logo

ఎందుకీ ఉదాసీనత?

కడప జిల్లాపరిషత్తు కార్యాలయం అధికారుల్లో కొంతమంది అధికారులు వైకాపాతో అంటకాగుతూ జడ్పీ ఆస్తులను వైకాపా నేతలకు అప్పనంగా కట్టబెడుతున్నారు.

Published : 21 Jun 2024 04:22 IST

జడ్పీ ఆస్తులను కాజేస్తున్నా పట్టని అధికారులు 
అధికార యంత్రాంగంపై తీవ్ర విమర్శలు 

కడప జిల్లా పరిషత్తు  కార్యాలయ ప్రాంగణం

ఈనాడు, కడప : కడప జిల్లాపరిషత్తు కార్యాలయం అధికారుల్లో కొంతమంది అధికారులు వైకాపాతో అంటకాగుతూ జడ్పీ ఆస్తులను వైకాపా నేతలకు అప్పనంగా కట్టబెడుతున్నారు. గతంలో జడ్పీ కార్యాలయ ప్రాంగణంలో ఓ ప్రైవేటు కళాశాలకు భవనాలను తాకట్టు పెట్టేశారు. అన్న క్యాంటీన్‌ భవనాన్ని ప్రైవేటు హోటల్‌కు ఇవ్వబోయి విమర్శలు రావడంతో వెనక్కి తగ్గారు. తాజాగా జడ్పీ స్థలాన్ని ఓ వైకాపా నేత ఆక్రమించుకుని హోటల్‌ నిర్మించారు. ఈ అక్రమ వ్యవహారంపై జడ్పీ సీఈవో సుధాకర్‌రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేసి చేతులు దులుపుకొన్నారు. హోటల్‌ను స్వాధీనం చేసుకుని పడగొట్టే శక్తియుక్తులున్నప్పటికీ కాలయాపన చేస్తూ ఉదాసీనతను ప్రదర్శిస్తున్నారు. స్థలాన్ని ఆక్రమించుకున్న సదరు నేత కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకోవడానికి వీలుగా సమయమిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సుధాకర్‌రెడ్డికి సీఈవోగా పనిచేయడానికి అర్హత లేనప్పటికీ గతంలో వైకాపా ప్రభుత్వం ఏకంగా ఆ సీట్లో కూర్చోబెట్టింది. ఇందుకు ప్రతిఫలంగా వైకాపాతో అంటకాగుతూ ఆ పార్టీ నేతలకు అనుకూలంగా పనిచేస్తూ జడ్పీ ఆస్తుల్ని ధారాదత్తం చేస్తున్నారు. తెదేపా అధికారంలోకి వచ్చిన అనంతరం కూడా వైకాపాకు అనుకూలంగా పనిచేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఎంతో విలువైన జిల్లా పరిషత్తు ఆస్తుల కబ్జాపై ఉన్నతాధికారులు అక్షింతలు వేసినా పట్టించుకోకపోవడం గమనార్హం.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని