logo

మా తొలి ప్రాధాన్యమిదే!

తమ నియోజకవర్గంలో ప్రజాసమస్యల పరిష్కారమే తమ ధ్యేయమని, వాటికే తొలి ప్రాధాన్యమిస్తామని కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. ప్రజాసంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తామని తెలిపారు.

Updated : 21 Jun 2024 05:10 IST

ప్రధాన సమస్యలపై ప్రత్యేక దృష్టి
నేడు ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం
న్యూస్‌టుడే, అరవిందనగర్‌ (కడప), ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, మైదుకూరు, బద్వేలు, కమలాపురం

తమ నియోజకవర్గంలో ప్రజాసమస్యల పరిష్కారమే తమ ధ్యేయమని, వాటికే తొలి ప్రాధాన్యమిస్తామని కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. ప్రజాసంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తామని తెలిపారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌ జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో అయిదింట ఎన్డీయే అభ్యర్థులు విజయం సాధించగా, రెండింటితో వైకాపా సరిపెట్టుకుంది. అన్నమయ్య జిల్లాలోని ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలకు నాలుగు స్థానాల్లో ఎన్డీయే అభ్యర్థులు విజయం సాధించగా, రెండింటిలో వైకాపా గెలుపొందింది. రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం అధికారం చేపట్టగా, తెదేపా నుంచి రాయచోటి ఎమ్మెల్యేగా విజయం సాధించిన మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డికి మంత్రి పదవి వరించింది. నూతన ప్రభుత్వంలో ఆయన రవాణా, యువజన, క్రీడలశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. రెండు జిల్లాల్లోని ఎమ్మెల్యేలు నేడు ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో వారి నియోజకవర్గంలో ప్రధాన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని పేర్కొన్నారు.  


మెరుగైన భూగర్భ, మురుగునీటిపారుదల వ్యవస్థకు కృషి 

ప్రొద్దుటూరు రోడ్లపై పారుతున్న మురుగు,  వర్షపునీరు (పాత చిత్రం) 

ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ప్రజాసమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం. ప్రధానంగా ప్రొద్దుటూరు పట్టణంలో అస్తవ్యవస్తంగా మారిన మురుగునీటిపారుదల వ్యవస్థ మెరుగుదలకు తొలి ప్రాధాన్యమిస్తాం. మురుగు కాలువల నిర్మాణానికి చర్యలు తీసుకుంటాం. ప్రజారోగ్యానికి పెద్దపీట వేయడంతోపాటు నియోజకవర్గవ్యాప్తంగా ప్రభుత్వాసుపత్రుల ఆధునికీకరణకు శ్రీకారం చుడతాం. 
- నంద్యాల వరదరాజులరెడ్డి, ఎమ్మెల్యే, ప్రొద్దుటూరు నియోజకవర్గం


తాగు, సాగునీటి సమస్యలు నివారిస్తా

అడుగంటిన బ్రహ్మంసాగర్‌ జలాశయం

బద్వేలు నియోజకవర్గంలో తాగు, సాగునీటి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం. బ్రహ్మంసాగర్‌ జలాశయంలో పూర్తి స్థాయిలో నీటినిల్వలు ఉండేవిధంగా ప్రయత్నం చేస్తాం. బద్వేలు బృహత్తర తాగునీటి పథకం నుంచి బద్వేలు పురపాలక సంఘం పరిధిలోని ప్రజలకు 24 గంటలు రక్షిత తాగునీరందించేందుకు కృషి చేస్తాం. 

దాసరి సుధ, ఎమ్మెల్యే, బద్వేలు నియోజకవర్గం


తాగునీటి సమస్య పరిష్కారమే లక్ష్యం

పెన్నానదిలో తాగునీటి సరఫరాను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే మాధవి, తదితరులు (పాత చిత్రం)

కడప నియోజకవర్గంలో ప్రధానంగా కడప నగరంలో తాగునీటి సమస్య పరిష్కారంతోపాటు శాశ్వత పథకం నిర్మాణంపై దృష్టిసారించాం. ఇందుకు సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం. నేరాలను అదుపు చేసేందుకు చర్యలు తీసుకుంటాం. రహదారుల నిర్మాణంతో పాటు యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రాధాన్యమిస్తాం.  

రెడ్డప్పగారి మాధవి, ఎమ్మెల్యే, కడప నియోజకవర్గం 


రైల్వే పైవంతెన నిర్మాణానికి శ్రీకారం 

రైల్వేగేటు పడడంతో బారులు తీరిన వాహనదారులు 

కమలాపురం నియోజకవర్గంలో ప్రధాన సమస్యగా ఉన్న రైల్వే పైవంతెన నిర్మాణానికి శ్రీకారం చుడతాం. సమస్యను ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకెళ్లి నిధులు మంజూరు చేయించడంతో పాటు వంతెన నిర్మాణానికి చర్యలు తీసుకుంటాం. నియోజకవర్గంలో ప్రజాసమస్యల పరిష్కారానికి కృషి చేయడమే కాకుండా వారి సంక్షేమానికి పెద్దపీట వేస్తాం. 

పుత్తా కృష్ణచైతన్యరెడ్డి, ఎమ్మెల్యే, కమలాపురం నియోజకవర్గం


ఉక్కు పరిశ్రమ స్థాపనే ధ్యేయం 

నిరుపయోగంగా మారిన ఉక్కు ప్రతిపాదిత భూములు

జమ్మలమడుగు నియోజకవర్గంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేసి యువతకు ఉపాధి కల్పించడమే నా మొదటి ప్రాధాన్యం. రాజోలి జలాశయం, గండికోట నిర్వాసితులకు పరిహారం, పర్యాటక కేంద్రమైన గండికోటను అభివృద్ధి చేయడమే నా ముందున్న మరో మూడు లక్ష్యాలు. జమ్మలమడుగు ప్రాంతంలో మరిన్ని పరిశ్రమలు తీసుకొచ్చి స్థానిక యువతకు ఉద్యోగావకాశాలు కల్పిస్తాం. 

చదిపిరాళ్ల ఆదినారాయణరెడ్డి, ఎమ్మెల్యే, జమ్మలమడుగు నియోజకవర్గం


రైతుల కల నెరవేరుస్తా 

అభివృద్ధికి నోచుకోని రాజోలి జలాశయం

మైదుకూరు నియోజకవర్గంలో రాజోలి జలాశయం నిర్మాణమే నా తొలి ప్రాధాన్యం. తద్వారా కర్నూలు-కడప కాలువ (కేసీ) ఆయకట్టు రైతుల కల నెరవేరుస్తాం. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, జలవనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన నిర్మాణం పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటాం. రైతులకు సాగునీటి ఇబ్బందుల్లేకుండా కృషి చేస్తాం. 

పుట్టా సుధాకర్‌యాదవ్, ఎమ్మెల్యే, మైదుకూరు నియోజకవర్గం 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని