logo

ఎత్తిపోతలు.. కొత్త ఆశలు!

కర్షకుల సాగునీటి కష్టాలకు శాశ్వత పరిష్కారం చూపాలని నిర్మించిన ఎత్తిపోతల పథకాలపై గత వైకాపా ప్రభుత్వం అంతులేని అలసత్వం చూపింది. నిర్వహణకు నిధులివ్వకుండా తీవ్ర నిర్లక్ష్యం చేసింది.

Updated : 18 Jun 2024 05:06 IST

పథకాలపై వైకాపా సర్కారు శీతకన్ను 
నిర్వహణకు నిధులివ్వకుండా నిర్లక్ష్యం
ముఖ్యమంత్రి చంద్రబాబుతోనే మహర్దశ 
న్యూస్‌టుడే, రాజంపేట పట్టణం, చాపాడు

కర్షకుల సాగునీటి కష్టాలకు శాశ్వత పరిష్కారం చూపాలని నిర్మించిన ఎత్తిపోతల పథకాలపై గత వైకాపా ప్రభుత్వం అంతులేని అలసత్వం చూపింది. నిర్వహణకు నిధులివ్వకుండా తీవ్ర నిర్లక్ష్యం చేసింది. కళ్లెదుటే అపార జలనిధి ఉన్నా ఎత్తిపోసే పరిస్థితి లేకపోవడంపై ఆయకట్టుదారుల ఆక్రందనను అప్పటి సీఎం జగన్‌ చెవికెక్కించకోలేదు. అయిదేళ్ల పాలనలో జలస్ఫూర్తిని విస్మరించారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే  పక్షాన ఓటర్లు నిలబడి చరిత్రాత్మక విజయాన్ని అందించారు. ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబునాయుడు బాధ్యతలు చేపట్టడంతో ఆయనపైనే అన్నదాతలు ఆశలు పెట్టుకున్నారు. అయిదేళ్ల వైకాపా పాలనలో నిర్లక్ష్యానికి గురైన పథకాలను బాగు చేయాలని హలధారులు వేడుకుంటున్నారు. తడారిన నేలకు జలకళ తీసుకొచ్చి బీడువారిన భూములను సస్యశ్యామలం చేయడానికి కంకణం కట్టుకోవాలని సాగుదారులు ఆకాంక్షిస్తున్నారు.  మ్మడి కడప జిల్లాలో ఆంధ్రప్రదేశ్‌ నీటిపారుదల అభివృద్ధి సంస్థ (ఏపీఐడీసీ), నీటిపారుదలశాఖ పర్యవేక్షణలో 35 ఎత్తిపోతల పథకాలు ఉన్నాయి. వీటిని 15 మండలాల్లో దశల వారీగా నిర్మించారు. ఇందుకు రూ.180 కోట్లు వెచ్చించారు. పథకాల ద్వారా 24 వేల ఎకరాలకు సేద్యపు జలాలు అందించాల్సి ఉంది. రూ.కోట్లు ధారపోసినా అటు ఖరీఫ్, ఇటు రబీలో నిర్దేశించిన ఆయకట్టులో కనీసం సగం భూములకు కూడా నీరివ్వలేదు. పెన్నానది పరివాహకంలో 8, సగిలేరు తీరంలో 5, మైలవరం జలాశయంలో ఒకటి, సోమశిల వెనుక జలాలను తరలించాలని మరొకటి, హత్యరాలలో చెయ్యేరు చెంత ఒకటి, మొగమానేరు నుంచి నీటిని తరలించాలని రెండు చోట్ల ఎత్తిపోతల పథకాలు నిర్మించారు. కుందూ నది తీరంలో అత్యధికంగా 17 చోట్ల నిర్మాణం చేపట్టారు. 

నిధులిచ్చి బాగు చేయండి... 

ఒంటిమిట్ట చెరువులోకి సోమశిల వెనుక జలాలను తరలించాలని రూ.33.82 కోట్లతో శ్రీరామ ఎత్తిపోతల పథకం నిర్మించారు. అప్పటి సీఎం చంద్రబాబునాయుడు 2015, ఏప్రిల్‌ 2న శంకుస్థాపన చేశారు. పనులు పూర్తయిన అనంతరం 2016, ఏప్రిల్‌ 20న జాతికి అంకితం చేశారు. సోమశిల వెనుక జలాలను తరలించడానికి 465 అశ్వశక్తి సామర్థ్యం గల మూడు యంత్రాలుండగా, ఒక్కో మోటారు ద్వారా 10.18 క్యూసెక్కుల నీటిని తరలించాల్సి ఉంది. ఒంటిమిట్ట చెరువు ఆయకట్టు 1,014.25 ఎకరాలు కాగా, అయిదేళ్ల వైకాపా పాలనలో ఒక్కసారి కూడా నాలుగో వంతు భూములకు సాగునీరివ్వలేదు. కోట పాడు పంపుహౌస్‌ నుంచి కనుమ వరకు ఉన్న ప్రధాన పైపులైను తరచూ దెబ్బతింటుండడం, లీకులుండడంతో సాగునీరు ముందుకు కదలడం లేదు. పథకం మరమ్మతులు ఖర్చు తడిసిమోపెడవుతోంది. ప్రత్యామ్నాయంగా ఇనుప గొట్టాల ఏర్పాటుకు రూ.10.50 కోట్లు ఇవ్వాలని జిల్లా నుంచి నీటిపారుదలశాఖ సాంకేతిక నిపుణులు గతేడాది ప్రతిపాదనలు పంపినా సీఎం జగన్‌ నిధులకు భరోసా ఇవ్వలేదు. ఏటా నిర్వహణకు రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షలు అవసరం కాగా, గత రెండేళ్లుగా మంజూరు కాలేదు. ఏపీఐడీసీ నుంచి జలవనరుల శాఖకు పథకాన్ని బదలాయించినా నిధుల కష్టాలు తప్పలేదు. మొన్నటి వరకు సోమశిలలో తగినంత నీరున్నా తరలించలేకపోయారు. ప్రస్తుతం చెరువు తడారి వెలవెలబోయి కళాహీనంగా కనిపిస్తోంది. ఒంటిమిట్ట చెరువు జలకళతో తొణికిసలాడేలా ఎత్తిపోతల పథకానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మహర్దశ తీసుకురావాలని రైతులు కోరుకుంటున్నారు. 

ఎక్కడెక్కడ నిర్మించారంటే... 

ఒంటిమిట్ట, జమ్మలమడుగు, రాజుపాళెం, రాజంపేట, చెన్నూరు, కలసపాడు మండలాల్లో ఒక్కొక్కటి చొప్పున. కమలాపురం, ఖాజీపేట, తొండూరు, అట్లూరు, బద్వేలు మండలాల్లో రెండేసి వంతున, ఖాజీపేట, ప్రొద్దుటూరు మండలాల్లో ఆరేసి చొప్పున, పెద్దముడియం మండలంలో నాలుగు, చాపాడు మండలంలో మూడు చోట్ల ఎత్తిపోతల పథకాలు నిర్మించారు. సాంకేతిక లోపాలు, మోటార్లు, పైపులు, స్టార్టర్లు దెబ్బతినడం, విద్యుత్తు సమస్య, నిర్వహణకు నిధుల కొరత తదితర కారణాలతో రూ.లక్షలు వెచ్చించి నిర్మించినా పథకాలు నిరుపయోగంగా మారాయి. వృథాగా ఉన్నా వినియోగంలోకి తీసుకురావడానికి గత ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఎన్డీయే అధికారంలోకి రావడంతో రైతులకు సాగునీటి బెంగ తీర్చే ఈ పథకాలకు మరమ్మతులు చేయించడానికి అవసరమైన నిధులివ్వాలని రైతులు కోరుతున్నారు. 


వినియోగంలోకొస్తే కన్నీళ్లు తుడిచినట్లే... 

ప్రొద్దుటూరు మండలం నాగాయపల్లెలో 193 మంది రైతులకు చెందిన 250 ఎకరాలకు సాగునీరివ్వాలని 2007, జనవరిలో రూ.62.20 లక్షలతో ఎత్తిపోతల పథకాలు చేపట్టారు. చెన్నమరాజుపల్లెలో 2006, మార్చిలో రూ.64.83 లక్షలతో నిర్మించిన పథకం అలంకారప్రాయంగా ఉంది. ఇక్కడ 119 మంది కర్షకులకు చెందిన 350 ఎకరాలకు సేద్యపు జలాలు ఇవ్వాల్సి ఉంది. నక్కలదిన్నెలోని రెండు పథకాలు దిష్టి బొమ్మలను తలపిస్తున్నాయి. నిధులు కరిగినా మెట్ట భూములకు సాగునీరందని పరిస్థితి నెలకొంది. చాపాడు మండలం రాజువారిపేటలో 122 మంది సాగుదారులకు చెందిన 265 ఎకరాలకు సేద్యపు జలాలు ఇవ్వాలని రూ.95.72 లక్షలు వెచ్చించి నిర్మించిన పథకం మూడేళ్లుగా పనిచేయడంలేదు. ఇదే మండలంలోని నక్కలదిన్నెలో 557 మంది అన్నదాతలకు ఉన్న 1,650 ఎకరాలకు సాగునీరివ్వాలని రూ.77.50 లక్షలతో పథకం నిర్మించినా రెండేళ్లుగా వాడకంలో లేకపోవడంతో పంట పొలాలకు నీరందడంలేదు. పెద్దముడియం-1లో రూ.4.39 కోట్లతో నిర్మించిన పథకం ద్వారా 520 ఎకరాలు, పెద్దముడియం-2లో ఆర్‌డీఎఫ్‌-18లో రూ.4.64 కోట్లతో ఏర్పాటు చేసిన పథకం కింద 708 ఎకరాలకు నీరివ్వాలని నిర్ణయించినా సాకారం కాలేదు. భీమగుండం పథకం ద్వారా 3,950 ఎకరాలకు సేద్యపు జలాలివ్వాలని రూ.41.28 కోట్లతో పథకం నిర్మించినా ఉపయోగం లేకుండాపోయింది. రాజంపేట మండలం హత్యరాల పథకం నుంచి 200 ఎకరాలకు నీరివ్వాల్సి ఉండగా, చెయ్యేరు నది వరదలకు దెబ్బతింది. ఇక్కడే కాకుండా మిగతా చోట్ల కూడా కాసుల కటకటతో నిర్వహణ తీరు నానాటికీ తీసికట్టుగా మారింది. 


నిధులివ్వాలని ప్రతిపాదనలు పంపుతాం 

- సుధీర్‌ కృపానంద్, బాధ్య ఎస్‌ఈ, ఏపీఐడీసీ, కడప  

ఉమ్మడి కడప జిల్లాలోని కొన్ని ఎత్తిపోతల పథకాలు రెండేళ్ల కిందట వచ్చిన వరదలకు దెబ్బతిన్నాయి. వీటి మరమ్మతులకు నిధులివ్వాలని ప్రతిపాదనలు పంపించాం. అప్పట్లో అనుమతి రాలేదు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో ఉన్నతాధికారుల దృష్టికి ఎత్తిపోతల సమస్యలను తీసుకెళతాం. ప్రస్తుత ధరలను అనుసరించి అంచనాలు రూపొందిస్తాం. నిధులివ్వాలని ప్రతిపాదనలు పంపిస్తాం. ఉన్నత స్థాయి నుంచి అనుమతి రాగానే బాగు చేయించి సాగునీరందించేందుకు చర్యలు తీసుకుంటాం.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని