదుగా నంద్యాల జిల్లా చాగలమర్రి వద్ద చెన్నై-హైదరాబాద్‌ జాతీయ రహదారిలో కలుస్తుంది. కంకర పరిచిన ప్రాంతాల్లో వాహనచోదకులు, ప్రయాణికులు దుమ్ము,ధూళితో నిత్యం అవస్థలు పడుతుండగా, తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. 

నిర్వాసితులకు అందని పరిహారం : రాయచోటి-చాగలమర్రి జాతీయ రహదారి విస్తరణ పనులు చేపట్టేందుకు చాలా ప్రాంతాల్లో భూ సేకరణ చేయాల్సి ఉంది. రాయచోటి సమీపంలోని మదనపల్లె రింగ్‌రోడ్డు కూడలిలో రహదారి విస్తరణకు భూ సేకరణ చేపట్టారు. లక్కిరెడ్డిపల్లె, చక్రాయపేట, కోనంపేట, ఎగువ భాగంలోని పాయలోపల్లె కనుమ, చక్రాయపేట, గండి సమీపంలో విస్తరణకు అవసరమైన భూమిని అధికారులు సేకరించారు. రహదారి విస్తరణకు కేటాయించిన రూ.450 కోట్ల నిధుల నుంచే భూ నిర్వాసితులకు పరిహారం చెల్లించాల్సి ఉంది. రెవెన్యూ అధికారులు బాధితులను గుర్తించి సకాలంలో పరిహారం పూర్తిస్థాయిలో చెల్లించలేదు. దీంతో ఆయా ప్రాంతాల్లో పనులు ప్రారంభం కాలేదు. లక్కిరెడ్డిపల్లిలో రహదారికిరువైపులా నివాసాలు కోల్పోయినవారిలో కొందరికి మాత్రమే పరిహారం చెల్లించడంతో మిగిలిన వారు తమ నివాసాలు తొలగించేందుకు ససేమిరా అంటున్నారు. రహదారిపై మద్దిరేవుల వంక, సూరకవాండ్లపల్లె వంక, వేంపల్లి సమీపంలోని వైఎస్‌ ఎస్టేట్‌కు వెళ్లే ప్రధాన రహదారి వద్ద పాపఘ్ని నదిపై వంతెనలు నిర్మించాల్సి ఉండగా, ఆయా ప్రాంతాల్లో కొంత మేర పనులు చేసి వదిలేశారు. దీంతో వాహనదారులు రాయచోటి, రామాపురం కడప మీదుగా చాగలమర్రికి చేరుకుంటున్నారు. ఉన్నతాధికారులు స్పందించి రహదారి విస్తరణ పనులు వెంటనే పూర్తి చేయాలని వాహనచోదకులు, ప్రయాణికులు కోరుతున్నారు.


త్వరలో పూర్తి చేస్తాం 

- రఘునాథబాబు, ఏఈ, ఎన్‌హెచ్‌ఏఐ, రాయచోటి 

రాయచోటి-చాగలమర్రి జాతీయ రహదారి విస్తరణ పనులు త్వరలోనే పూర్తి చేస్తాం. నిర్వాసితులకు పరిహారం చెల్లింపులపై రెవెన్యూశాఖాధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్య సత్వర పరిష్కారానికి కృషి చేస్తాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని