logo

పింఛను సొమ్ము... అక్రమాలే దన్ను!

నాకింత... నీకింత ధోరణిలో గత వైకాపా ప్రభుత్వం ప్రజాధనాన్ని కొల్లగొట్టింది. పార్టీ కార్యకర్తల నుంచి నేతల వరకు పలు మార్గాల్లో దోచిపెట్టింది. ఇందుకు తార్కారణమే సామాజిక పింఛన్ల పంపిణీ  వ్యవహారం.

Updated : 11 Jul 2024 05:57 IST

మంజూరు వ్యవహారంలో వైకాపా నాయకుల దందాలు
నిబంధనలకు విరుద్ధంగా సదరం, ఆధార్‌ పత్రాల జారీ
కడప ప్రభుత్వ సర్వజన  ఆసుపత్రి వైద్యుడి లీలలు

తప్పుడు సదరం ధ్రువీకరణ పత్రం

నాకింత... నీకింత ధోరణిలో గత వైకాపా ప్రభుత్వం ప్రజాధనాన్ని కొల్లగొట్టింది. పార్టీ కార్యకర్తల నుంచి నేతల వరకు పలు మార్గాల్లో దోచిపెట్టింది. ఇందుకు తార్కారణమే సామాజిక పింఛన్ల పంపిణీ  వ్యవహారం. ఎలాంటి అర్హత లేకున్నా అప్పనంగా నెలవారీగా ఠంచనుగా పింఛను తీసుకునే అవకాశాన్ని కల్పించింది. గత ప్రభుత్వ హయాంలో సాగిన దందాలు తాజాగా వెలుగులోకి వస్తున్నాయి. సదరం పత్రాల జారీలో అక్రమాలు, ఆధార్‌ కార్డులో పుట్టిన తేదీ మార్పులతో అక్రమంగా పింఛన్లు పొందుతున్న ఉదంతాలు బయటపడుతున్నాయి. ఇలా పింఛనుదారుల్లో మూడోవంతు అనర్హులు ఉన్నట్లు అంచనా. ఇదే తరుణంలో అన్ని రకాలుగా అర్హతలుండీ చాలా మంది పింఛను పొందలేకపోతుండడం గమనార్హం.

ఈనాడు, కడప: గత వైకాపా ప్రభుత్వ హయాంలో సామాజిక పింఛన్ల మంజూరులో వెలుగుచూస్తున్న అక్రమాలు అన్నమయ్య, వైఎస్‌ఆర్‌ జిల్లాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ వ్యవహారంపై తక్షణమే విచారణ చేపట్టాలని తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన ఎన్డీయే ప్రభుత్వ ఎమ్మెల్యేలు కోరుతుండడం విశేషం. సదరం పత్రాలు అక్రమంగా జారీ చేసిన వైద్యులపై క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలని డిమాండు చేస్తున్నారు. సామాజిక పింఛన్ల అంశంపై కడపలో మంగళవారం జరిగిన జిల్లా పరిషత్తు సమావేశంలోనూ ప్రత్యేక చర్చే జరిగింది.

గత ప్రభుత్వ హయాంలో అంగ వికలత్వంతో అల్లాడుతూ ప్రభుత్వ ఆసరా కోసం ఎదురుచూస్తున్న బాధితులకు సాంత్వన చేకూర్చడం వదలిపెట్టి అక్రమార్కులకు అధికారులు వంత పాడారు. కొందరు వైద్యులు. సదరం ధ్రువపత్రాల జారీ ద్వారా భారీ మొత్తంలో అక్రమ సంపాదన వెనకేసుకున్నారు. కడప ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలోని ఓ వైద్యుడు సదరం ధ్రువపత్రాల జారీలో చేసిన అక్రమాలపై గతేడాది అప్పటి వైకాపా ఎమ్మెల్యే జోక్యం చేసుకుని ఫిర్యాదు చేయడమే కాకుండా వెంటనే తొలగించాలని పట్టుబట్టారు. అర్హత లేనివారికి తప్పుడు సదరం ధ్రువీకరణ పత్రాలు జారీ చేసి అక్రమాలకు పాల్పడంతోపాటు పింఛన్ల రూపంలో ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారు. ప్రస్తుతం పింఛను మొత్తం పెంచిన తరుణంలో ఈ భారం మరింత పడనుంది. ఈ కోవలో వెలుగులోకి వచ్చిందే కమలాపురంలో ఒకే కుటుంబంలో ఏడుగురు వ్యక్తులు రెండేళ్లుగా అక్రమంగా పింఛన్లు పొందుతున్నారు. ఇలా అక్రమంగా పింఛన్లు పొందుతున్నట్లు అన్నమయ్య, వైఎస్‌ఆర్‌ జిల్లాల్లో పలు ఫిర్యాదులొచ్చినా పట్టించుకోలేదు.

దందా సాగిందిలా...

దివ్యాంగులు సామాజిక పింఛన్లు పొందాలంటే సదరం శిబిరంలో పరీక్షించుకుని ధ్రువీకరణ పత్రం పొందాలి. సదరం శిబిరంలో పాల్గొన్న వారు లంచాలిస్తే ఎంత శాతానికైనా వికలాంగత్వం నమోదు చేసి ధ్రువీకరణ పత్రాలిచ్చేశారు. లంచం ఇవ్వకపోతే వివిధ పథకాల కింద లబ్ధి పొందడానికి వీల్లేకుండా చేశారు. ఇలా అర్హులకు సరైన రీతిలో పత్రాలు అందకపోగా.. అనర్హులు మాత్రం కావాల్సినంతగా శాతానికి వికలాంగత్వం రాయించుకుని పత్రాలు పొందారు. ధ్రువీకరణ పత్రాలు విచ్చలవిడిగా  జారీచేసిన వైద్యుడికి మాజీ మంత్రి వివేకా హత్య కేసు నిందితుల్లో ఒకరి అండ ఉండడంతో అప్పట్లో ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఒక్కో పత్రానికి రూ.30 వేలు వరకు వసూలు చేశారు. అక్రమార్కులు సైతం వెనుకాడకుండా ఇచ్చేశారు. ఆధార్‌ కార్డులో పుట్టిన తేదీ మార్పిడికి రూ.6 వేలు వంతున వసూలు చేసే రాకెట్‌ నడుస్తోంది. ఇలాంటి దందాలు అన్నమయ్య జిల్లా రాయచోటి, రాజంపేట, పీలేరు, మదనపల్లె కేంద్రాలుగా కొనసాగాయి.

 • కమలాపురం మండలం సంబుటూరు సచివాలయ వాలంటీరు మూల నాగేశ్వరరెడ్డి చెన్నంపల్లెలో తన కుటుంబంలో ఏడుగురితోపాటు బంధువులో ఒకరికి ఇలా మొత్తం ఎనిమిది మందికి దివ్యాంగుల పింఛను మంజూరు చేయించారు. వాలంటీరు సోదరుడు పవన్‌కుమార్‌రెడ్డి (47), వదిన ఆదిలక్ష్మి (34), అన్న కుమారుడు (10), సతీమణి లక్ష్మీనరసమ్మ (30), కుమార్తె (8), కుమారుడు (10), పిన్నమ్మ కాంతమ్మ (45), మామ వరుసైన రామచంద్రారెడ్డి (56) పింఛను పొందుతున్నారు. వీరందరికీ చెవుడు ఉన్నట్లు కడప ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి వైద్యుడు ధ్రువపత్రాలు జారీ చేశారు.
 • వీరపునాయునిపల్లె మండలం పాయసంపల్లెలో ఎద్దు పొడిచినట్లుగా 91 మందికి సదరం పత్రాలు జారీ అయ్యాయి. గ్రామంతోపాటు పరిసరాల్లో ఎక్కడా ఎద్దుల జాడే లేకున్నా.. వాటి ద్వారా గాయమై అంగవైకల్యం చెందినట్లుగా పత్రాలు పొంది పింఛన్లు పొందుతున్నారు.
 • చాపాడు మండలం మడూరులో ఓ మహిళ భర్త బతికే ఉన్నా మరణించినట్లుగా ధ్రువీకరణ పత్రం పొంది వితంతు పింఛను అందుకుంటున్నారు. ఈ వ్యవహారం కలకలం రేపుతోంది. 
 • మైదుకూరు మండలం జాండ్లవరంలో భర్త ఉండగానే ఒంటరి మహిళ పేరుతో ఒకరు లబ్ధి పొందుతున్నారు. ఇలాంటివి కోకొల్లలుగా పలు గ్రామాల్లో వెలుగుచూస్తున్నాయి.

క్రిమినల్‌ కేసులు పెట్టాలి

అక్రమంగా సదరం పత్రాలు జారీ చేసిన వైద్యులను సస్పెండ్‌ చేయడంతో పాటు క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలి. అక్రమంగా పింఛను పొందిన వారి నుంచి వసూలు చేయాలి. ఈ మేరకు అనుమానితుల నుంచి ఈ నెలలో పత్రాలు రాయించుకుని పింఛను చెల్లించడం జరిగింది.

పుట్టా సుధాకర్‌యాదవ్, ఎమ్మెల్యే, మైదుకూరు

అర్హత ఉండీ ఇవ్వలేదు

కడప నగరంలోని శంకరాపురానికి చెందిన దొండేటి రమేష్‌ ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తుండగా రోడ్డు ప్రమాదంలో నడుము విరిగిపోయింది. గత రెండేళ్లుగా మంచానికే పరిమితమయ్యారు. కుటుంబ యజమాని మంచం పట్టడంతో కుటుంబం జీవనాధారం కోల్పోయింది. సదరం పత్రం కోసం ప్రయత్నించినా లభించలేదు. ఇలాంటి బాధితులు కోకొల్లలుగా ఉండగా.. అనర్హులు మాత్రం దర్జాగా లబ్ధి పొందుతున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  ap-districts
  ts-districts

  సుఖీభవ

  చదువు