logo

నిధుల్లేక... భవనాలు సాగక

విద్యా రంగంలో మౌలిక సౌకర్యాలు కరవయ్యాయి. నిధులు ఉన్నా వైకాపా ప్రభుత్వ హయాంలో బిల్లులు సకాలంలో రాకపోవడంతో కాంట్రాక్టర్లు ఆ పనులను నిలుపుదల చేయడం, నెమ్మెదిగా నిర్మించడంతో విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారు.

Published : 21 Jun 2024 04:40 IST

అర్ధాంతరంగా ఆగిన కళాశాలల నిర్మాణాలు 
వసతిలేక ప్రైవేటు గదుల్లోనే విద్యార్థులు
రూ.కోట్లు మంజూరైనా సాగని పనులు 
న్యూస్‌టుడే, ప్రొద్దుటూరు పట్టణం

యోగివేమన ఇంజినీరింగ్‌ కళాశాలలో పునాది దశలోనే ఆగిన పనులు

విద్యా రంగంలో మౌలిక సౌకర్యాలు కరవయ్యాయి. నిధులు ఉన్నా వైకాపా ప్రభుత్వ హయాంలో బిల్లులు సకాలంలో రాకపోవడంతో కాంట్రాక్టర్లు ఆ పనులను నిలుపుదల చేయడం, నెమ్మెదిగా నిర్మించడంతో విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారు. వైఎస్‌ఆర్‌ యోగివేమన ఇంజినీరింగ్‌ కళాశాల భవన నిర్మాణాలు నెమ్మదించడం, ఉర్దూ జూనియర్‌ కళాశాలలు నిర్మాణాలు ఆగిపోయాయి.

  • ప్రొద్దుటూరు పట్టణం కొర్రపాడురోడ్డులో ఉన్న పాలిటెక్నిక్‌ కళాశాల మైదానంలో ఉన్న వైఎస్‌ఆర్‌ యోగివేమన ఇంజినీరింగ్‌ కళాశాల 2010 నుంచి నిర్వహణ జరుగుతోంది. ఈ కళాశాలకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి విద్యార్థుల ప్రవేశాలు జరుగుతున్నాయి. ఈ కళాశాలలో తరగతి గదులు లేకపోవడం, హాస్టల్‌ వసతి లేదు. మూడేళ్ల కిందట అద్దె ప్రాతిపదికన భవనంలో కళాశాల తరగతులు నిర్వహించారు. హాస్టల్‌ వసతి లేక విద్యార్థులు ప్రైవేటు గదుల్లో ఉంటున్నారు. కళాశాలకు రూ.45 కోట్లతో తరగతి గదులు, లైబ్రరి, విద్యార్థినులకు రెండు హాస్టల్‌ భవనాలు, విద్యార్థులకు ఒక హాస్టల్‌ భవన నిర్మాణాలు చేపట్టాలి. ఈ నిర్మాణాలు పునాది దశలోనే  ఎన్నికల ముందు ఆగిపోయాయి. ప్రస్తుతం రూ.10 కోట్లతో పనులు చేపట్టగా రూ.1.5 కోట్ల వరకు బిల్లులు రావాల్సి ఉండడంతో కాంట్రాక్టర్‌ పనులను కొద్ది మాసాల నుంచి చేపట్టలేదు. జూన్‌లోగా నిర్మాణాలు పూర్తి చేయాలనే నిబంధన ఉన్నా ఆ నిర్మాణాలు పూర్తయ్యే పరిస్థితి కనబడడం లేదు. ప్రతి విద్యా సంవత్సరంలో గతేడాది కన్నా అదనంగా 23 మందికి ప్రవేశాలు కల్పించే అనుమతికి ఏళ్లుగా నిరీక్షణ తప్పడం లేదు.

ఉర్దూ జూనియర్‌ కళాశాల భవనాలు అర్ధాంతరంగా ఆగడంతో పెరిగిన ముళ్లకంపలు 

  • అమృతనగర్‌లో గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఉర్దూ జూనియర్‌ కళాశాల నూతన భవన నిర్మాణానికి రూ.3.6 కోట్లు నిధులు మంజూరయ్యాయి. వైకాపా ప్రభుత్వం హయాంలో కాంట్రాక్టర్‌ పనులు మొదలుపెట్టగా  రూ.60 లక్షల మేర పనులు చేపట్టారు. ఒక్క రూపాయి కూడా బిల్లులు చెల్లించకపోవడంతో మూడేళ్ల కిందటే పనులు ఆగాయి. 
  • ప్రొద్దుటూరు ఎస్‌సీఎన్‌ఆర్‌ డిగ్రీ కళాశాలలో అదనపు తరగతి గదుల నిర్మాణానికి రూసో నిధులను కేంద్ర ప్రభుత్వం రూ.1.40 కోట్లతో గదులను నిర్మించగా వాటి నిధులను రద్దు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం  రూ.24 కోట్లు నిధులతో భవనాలు నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం రూసో నిధులను రద్దు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం రూ.24 కోట్ల నిధులను విడుదల చేయలేదు. కాంట్రాక్టర్‌ రూ.80లక్షల నిధులతో నిర్మాణ గదులను నిర్మించారు. ఇందుకు ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం నుంచి విడుదల కాలేదు. 
  • ఏపీ విద్యా సంక్షేమ మౌలిక అభివృద్ధి సంస్థ ఇంజినీరింగ్‌ శాఖ డీఈ గురివిరెడ్డి దృష్టికి ’న్యూస్‌టుడే‘ తీసుకెళ్లగా యోగివేమన యూనివర్సిటీలో పనులు నెమ్మదిగా సాగుతున్నాయన్నారు. ఉర్దూ జూనియర్, డిగ్రీ కళాశాలలో జరుగుతున్న పనులకు బిల్లులు రాకపోవడంతో కాంట్రాక్టర్‌లు పనులను నిలుపుదల చేసినట్లు తెలిపారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని