logo

పాడా... అధికారుల్లో దడ!

పులివెందుల ప్రాంత అభివృద్ధి సంస్థ (పాడా) అధికారుల్లో దడ మొదలైంది. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన ఎన్డీయే ప్రభుత్వం విచారణ చేపట్టనుండడంతో లెక్కలు సరిదిద్దుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.

Updated : 21 Jun 2024 05:19 IST

ఐదేళ్లుగా జరగని ఆడిటింగ్‌
అడిగేవారే లేరనే ధీమా
బయట పడేందుకు హడావుడి

పులివెందుల పట్టణంలో సెంట్రల్‌ బోలేవార్డ్‌ 

ఈనాడు, కడప: పులివెందుల ప్రాంత అభివృద్ధి సంస్థ (పాడా) అధికారుల్లో దడ మొదలైంది. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన ఎన్డీయే ప్రభుత్వం విచారణ చేపట్టనుండడంతో లెక్కలు సరిదిద్దుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో సీఎంలుగా పనిచేసిన వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి, వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హయాం నుంచి పాడా ద్వారా నియోజకవర్గ అభివృద్ధి పనులు చేపడుతూ వస్తున్నారు. అప్పట్లో ఏటా ఆడిటింగ్‌ నిర్వహించి లెక్కలు తేల్చుతూ వచ్చారు. గత అయిదేళ్లుగా చూస్తే ఎలాంటి ఆడిటింగ్‌ జరగలేదు. వైకాపా హయాంలో గత అయిదేళ్లుగా పాడా కింద సుమారు రూ.1000 కోట్ల నిధులను వ్యయం చేశారు. ఈ నిధులను నేతలకు పప్పుబెల్లాల్లా పంచిపెట్టారు. సాధారణ ఎన్నికల్లో లబ్ధికి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. అలకతో ఉన్న వైకాపా నేతల్ని ప్రసన్నం చేసుకోవడానికి పాడా, డ్వామా కింద నరేగా నిధులు, పనులు పంచిపెట్టి నాలుగు రాళ్లు వెనకేసుకునేలా అక్రమాలకు తెరలేపారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైకాపా ఘోరపరాజయం కావడంతో అధికారుల్లో వణుకు మొదలైంది. పాడాకు డిప్యుటేషన్‌పై వచ్చిన అధికారులు చల్లగా జారుకునే ప్రయత్నం చేయగా, వీరిని రిలీవ్‌ చేయొద్దంటూ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలొచ్చాయి. దీంతో పాడాపై విచారణ చేపట్టి క్లీన్‌చిట్‌ వచ్చే పక్షంలో రిలీవ్‌ చేయడం, లేదంటే తగిన చర్యలు తీసుకునే దిశగా పావులు కదుపుతున్నారు. ఈ నేపథ్యంలో అధికారుల్లో ఆందోళన నెలకొంది. గత అయిదేళ్లుగా చేయని ఆడిటింగ్‌ చేయించి తప్పులు సరిచేసుకోవడం ద్వారా కాస్త ఉపశమనం పొందవచ్చునని భావించి జిల్లా ఆడిటింగ్‌ అధికారిపై ఒత్తిడి పెంచారు. వెంటనే పాడాపై ఆడిటింగ్‌ చేయాలని ఆదేశించడంతో ఆడిటింగ్‌ విభాగం రంగంలోకి దిగింది.


వైకాపాతో అంటకాగిన జిల్లా ఆడిటింగ్‌ అధికారిణి...

జిల్లా ఆడిటింగ్‌ అధికారిణి మంజులవాణి వైకాపాతో అంటకాగుతూ నిబంధనలకు విరుద్ధంగా సొంత జిల్లాలోనే విధులు నిర్వహిస్తున్నారు. సాధారణంగా సొంత జిల్లాలో జిల్లా అధికారి పని చేయరాదనే నిబంధనలున్నాయి. దాదాపు గత అయిదేళ్లుగా జిల్లాలోనే పనిచేస్తున్నారు. ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చిన సమయంలోనూ మూడేళ్లుగా ఒక ప్రాంతంలో పని చేసే అధికారిని బదిలీ చేయాలనే నిబంధన ఉంది. దీనిని వర్తింపజేయకుండా ఆడిటింగ్‌ అధికారిణికి మినహాయింపు ఇచ్చారు. ఎన్నికల వ్యయ నోడల్‌ అధికారిగా ఆమెను నియమించాల్సి ఉన్నప్పటికీ కోడ్‌ నిబంధన బయటపడుతుందనే కారణంగా ఆ బాధ్యతలను మరో అధికారికి అప్పగించారు. ఇప్పుడు సాధారణంగా పాడా ఆడిటింగ్‌ డిసెంబరులో జరగాల్సి ఉండగా సంబంధిత అధికారులను బయటపడేయడానికి ఇప్పుడే ప్రారంభించారు. పాడాలో రూ.1000 కోట్ల నిధులతో పనులు జరిగిన దాఖాలాల్లేవు. సీఎం పర్యటన ప్రొటోకాల్‌ ఖర్చుల కింద రూ.8 కోట్లు, కార్యాలయ ఫర్నిటర్, ఐటీ సంబంధిత పరికరాలు, కంప్యూటర్ల కొనుగోలుకు రూ.4 కోట్లు వ్యయం చేసినట్లు చూపించారు. ఈ మేరకు ఖర్చుకు సంబంధించి సరైన ఆధారాలు అధికారులు చూపించడంలేదని తాజాగా చేపట్టిన ప్రాథమిక ఆడిటింగ్‌లో బయటపడింది. పూర్తిగా చేపట్టే పక్షంలో పలు అక్రమాలు వెలుగుచూసే అవకాశం ఉంది. వైకాపాతో అంటకాగుతున్న అధికారుల ద్వారా చేపడుతున్న ఆడిటింగ్‌పై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని