logo

ఉపకారం... ప్రతిభకు సహకారం

పేద విద్యార్థుల విద్యాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నేషనల్‌ మీన్స్‌కమ్‌ మెరిట్‌ స్కాలర్‌షిప్‌ (ఎన్‌ఎంఎంఎస్‌)ను ప్రారంభించింది. ఏడో తరగతి పూర్తి చేసి 8వ తరగతిలో అడుగుపెట్టే విద్యార్థులకు ఈ పరీక్ష నిర్వహించారు.

Published : 21 Jun 2024 04:46 IST

ఎన్‌ఎంఎంఎస్‌లో విద్యార్థుల సత్తా
మదనపల్లె నుంచి అత్యధికంగా ఎంపిక

ఉపకార వేతనాలకు ఎంపికైన విద్యార్థులతో ప్రధానోపాధ్యాయుడు రాజేంద్రప్రసాద్‌

మదనపల్లె విద్య, న్యూస్‌టుడే : పేద విద్యార్థుల విద్యాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నేషనల్‌ మీన్స్‌కమ్‌ మెరిట్‌ స్కాలర్‌షిప్‌ (ఎన్‌ఎంఎంఎస్‌)ను ప్రారంభించింది. ఏడో తరగతి పూర్తి చేసి 8వ తరగతిలో అడుగుపెట్టే విద్యార్థులకు ఈ పరీక్ష నిర్వహించారు. ఇందులో మదనపల్లె వివేకానంద మున్సిపల్‌ ఉన్నత పాఠశాల నుంచే 25 మంది విద్యార్థులు అర్హత సాధించారు. జిల్లాలోనే అత్యధికంగా ఎన్‌ఎంఎంఎస్‌కు ఎంపికై అందరి చేత ప్రశంసలు అందుకుంటున్నారు. ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు అయిదు సంవత్సరాలు పాటు ఏటా రూ.12 వేలు చొప్పున ఉపకార వేతనం వారి బ్యాంకు ఖాతాల్లో జమ అవుతుంది. ఈ డబ్బుతో విద్యా సామగ్రి కొని చదువులో రాణించేందుకు కృషి చేస్తామన్నారు. తల్లిదండ్రులపై కొంత భారం తగ్గించేందుకు ఈ డబ్బు ఎంతో ఉపయోగపడుతుందని విద్యార్థులు అంటున్నారు. ఉపకార వేతనాలకు జిల్లాలోనే ఎక్కువ సంఖ్యలో వివేకానంద మున్సిపల్‌ ఉన్నత విద్యార్థులు ఎంపిక కావడంతో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రాజేంద్రప్రసాద్‌తో పాటు ఉపాధ్యాయులు అభినందిస్తున్నారు.


సమయం కేటాయించడంతోనే
- కురవ సాయిసాహితీ, వివేకానంద మున్సిపల్‌ ఉన్నత పాఠశాల

ఎన్‌ఎంఎంఎస్‌ ఫలితాల్లో 131 మార్కులు సాధించి జిల్లాలోనే ప్రథమ స్థానం సాధించాను. పాఠశాలలో ఉపాధ్యాయులిచ్చిన శిక్షణతో పాటు ప్రత్యేకంగా సమయం కేటాయించడం వల్ల ఎన్‌ఎంఎంఎస్‌లో మంచి మార్కులు సాధించగలిగా. నాన్న సుబ్రహ్మణ్యం కరోనా సమయంలో మృతి చెందగా అమ్మ భార్గవి కష్టపడి చదివిస్తోంది. గణిత ఉపాధ్యాయురాలు కావడమే లక్ష్యంగా పెట్టుకున్నాను.


ఉపాధ్యాయుల ప్రత్యేక శిక్షణ
- జి.ఆదివిష్ణు, వివేకానంద మున్సిపల్‌ ఉన్నత పాఠశాల

పాఠశాలలో ఉపాధ్యాయులు ఉదయం, సాయంత్రం ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. తల్లిదండ్రుల ప్రోత్సాహం తోడవడంతో 127 మార్కులు సాధించా. అమ్మా నాన్న రామ్మూర్తి, మల్లీశ్వరి చేనేత కార్మికులు. ఉదయం నుంచి రాత్రి వరకు కష్టపడతారు. ఈ ఉపకార వేతనం వల్ల నాకు ఎంతో ఉపయోగం ఉంది. అమ్మా నాన్నలపై కొంత ఒత్తిడి తగ్గుతుంది. చిన్నప్పటి నుంచి ఐఏఎస్‌ కావాలన్నదే నా లక్ష్యం. అందుకే అన్ని ప్రతిభా పరీక్షలకు హాజరౌతాను.


పునశ్చరణ ఎంతో ముఖ్యం
- ఎస్‌.రియాజ్, వివేకానంద మున్సిపల్‌ ఉన్నత పాఠశాల 

ఎన్‌ఎంఎంఎస్‌ పరీక్షలో 112 మార్కులు వచ్చాయి. పాఠశాలలో చెప్పే విషయాలను ఎప్పటికప్పుడు నేర్చుకోవడం, పునశ్చరణ చేసుకోవడం, ముఖ్యమైన అంశాలను రాసుకుని చదువుకోవడం ఉదయం, సాయంత్రం ప్రత్యేకంగా గంట పాటు దీనికి కేటాయించుకోవడం వల్ల మంచి మార్కులు వచ్చాయి. అమ్మ నాన్న వాహీదా, ఇనాయతుల్లా టీ హోటల్‌ నిర్వహిస్తారు. ఈ ఉపకార వేతనం నాకు ఎంతో ఉపయోగపడుతుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని